మృతదేహంతో బంధువుల రాస్తారోకో
నూతనకల్
మరో వివాహం చేసుకునేందుకు అల్లుడే తమ కూతురిని పొట్టనబెట్టుకున్నాడని మండలంలోని పోలుమళ్లలో అనుమానాస్పదంగా మృతిచెందిన రాగిరి లావణ్య తల్లిదండ్రి ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి బంధువులు శనివారం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పోలుమళ్ల క్రాస్ రోడ్డులోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రి బొమ్మగాని లింగమ్మ–సైదులులు మాట్లాడుతూ తన బంధువుల అమ్మాయిని వివాహం చేసుకునేందుకే తమ కుతూరిని అడ్డుతొలిగించుకున్నాడని వాపోయారు. కంట్లో కారం చల్లి, గొడుగు సువ్వతో కంట్లో పొడవడంతో పాటు సర్జికల్ బ్లేడ్‌తో కోసి చంపాడని బోరున విలపిస్తూ చెప్పారు. గ్రామంలో నూతనంగా ఇళ్లు నిర్మించుకుంటుండగా 15రోజుల క్రితమే రూ.3లక్షలు అప్పజెప్పామన్నారు. వివాహ సమయంలో కట్నకానుకలుగా రూ.12లక్షలు, 10తులాల బంగారాన్ని ఇస్తే కూతురి ఊపిరి తీశాడని వాపోయారు. తమ కూతురు మూడు నెలల గర్భవతి అని తెలిపారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. చివరకు డీఎస్పీ సునితామోహన్ అక్కడకు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తుంగతుర్తి సీఐ లక్ష్మణ్ నూతనకల్, తుంగతుర్తి, తిరుమలగిరి ఎస్ఐలు బి.అభిలాష్, మహేష్, విజయేందర్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పోలీసు పహార మధ్య లావణ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
పోలీసుల అదుపులో నిందితుడు..?
లావణ్య అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లావణ్య భర్త లింగరాజును ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్త్నుట్టు తెలిసింది.హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు జాగిలంతో తనిఖీలు నిర్వహించినప్పటికీ అవి చుట్టూ తిరిగి లింగరాజు వద్దకే వచ్చినట్టు సమాచారం.