
ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ రమణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నూతలపాటి వెంకట రమణ(56) ప్రమాణ స్వీకారం చేశారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ(56) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం ప్రమాణం చేయించారు. జస్టిస్ రాజేష్ కుమార్ అగర్వాల్(61) కూడా సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. వీరి చేరికతో సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 31కు చేరింది. చాలా కాలం తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఫుల్ బెంచ్ కొలువుతీరినట్టియింది.
వాస్తవానికి ఈ నెల 13నే జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది నేటికి వాయిదా పడింది. ఈ దశాబ్దంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పిన్న వయస్సులో నియమితులైనవారిలో జస్టిస్ రమణే తొలి వ్యక్తి. 2022, ఆగస్టు 26 వరకు సుప్రీంకోర్టులో కొనసాగుతారు. మరో విశేషమేమిటంటే సీనియార్టీ ప్రకారం 2021, ఏప్రిల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి పదవినీ అధిష్టించే అవకాశం ఉంది. ఏడాదిన్నర పాటు ఆ పదవిని అలంకరిస్తే... ప్రఖ్యాత న్యాయనిపుణుడు జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత ఆ ఘనత పొందిన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ రమణే అవుతారు.