ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం
సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. జస్టిస్ రమణ నియామకాన్ని అధికారికంగా నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత జూన్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.మురుగేశన్ పదవీ విరమణ చేయడంతో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.డి.అహ్మద్ వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జస్టిస్ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా, పొన్నవరం గ్రామంలో గణపతిరావు, సరోజిని దంపతులకు జన్మించారు. కంచికచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అమరావతిలోని ఆర్.వి.వి.ఎన్ కాలేజీ నుంచి బీఎస్సీలో పట్టభద్రుడయ్యారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు.
1983లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరును నమోదు చేయించుకున్న ఆయన హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ), కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ల్లో ప్రాక్టీస్ చేశారు. ఆల్మట్టి డ్యామ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ప్రాతినిథ్యం వహించారు. రైల్వేలతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. అదనపు అడ్వొకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్ 27న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయ సదస్సుల్లో ప్రసంగించారు. ప్రస్తుతం ఏపీ జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా, న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2013, మార్చి 10న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సమయంలోనే ఆయన న్యాయవ్యవస్థలో తెలుగుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో జస్టిస్ రమణను హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు శుక్రవారం అభినందించారు.