Office of the Registrar
-
బాలయ్య పీఏ చిందులు
రిజిస్ట్రార్ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ అధికారులపై బెదిరింపులకు దిగారు. తానే ఎమ్మెల్యే అయినట్లు వ్యవహరిస్తూ నోరు పారేసుకున్నారు. పోలీసు ప్రజాబాట పేరుతో జిల్లా ఎస్పీ హిందూపురంలో ఉండగానే చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్ గోపాల్ కృష్ణ, ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ చంద్రప్పను బెదిరించారు. వివరాల్లోకి వెళితే.. గురువారం సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉండగా ఇన్చార్జ్ సీనియర్ క్లర్క్ చంద్రప్పకు బాధ్యతలు అప్పగించారు. ఆ రోజు సుమారు 400 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్టర్ చేశారని మండల వ్యాప్తంగా వదంతులు వచ్చాయి. శుక్రవారం హిందూపురం చేరుకున్న బాలకృష్ణ పీఏ శేఖర్‌కు ఈ విషయాన్ని అక్కడి నాయకులు తెలిపారు. దీంతో ఆయన మందీ మార్బలంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అధికారి చంద్రప్పపై ధ్వజమెత్తారు. ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తానన్నారు. అసైన్డ్ ల్యాండ్‌ను ఎలా రిజిస్ట్రర్ చేశారని మందలించారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు 42 ఎకరాలు మాత్రమే రిజిస్టర్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని శేఖర్.. నా అనుమతి లేనిదే ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగరాదని హుకుం జారీ చేశారు. కాగా, హైకోర్టు ఉత్తర్వులు పాటించి రిజిస్టర్ చేయకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కేసులు వేస్తామని ఒక పక్క వ్యాపారుల బెదిరింపులు, రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ పీఏ బెదిరింపుల నేపథ్యంలో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ గోపాలక్రిష్ణను సాక్షి ఫోన్లో సంప్రదించగా..‘ఎంఎల్ఎ పీఎ కార్యాలయానికి వచ్చి ఆరా తీసిన మాట వాస్తవమే. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తుండడంతో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూదు. మీడియాలో వచ్చిన కథనాలపై విచారణ జరపాలి’ అని చెప్పారన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన వ్యవహారం చూసిన వారు ‘ఎమ్మెల్యే బాలకృష్ణ బిజీ కాబోలు.. అందుకే ఆయన పీఏకు అధికారం అప్పగించారని’ వ్యాఖ్యానించారు. -
కూలిపోయే ప్రభుత్వమిది : పేర్ని
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే దశలో దస్తావేజు లేఖరులను రోడ్డున పడేసే నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తగదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను మీసేవకు బదలాయించి, దస్తావేజు లేఖరుల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు పూనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు చేపట్టిన విధుల బహిష్కరణ కార్యక్రమం శనివారానికి మూడో రోజుకు చేరుకుంది. రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రిజిస్ట్రార్ కార్యాలయ గేట్లను మూసివేసి నిరసన తెలుపుతుండడంతో మూడు రోజులుగా కార్యకలాపాలకు త్రీవ అంతరాయం ఏర్పడింది. నిరసనకు పేర్ని మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 2014 జనవరి 24వ తేదీన నేటి రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంద ని చెప్పారు. ప్రభుత్వం ఆవసాన దశలో ఉన్నా... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు, దస్తావేజు లేఖరులను బజారున పడేసేందుకు నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను మీ సేవ కేంద్రాలకు బదలాయించాలని నిర్ణయం తీసుకోవడం తగదని తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధానం కారణంగా జీవనోపాధికోసం పని చేస్తున్న దస్తావేజు లేకరులు రోడ్డున పడనున్నారన్నారు. ధర్నా శిబిరాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి మద్దతు తెలిపారు. ధర్నాలో దస్తావేజు లే ఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జంపాన రవిశంకర్, ఉపాధ్యక్షుడు నరహరిశెట్టి తుకారం, వెంట్రప్రగడ వేణుగోపాలరావు, కార్యదర్శి వాడపల్లి బాలాజీసువర్ణకుమార్, సభ్యులు సర్ధార్ రహీమ్, మేకా శ్రీను, బోయిన దుర్గాప్రసాద్, నున్నా ఇందుప్రసాద్, దొంతు వెంకటేశ్వర్లు పలువురు దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.