occuping
-
చంద్రబాబు భూబకాసురుడు
– బందరు పోర్టు పేరుతో 33,600 ఎకరాల దోపిడీకి కుట్ర – 27 నెలల్లో ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు – వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను జగ్గయ్యపేట అర్బన్ : మచిలీపట్నం పోర్టు పేరుతో మూడు పంటలు పండే విలువైన 33,600 ఎకరాల భూములను కైంకర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆరోపించారు. ఆయన బుధవారం తన గృహంలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో సారవంతమైన నిరుపేద రైతుల భూములను బలవంతంగా లాక్కొంటూ ముఖ్యమంత్రి భూబకాసురుడిలా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం 14వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. అయితే ఆ భూమి చాలదంటూ భూసేకరణ, సమీకరణ, ల్యాండ్ పూలింగ్... అంటూ వేలాది ఎకరాలను దోచుకోవటానికి రంగం సిద్ధం చేశారని చెప్పారు. పోర్టు నిర్మాణానికి 8 వేల ఎకరాల భూమి సరిపోతుందన్నారు. దేశంలో అతి పెద్దదైన ఒడిశాలోని పారాదీప్ పోర్టు కూడా 7వేల నుంచి 8 వేల ఎకరాల్లోనే నిర్మించారని తెలిపారు. ఈ భూ దోపిడీపై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అయినా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, విదేశాలకు వెళ్లి అగ్రిమెంట్లు చూపి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆర్థిక మంత్రి పర్మినెంట్ చేయబోమని చెప్పడం తగదన్నారు. పుష్కరాల సమయంలో ఇసుక కోసం తవ్విన గోతుల్లో పడి మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ఎండీ అక్బర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, రాష్ట్ర నాయకుడు కోటిగిరి గోపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నంబూరి రవి, యూత్ నాయకులు భవానీప్రసాద్, మోరె వినోద్, నాయకులు నూకల రంగా, సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దేవుడి భూముల కబ్జాపై విచారణ
విజయవాడ (వన్‌టౌన్) : ముత్యాలంపాడులోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి చెందిన 4.76 ఎకరాల భూమి సింగ్‌నగర్ సమీపంలో ఉంది. దానికి సంబంధించి గత ఏడాది ఆగస్టులో సహాయ కమిషనర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొని దాని నుంచి ఇతర అనుమతులకు సంబంధించిన కాగితాలను పుట్టించి 130 మందికి ప్లాట్లు వేసి విక్రయాలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే సహాయ కమిషనర్ జారీ చేసినట్లుగా చెబుతున్న నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ నకిలీదని దేవాదాయ శాఖ చెబుతోంది. పోలీసు శాఖ విచారణ ప్రారంభం.. స్థలానికి సంబంధించి అవినీతి బాగోతంపై ఫిర్యాదు అందుకున్న విజయవాడ గవర్నరుపేట పోలీసులు, ఇటీవల ‘సాక్షి’లో కథనం రావటంతో స్పందించారు. వెంటనే ఇక్కడి నుంచి బదిలీ అయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దుర్గాప్రసాద్‌ను నగరానికి రప్పించారు. జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయంలో ఆయనను సుమారు మూడు గంటలపాటు ఇటీవల విచారించారు. తాను జారీ చేసినట్లుగా చెబుతున్న ఆ ఉత్తర్వులు నకిలీవిగా దుర్గాప్రసాద్ పోలీసులకు స్పష్టం చేశారు. అలాగే సమాచార హక్కు చట్టం ద్వారా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి సహాయ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన లేఖలోని రిఫరెన్స్ నంబర్ కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో అంశానికి సంబంధించినదిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ఎవరైతే సమాచార హక్కు చట్టం ద్వారా ఆ భూముల వివరాలను అడిగిన వ్యక్తి కూడా ఆ దరఖాస్తుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు వివరించినట్లు తెలిసింది. కోర్టును ఆశ్రయించిన ఆక్రమణదారులు.. దేవాదాయ శాఖకు చెందిన సుమారు వంద కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాన్ని సృష్టించి అమ్మకాలు చేస్తే దానిని స్వాధీనం చేసుకోవటానికి ఏమాత్రం వేగవంతమైన చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఆ స్థలానికి సంబంధించి రెవెన్యూ శాఖకు, కలెక్టర్‌కు ఇప్పటి వరకూ ఫిర్యాదు చేయలేదు. అలాగే జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి రద్దు కోసం ప్రయత్నం చేయలేదు. దానితో పాటుగా నకిలీపత్రంతో సీఆర్డీఏ నుంచి పొందిన అనుమతులను కూడా రద్దు చేయించలేదు. అధికారుల సహకారంతోనే ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఆ స్థలానికి సంబంధించి న్యాయం చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు. అధికారులపై చర్యల్లేవ్.. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దుర్గాప్రసాద్ తన కార్యాలయం నుంచి జారీ అయిన నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ నకిలీదని, దానితో తనకు సంబంధం లేదని చేతులు దులుపుకొని ఇక్కడి నుంచి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు. అయితే అంత విలువైన స్థలం అన్యాక్రాంతమవుతుంటే సహాయ కమిషనర్‌గా ఉన్న అధికారి ఏమి చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.