పటిష్టంగా కొత్త ఇసుక పాలసీస
మండల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
కలెక్టర్ యువరాజ్ ఆదేశం
విశాఖ రూరల్ : జిల్లాలో కొత్త ఇసుక పాలసీని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ అమలుకు విధివిధానాలు జారీ చేసిందని చెప్పారు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా ఆయా శాఖల అధికారులు సభ్యులుగా జిల్లా స్థాయి శాండ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఇసుక తవ్వకాలకు వీలున్న నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి, సరిహద్దులను నిర్ణయిస్తూ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు జిల్లా స్థాయి ఇసుక కమిటీ అప్పగించాల్సి ఉందన్నారు. ఆ నివేదికను ఈ నెల 8కి తనకు సమర్పించాలన్నారు. ఆయా ఇసుక తవ్వక ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జీలు, మండల మహిళా సమాఖ్యలతో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై అవగాహనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
తవ్విన ఇసుకను నిల్వ ఉంచేందుకు ప్రధాన రహదారుల దగ్గర్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచి, వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని చెప్పారు. తహశీల్దార్, ఎంపీడీఓ, పోలీసులతో మండల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్, అన్లోడింగ్ పనులకు ఉపాధి హామీ కూలీలను వినియోగించుకొనే అంశాన్ని పరిశీలించాలని డ్వామా పీడీని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, ఎస్పీ కోయ ప్రవీణ్, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములు నాయుడు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీపీఓ సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.