తీపి కబురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు తీపి కబురందింది. కాంట్రాక్టు కార్మికులతో సహా ఉద్యోగులందరికీ 7 శాతం జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.252 కోట్ల భారం పడుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం వెల్లడించారు. కొడనాడు నుంచి సీఎం జయలలిత మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. కార్మికుల హక్కులు కాపాడటం, సుఖమయ జీవి తాన్ని అందుబాటులోకి తేవడం ప్రభుత్వ కర్తవ్యాలుగా భావిస్తోందని అన్నారు. విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం 2011 నవంబరు 30వ తేదీతో ముగిసిందని పేర్కొన్నారు. కొత్త ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అదే ఏడాది డిసెంబరు 16న వేతన సవరణ కమిషన్ను నియమించామని తెలిపారు. ఈ కమిషన్ 15 కార్మిక సంఘాలతో చర్చించి నివేదికను సిద్ధం చేసిందని తెలిపారు.
ఈ నివేదికలో పేర్కొన్న సిఫార్సుల ప్రకారం గడిచిపోయిన కాలం 2011 డిసెంబరు 1 నుంచి 2013 డిసెంబరు 31వ తేదీ వరకు పెంచిన వేతనాలను అందజేయాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. పెంచిన వేతనాలను కొత్త ఏడాది కానుకగా రెండు వాయిదాల్లో జనవరి, ఏప్రిల్ మాసాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. వేతన సవరణ ఒప్పదం 2015 నవంబరు 30వరకు అమల్లో ఉంటుందని సీఎం తెలిపారు. 70,820 మంది కార్మికులు, 10,160 మంది అధికారులు వేతన సవరణతో లబ్ధి పొందుతారని ఆమె చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.252 కోట్ల అదనపు భారం పడుతుందని ఆమె వివరించారు. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 670 మంది నర్సుల నియామకం చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో 741 నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిల్లో ప్రస్తుతానికి 670 ఖాళీలను భర్తీచేశామని చెప్పారు.