Officer transfer
-
వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారి బదిలీ
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి సుధాసింగ్ బదిలీ అయ్యారు. ఈ నెల 24న ఆమె విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆమె స్థానంలో రామ్‌కుమార్ అనే ఎస్పీ స్థాయి అధికారి నియమితులయ్యారు. ఆదివారం కడపకు వచ్చిన ఆయన కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వివేకా హత్య కేసులో మరికొంతమందిని సీబీఐ అధికారుల బృందం సోమవారం నుంచి విచారించనుంది. -
కోర్టులో ఓ మూలన కూర్చోండి
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఓ అధికారిని బదిలీ చేసిన ఘటనలో కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అంతేకాదు సాయంత్రం కోర్టు సమయం ముగియక ముందే మరోసారి వెళ్లేందుకు అనుమతి అడగ్గా.. రేపటి వరకూ కోర్టులోనే ఉంటారా.. అంటూ ఆగ్రహించింది. బిహార్‌లోని వసతిగృహాల్లో బాలికలపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలపై విచారణ జరుపుతున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను అప్పటి సీబీఐ డైరెక్టర్ అయిన ఎం.నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమి తులైన సమయంలోనే ఎటువంటి బదిలీలు చేయడానికి వీల్లేదని కోర్టు అప్పట్లో పేర్కొంది. అయితే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఆయన బదిలీ చేశారు. దీనికి సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టులో సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తమ ఉత్తర్వులను ధిక్కరించారని, ఇందుకు గాను ఆయనకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. నాగేశ్వరరావుతోపాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని పేర్కొంటూ ఆయనకూ జరిమానా విధించింది. అలాగే కోర్టు సమయం పూర్తయ్యే వరకు కోర్టు ప్రాంగణంలోనే ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎల్ఎన్ రావు, సంజీవ్ కన్నాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు వారిరువురు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సైతం న్యాయస్ధానం తోసిపుచ్చింది. కోర్టుకు ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తామని, అయితే దీనికోసం వారు 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చని అని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఏమైనా చెబుతారా అంటూ వారిద్దరిని ప్రశ్నించింది. ఈ సమయంలో సీబీఐ తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయలేదని, ఇందుకు ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని బదిలీ చేయకూడదని నాగేశ్వరరావుకి తెలుసని, తాను ఏది అనుకున్నానో అదే చేశాను అనేలా ఆయన ధోరణి ఉందని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాయంత్రం వరకూ కోర్టులోనే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అదనపు డైరెక్టర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరామ్‌లు సాయంత్రం కోర్టు వేళలు ముగిసే వరకు కోర్టులోనే గడిపారు. అనంతరం కోర్టు నుంచి వెళ్లి పోయారు. -
'కళా 'పవర్‌కు ఎస్ఈ చిత్తు!
అరసవల్లి: జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఓ అధికారి బదిలీకి కారణమయ్యాయి. వీరి ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. గడిచిన మూడేళ్లలో పలువురు అధికారులు రాజకీయ జోక్యంతోనే బదిలీలకు, క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. తాజాగా రెండో మంత్రిగా కళా వెంకట్రావు జిల్లాలో అడుగుపెట్టడం..అందులోనూ విద్యుత్ శాఖ మంత్రి కావడంతో తొలి వేటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారిపైనే పడింది. వాస్తవానికి ముక్కుసూటి ధోరణి, సున్నిత మనస్తత్వం ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ దత్తి సత్యనారాయణ కేవలం ఏడాదిన్నర కాలమే విధుల్లో చేరారు. అయితే ఈయన్ను ఆకస్మికంగా బదిలీ చేస్తున్నట్లు సీఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులు వెనుక పెద్ద కథే నడిచిందనే ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావుకు, మరో మంత్రి అచ్చెన్నాయుడుకు మధ్య కొంత కాలంగా ఆధిపత్యపోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ.. ఏ అవకాశమొచ్చినా..వెంటనే దాన్ని అమలు చేసేలా పావులు కదుపుతున్నారు. జిల్లాలో అనుకూల నాయకులపైన, లేదంటే అనుకూలంగా పనిచేశారన్న నెపంతో ఉద్యోగులపై తమ ప్రతాపాలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణపై బదిలీవేటు పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో మరికొంతమంది అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఈ ఆకస్మిక బదిలీని అన్ని విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. మంత్రుల తీరుపై భగ్గుమంటున్నారు. పైచేయి కోసం..! జిల్లా నుంచి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖామంత్రిగా, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా కళావెంకట్రావులు కొనసాగుతున్నారు. అయితే గతేడాది నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి వెళ్లిందని చెప్పవచ్చు. ఇటీవల మంత్రి అచ్చెన్న ప్రధాన అనుచరులైన జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మికి ముద్దాడ ఇసుకరీచ్‌ను పూర్తిగా రద్దు చేయించి, జిల్లాలో ఆధిపత్యపోరులో ఒక మెట్టు ఎక్కిన మంత్రి కళా.. మరోసారి ద్వితీయ విఘ్నం దాటేయ్యాలని భావించి, అచ్చెన్నకు అనుకూలంగా ఉన్నారన్న నెపంతో ఎస్ఈ సత్యనారాయణపై బదిలీ వేటు వేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. గత నెలలో టెక్కలి నియోజకవర్గంలో విద్యుత్ శాఖాధికారులతో జిల్లా విద్యుత్ ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి అచ్చెన్న సమీక్ష చేయడమే మంత్రుల మధ్య మరింత వివాదానికి ఆజ్యం పోసిందని పలు ఉద్యోగ సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. ఈసమీక్షలో విద్యుత్ శాఖ చేయాల్సిన విధివిధానాలను అచ్చెన్న డిక్టేట్ చేయడంపై సంబంధిత శాఖ మంత్రి కళాకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. నిజానికి విద్యుత్ శాఖామంత్రి కళా నిర్ణయాన్ని కాదని, కేవలం అచ్చెన్న చెప్పిన పనులను చేయడం ఎస్ఈగా సత్యనారాయణకు పూర్తిగా అసాధ్యమే. అయినప్పటికీ కళాకు చెందిన ముఖ్య అనుచరుల ధ్వయం చేసిన ఓవర్ యాక్షన్‌తో మంత్రి కళా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం తన సహజశైలికి భిన్నంగా ఎస్ఈపై బదిలీకి సిఫారసు చేయించి నట్లు సమాచారం. అలాగే దీన్నే నెపంగా చూపుతూ అచ్చెన్నకు అనుకూలంగా ఉన్న అధికారులను జిల్లాలో వదిలిపెట్టేది లేదంటూ మంత్రి ‘కళా’ హెచ్చరికలు పంపినట్లుగా పలువురు భావిస్తున్నారు. నిమ్మాడ...రాజాం మధ్యలో ఉద్యోగులు! అటు నిమ్మాడ...ఇటు రాజాం...మధ్యలో ఉద్యోగులు..అన్నట్లుగా తయారయ్యింది జిల్లాలో ఉద్యోగుల పరిస్థితి. ఎవరికి కోపమొచ్చినా..ఏం జరుగుతుందో అనే ఆందోళన వీరిలో నెలకొంది. ఉద్యోగ నిబంధనల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్లు ప్రజాసేవ నిమిత్తం పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో అధికార పార్టీ నేతలకు ప్రతిపక్షంలో ఉన్న నేతల కంటే అన్నింట్లోనూ అగ్రతాంబూలమే అని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇందుకోసం వివాదాలకు దూరంగా అధికారులు, ఉద్యోగులు అధికార పార్టీ నేతలకు సహజంగా అనుకూలంగా పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ జిల్లాలో మాత్రం పరిస్థితి దారుణంగా, విచిత్రంగా తయారైంది. వివిధ ప్రాంతాల్లో పనులు, నిర్ణయాల విషయంలో ఇద్దరు మంత్రులకు అనుకూలంగా వెళ్లే పరిస్థితులు ఉద్యోగులకు లేవు. అలా అని ఒక మంత్రికి అనుకూలమైతే, రెండో మంత్రితో చర్యలు తప్పవనే సంకేతాలు ఇప్పటికే కొందరు అధికారులు రుచిచూశారు. దీంతో అనుకూలతలో కూడా అప్రమత్తంగా ఉండేలా అధికారులు పావులు కదుపుతున్నారు. సుమారు ఓ ఏడాది పాటు కళ్లు మూసుకుంటే ఆ తర్వాత పరిస్థితులు మారవచ్చుననే సంకేతాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ శాఖల్లో ఏ ప్రతిపాదనలు వచ్చినా జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి కోర్టులో పడేసి కొందరు చేతులు దులుపుకుంటుంటే..మరికొందరు తమ ప్రాంతం ప్రతిపాదనలకు, పనులకు అనుకూలం కాదంటూ సర్టిఫై చేయించుకుంటూ కప్పదాటు ప్రయత్నాలకు తెరతీస్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరి మంత్రుల మధ్య ఆధిపత్యపోరు ఇంకెంత మందిని బలితీసుకుంటుందో అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
‘డ్వామా’లో ‘ల్యాప్‌టాప్’ దుమారం!
* బదిలీపై వెళ్తూ తీసుకెళ్లిన మాజీ పీడీ * ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన ఇందూరు: ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీపై వెళుతూ సుమారు రూ.40 వేలు విలువ చేసే, ముఖ్యమైన సమాచారం కగిలిన లాప్‌ట్యాప్‌ను పట్టుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్యవహారం సంబంధిత సెక్షన్ ఉద్యోగికి మెడకు చుట్టుకుంది. మొన్నటి వరకు డ్వామా పీడీగా బాధ్యతలు నిర్వర్తిం చిన శివలింగయ్య ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్డీఓగా గత ఆక్టోబర్ 13న బదిలీపై వెళ్లారు. ఇక్కడ పని చేసిన కాలంలో ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన లాప్‌ట్యాప్‌ను వినియోగించేవారు. వెళ్తూ వెళ్తూ ఎవరికి చెప్పకుండా దానిని వెంట తీసుకెళ్లారు. అందులో డ్వామా కార్యాలయానికి సంబంధించిన విలువైన సమాచారం ఉంది. రవి అనే ఉద్యోగి పేరుపై శివలిం గయ్య తీసుకెళ్లిన లాప్‌ట్యాప్ ఉంది. తిరిగిస్తారు కదా అనుకున్న ఆ ఉద్యోగికి ప్రస్తుతం మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. లాప్‌ట్యాప్ ఇవ్వాలని నాలుగైదుసార్లు నిర్మల్‌కు వెళ్లి కలిసినా ‘‘అప్పుడిస్తాను... ఇప్పుడిస్తాను’’ అని మభ్యపెట్టి ఉద్యోగిని తిరిగి పంపిం చారు. ‘‘సార్... లాప్‌ట్యాప్ ఇవ్వండి.. లేదంటే నా ఉద్యోగం పోతుందని పలుమార్లు ఫోన్లో బతిమాలినా ఇవ్వలేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో సెక్షన్ ఉద్యోగిపై డ్వామా ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు.డ్వామాకు ప్రస్తుతం ఇన్చార్జ్ పీడీగా జడ్ పీ సీఈఓ రాజారాం కొనసాగుతున్నారు. మరికొన్ని లాప్ట్యాప్లూ పక్కదారి డ్వామా కార్యాలయానికి సంబంధించిన ల్యాప్‌ట్యాప్‌ను శివలింగయ్య పట్టుకెళ్లిన విషయం కార్యాల యంలో చర్చగా మారింది. అదొక్కటే కాకుండా మరి కొన్ని లాప్‌ట్యాప్‌లు కూడా శిశలింగయ్య హాయంలో నే పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన హయాంలో దాదాపు 15 లాప్‌ట్యాప్‌లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో ఐదు లాప్‌ట్యాప్‌లను కొందరు ఉద్యోగులు పక్కదారి పట్టించినట్లు తెలిసింది. ఇటీవలే ఐదు కంప్యూటర్లు కొనుగోలు చేశామని బిల్లులు సైతం పెట్టినట్లు తెలిసింది. విషయం ఇన్చార్జ్ పీడీ దృష్టికి రాగా, వాటిని చూపించాలని కోరినట్లు తెలిసింది. లాప్‌ట్యాప్‌ల బాగోతాన్ని వెలికి తీసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అ క్రమాల డొంక తీగ లాగితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. ‘‘గతంలో పని చేసిన డ్వామా పీడీ శివలింగయ్య శాఖకు సంబంధించిన లాప్‌ట్యాప్‌ను తీసుకెళ్లిన విషయం నా దృష్టికి రాలేదు. సంబంధిత సెక్షన్ ఉద్యోగి కూడా చెప్పలేదు. ఈ విషయంపై విచారణ చేపట్టి లాప్‌ట్యాప్‌ను రికవరీ చేయిస్తాం’’ ఇన్చార్జ్ పీడీ వివరించారు.