చంద్రబాబు భూబకాసురుడు
చంద్రబాబు భూబకాసురుడు
Published Wed, Sep 21 2016 10:33 PM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
– బందరు పోర్టు పేరుతో 33,600 ఎకరాల దోపిడీకి కుట్ర
– 27 నెలల్లో ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు
– వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను
జగ్గయ్యపేట అర్బన్ :
మచిలీపట్నం పోర్టు పేరుతో మూడు పంటలు పండే విలువైన 33,600 ఎకరాల భూములను కైంకర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆరోపించారు. ఆయన బుధవారం తన గృహంలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో సారవంతమైన నిరుపేద రైతుల భూములను బలవంతంగా లాక్కొంటూ ముఖ్యమంత్రి భూబకాసురుడిలా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం 14వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. అయితే ఆ భూమి చాలదంటూ భూసేకరణ, సమీకరణ, ల్యాండ్ పూలింగ్... అంటూ వేలాది ఎకరాలను దోచుకోవటానికి రంగం సిద్ధం చేశారని చెప్పారు. పోర్టు నిర్మాణానికి 8 వేల ఎకరాల భూమి సరిపోతుందన్నారు. దేశంలో అతి పెద్దదైన ఒడిశాలోని పారాదీప్ పోర్టు కూడా 7వేల నుంచి 8 వేల ఎకరాల్లోనే నిర్మించారని తెలిపారు. ఈ భూ దోపిడీపై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అయినా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, విదేశాలకు వెళ్లి అగ్రిమెంట్లు చూపి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆర్థిక మంత్రి పర్మినెంట్ చేయబోమని చెప్పడం తగదన్నారు. పుష్కరాల సమయంలో ఇసుక కోసం తవ్విన గోతుల్లో పడి మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ఎండీ అక్బర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, రాష్ట్ర నాయకుడు కోటిగిరి గోపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నంబూరి రవి, యూత్ నాయకులు భవానీప్రసాద్, మోరె వినోద్, నాయకులు నూకల రంగా, సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement