Offender arrested
-
కరుడుగట్టిన నేరస్తుడి అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఎంతోకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని కామారెడ్డి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్పీ శ్వేత ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఆర్ధాపూర్ తాలుకాలోని నుండుక గ్రామానికి చెందిన మిత్కారి లక్ష్మణ్ మరో ఆరుగురితో కలిసి బందిపోటు, దోపీడీలు, రాత్రిపూట దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతనిపై కామారెడ్డి, సంగారెడ్డి, జోగులంబ గద్వాల, మెదక్, నాందేడ్ జిల్లాల్లో 16 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ముఠాను పట్టుకునేందుకు కామారెడ్డి పోలీసులు ఎంతోకాలంగా గాలింపు చేపడుతున్నారు. గతేడాది మే నెలలో ఈ ముఠాలోని లక్ష్మణ్‌తో పాటు వ్యాపన్వాడ్ శంకర్, దండుగుల బాబులపై పీడీయాక్ట్ నమోదుకు కామారెడ్డి కలెక్టర్‌కు జిల్లా పోలీసుశాఖ సిఫారసు చేసింది. కలెక్టర్ ఆమోదంతో ముగ్గురిపై పీడీయాక్ట్ నమోదు అయింది. శంకర్, బాబులతో పాటు మిగిలిన ముఠా సభ్యులను గతంలోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. లక్ష్మణ్ మాత్రం ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చారు. ఆ తర్వాత వెంటనే అతడిని నిజామాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నేరస్తుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కామారెడ్డి ఎస్‌హెచ్‌వో జగదీష్, సీసీఎస్ సీఐ అభిలాష్, ఎస్సై శేఖర్, హెడ్‌కానిస్టేబుల్ నర్సింలు, కానిస్టేబుళ్లు ముకేష్, శ్రావణ్‌ను ఎస్పీ అభినందించారు. -
మహిళా ఎస్పీ కేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరూరు జిల్లా మహిళా ఎస్పీ వందితా పాండేను హతమార్చేందుకు పథకం పన్నిన కేసులో వెంకటేష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి సోమవారం సాయంత్రం పరుగు పరుగున వచ్చి ఎస్పీగారిని వెంటనే చూడాలని వచ్చిన వ్యక్తినే అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఎస్పీని హత్య చేస్తే తనకు రూ.10 లక్షలు ఇస్తానని ఇద్దరు అగంతకులు తనను మభ్యపెట్టగా భయంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చానని కరూరు జిల్లా పరమద్ది గ్రామానికి చెందిన వెంకటేశన్ (54) అనే అతను చెప్పడాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను తెచ్చిన బ్యాగులోని తుపాకీ, తూటాలను స్వాధీనం చేసుకుని వెంకటేశన్‌ను అరెస్ట్ చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. -
సీఎం సహాయ నిధి నుంచి డబ్బు ఇప్పిస్తానని మోసం
నిందితుడి అరెస్టు సిటీబ్యూరో: ఆయా కేసుల్లో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయిస్తానని పలువురిని నిలువునా దోచుకున్న ఓ మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా కథనం మేరకు...అనంతపురం జిల్లా జోగుల కొత్తపల్లికి చెందిన బంగారు సురేష్ (36) తనకు తాను సీఎం పేషీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీఏనంటూ పలువురిని మోసగించాడు. మల్కాజిగిరికి చెందిన అంజయ్య కుమారుడు కరీంనగర్లో గతేడాది సెప్టెంబర్ 10న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యాయని, మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలని అంజయ్యకు సురేష్ ఫోన్ చేసి చెప్పాడు. నిజమే అనుకున్న అంజయ్య అతను చెప్పిన ప్రకారం డిపాజిట్ కింద రూ.10 వేలు సురేష్ బ్యాంక్ అకౌంట్లో వేశాడు. సురేష్ ఇదే తీరులో పలువురు బాధితుల నుంచి డబ్బు వసూలు చేశాడు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు రాకపోవడంతో చివరకు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసు బుధవారం సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.