Odd-Even car plan
-
మోదీజీ.. కాస్త సాయం చేయండి: కేజ్రీవాల్
అదేంటి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్రమోదీకి మధ్య ప్రస్తుతం వ్యవహారం ఉప్పు-నిప్పు అన్నట్లుంది కదా, ఈయన ఆయన్ని సాయం కోరడం ఏంటని అనుకుంటున్నారా? దేశ రాజధాని నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు తలపెట్టిన సరి-బేసి కార్ల ఫార్ములా అమలు విషయంలో తమకు సాయం చేయాలని కేజ్రీవాల్ అడిగారట. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయనో లేఖ రాశారు. కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులు, అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు కూడా రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టిన ఈ చర్యకు సహకరించేలా వారికి తగిన సూచనలు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ప్రధాని స్వయంగా చెబితేనే జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రణాళిక విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. -
'మంత్రులు, అధికారులకూ మినహాయింపు లేదు'
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము చేపట్టనున్న చర్యలకు సహకరిస్తామని కేంద్రం హామీయిచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నెలలో 15 రోజులు మాత్రమే ప్రైవేటు వాహనాలను అనుమతించేందుకు తాము చేపట్టనున్న చర్యలకు సహకరిస్తామని రాజ్ నాథ్ హామీయిచ్చారని చెప్పారు. మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు కూడా మినహాయింపు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ వుమెన్ డ్రైవర్స్, రోగులను తరలించే వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యాన్ని తగ్గించేందుకు జనవరి 1 నుంచి వాహనాల రాకపోకలను నియంత్రించాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. -
'బస్సులో వెళ్లేందుకైనా అభ్యంతరం లేదు'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్నినివారించడంలో సహకరించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే కోర్టుకు బస్సులో వెళ్లేందుకు తనకు అభ్యంతరమేమి లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. వాయు కాలుష్య నివారణకు జనవరి 1 నుంచి ఢిల్లీ ప్రభుత్వం అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ప్రణాళికకు ఆయన మద్దతు తెలిపారు. ఈ ప్రణాళిక ప్రకారం సరి-బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను దినం తప్పించి దినం రోడ్ల మీదకు అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో మోతిలాల్ నెహ్రూ మార్గ్ లో ఉన్న తన నివాసం నుంచి నడుచుకుంటూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకైనా, లేదా బస్సులో వెళ్లేందుకైనా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ సహచర న్యాయమూర్తులతో కలిసి కార్లను పంచుకుంటే.. ఈ విషయంలో సామాన్య ప్రజలకు కూడా సందేశం ఇచ్చినట్టు ఉంటుందని ఆయన చెప్పారు. కోర్టుకు వెళ్లేందుకు 'నడుచుకుంటూ వెళ్తాం లేదా బస్సు ఎక్కుతాం' అని ఆయన పేర్కొన్నారు. తమ పథకానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో జస్టిస్ టీఎస్ ఠాకూర్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీఆల్ కృతజ్ఞతలు తెలిపారు.