30న కమలనాథన్ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కమలనాథన్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. కాగా, ప్రధాని ఆమోదముద్ర వేసిన కమిటీ మార్గదర్శకాలను కేంద్ర వ్యక్తిగత శిక్షణ మంత్రిత్వ శాఖ సోమ లేదా మంగళవారాల్లో వెబ్సైట్లో ఉంచనుంది.
హైదరాబాద్‌లోని సచివాలయంలో 30న జరగనున్న కమలనాథన్ కమిటీ భేటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు ఐ.వై.ఆర్. కృష్ణారావు, రాజీవ్ శర్మలతో పాటు కేంద్ర వ్యక్తిగత శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చన వర్మ, ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, రమేశ్‌లు పాల్గొంటున్నారు.
ఈ సమావేశంలో ఉద్యోగుల పంపిణీకి సంబంధించి టైం టేబుల్‌ను ఖరారు చేయనున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు తీసుకోవడానికి అనుకూలంగా ఆప్షన్ పత్రాన్ని కూడా ఖరారు చేయనున్నారు.
ఒక పక్క ఉద్యోగులందరినీ ఆప్షన్లు కోరుతూనే మరో పక్క ఇరు రాష్ట్రాల మధ్య ఏ శాఖలో ఏ విభాగంలో ఏ కేడర్‌లో ఎన్ని పోస్టులు ఉండాలో ఈ కమిటీ నిర్ధారించనుంది. ఆయా పోస్టుల కేటాయింపు అనంతరం ఉద్యోగులు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు కొంత సమయం ఇవ్వనున్నారు.
ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీక రణ పూర్తయిన తర్వాత తాత్కాలిక ప్రొవిజనల్ జాబితా పేరుతో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను పంపిణీ చేస్తారు. దీనిపైనా అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు వారం పది రోజులు సమయమిస్తారు. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ప్రొవిజనల్ జాబితా పేరుతో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను పంపిణీ చేస్తారు. ఈ జాబితాపైనా అభ్యంతరాలను తెలిపేందుకు కొంత సమయమిస్తారు. ఆ తరువాత ఉద్యోగుల పంపిణీ తుది జాబితాను విడుదల చేస్తారు.
మార్గదర్శకాలను ‘వెబ్’లో పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను కేంద్రం ఆమోదించినందున, తక్షణం వాటిని ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలని టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఫారెస్టు సెంట్రల్ ఫోరం సమావేశంలో ఆయన ప్రసంగించారు. మార్గదర్శకాల్లో అన్యాయం జరిగితే సహించమని హెచ్చరించారు.