officers busy
-
రెండు ముక్కలే..!
సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై వెనక్కు తగ్గిన సర్కారు ఆయా మండలాలు కరీంనగర్‌లోనే కొనసాగింపు జగిత్యాల జిల్లా స్వరూపంపై స్పష్టత మ్యాపులు సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం ఉద్యోగుల విభజన కసరత్తులో బిజీబిజీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తగిన మండలాలు లేకపోవడం, చొప్పదండి నియోజకవర్గంలోని మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లాలో కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న కరీంనగర్ జిల్లాను రెండు ముక్కలుగా విభజించి కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా మాత్రమే ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ప్రతిపాదిత సిరిసిల్ల జిల్లాలోని మండలాలను పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కలపాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్ నీతూప్రసాద్‌కు సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ కరీంనగర్, జగిత్యాల జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఎన్ఐసీ అధికారులు కరీంనగర్, జగిత్యాల ప్రతిపాదిత జిల్లాల మ్యాపులను సిద్ధం చేయడంతోపాటు ఏ జిల్లాకు ఎంతమంది ఉద్యోగులను కేటాయించాలనే కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్లో 28, జగిత్యాలో 16 మండలాలు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న 57 మండలాలను నాలుగు ప్రతిపాదిత జిల్లాలకు సర్దుబాటు చేశారు. భూపాలపల్లి జిల్లాలో నాలుగు, వరంగల్ జిల్లాలో ఐదు, సిద్దిపేట జిల్లాలో నాలుగు మండలాలను కలపాలని ప్రతిపాదించారు. అట్లాగే 16 మండలాలతో జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. ఇవిపోగా మిగిలిన 28 మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలను సిద్దిపేట జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలను వరంగల్ జిల్లాకు కేటాయించారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోకవర్గాల్లోని 12 మండలాలతోపాటు వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు, చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలను జగిత్యాల జిల్లాలో కలపాలని సూచించారు. పైన పేర్కొన్న మండలాలు పోగా ప్రస్తుత జిల్లాలోని 28 మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులుంటాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడేవరకు మార్పులుండే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. కొత్త మండలాలపై సందిగ్ధత కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతమున్న 57 మండలాలకు తోడు అదనంగా మరో 17 కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇందులో ఒక్క సిరిసిల్ల డివిజన్‌లోనే ఆరు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అట్లాగే ప్రస్తుతమున్న కరీంనగర్ మండలాలన్ని కొత్తగా నాలుగు మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రామగుండం మండలాన్ని మూడుగా విభజించాలని సూచించారు. పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ మండలాలను రెండుగా విభజించాలని పేర్కొన్నారు. కొత్త మండలాల సంఖ్యను కుదించాలని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మళ్లీ మండలాలను కుదించే పనిలో పడ్డారు. ఇటీవల ప్రతిపాదించిన 17 మండలాలను తాజాగా ఎనిమిది నుంచి పదికి కుదించాలని యోచిస్తున్నారు. సోమవారం నాటికి ఈ ప్రక్రియకు తుదిరూపు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు బెజ్జంకి, ఇల్లంతకుంట, హుస్నాబాద్ మండలాలను సిద్దిపేట జిల్లాలో ప్రతిపాదించినప్పటికీ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఉద్యోగుల విభజన షురూ... రెవెన్యూ డివిజన్, ఆ పైస్థాయి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని రెండు జిల్లాలకు విభజించే పనిలో పడ్డారు. జిల్లావ్యాప్తంగా 54 శాఖల వివరాలను సేకరించగా 7732 మంది ఉద్యోగులున్నట్లు గుర్తించారు. వీరిని కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు కేటాయించే కసరత్తు కొనసాగిస్తున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాకు 2085 మంది, జగిత్యాల జిల్లాకు 2072 మంది, సిరిసిల్ల జిల్లాకు 2053 మందిని కేటాయిచాలని ప్రతిపాదించారు. తాజాగా సిరిసిల్లకు కేటాయించిన వారిని మిగిలిన రెండు జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు. -
ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో అధికారులు ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. రోజువారీ విధుల్లో బిజీగా ఉండే అధికారులు ఎన్నికలు రావడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల్లో ఎన్నికల సందడి కనబడుతోంది. విద్యాశాఖలో పరీక్షల ఏర్పాట్లు, పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలు, పంటనష్టం సర్వేలో వ్యవసాయశాఖ, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో అన్ని శాఖల్లో ఆడిట్ గోల కన్పిస్తోంది. మున్సిపల్ : మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 3న, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు 5న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు చూస్తున్నారు. ఇది వరకే కేంద్రాల సంఖ్య గు ర్తించినప్పటికీ తాజాగా ఓటర్లు పెరగడంతో కేంద్రాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లకు సంఖ్యకు అనుగుణం గా పోలింగ్ కేంద్రాలను మరోమారు పరిశీలిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 10 నుంచి నామినేషన్లు స్వీకరించనుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వార్డుకు ఒక సూపర్వైజర్గా నియమించి ని యమావళిని అమలుచేసేందుకు అధికారులు చర్యలు తీసు కుంటున్నారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కోడ్ నిబంధనలు, వివిధ అంశాలను చర్చించారు. సార్వత్రిక : సార్వత్రిక ఎన్నికల్లో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖలు కీలకం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సుమారు 14 వేల మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి తదితర బాధ్యతలు చేపట్టి అధికారులు ఎన్నికలకు రెడీగా ఉన్నారు. రిటర్నింగ్ అధికారులుగా ఆర్డీవో స్థాయి అధికారులను నియమించగా, జిల్లాస్థాయి అధికారులకు నోడల్ అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల కోసం కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 9న అన్ని బూత్ స్థాయి కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించాలని వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ దృష్టి సారించారు. శాంతి భద్రతలు : ఒకేసారి మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు రావడంతో పోలీస్‌శాఖకు శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ప్రత్యేక బలగాలను నియమిస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా బలగాలను దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న ఐదు, 5న 11, 6న 16 మందిపై ఆక్రమ మద్యం రవాణా కేసులు పెట్టారు. 2,600 క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. 3 వేల బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో తొమ్మిది సెంట్రల్ పారామిలటరీ బలగాల కోసం ప్రతిపాదనలు పంపగా, జిల్లాకు ఆరు చేరుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల మధ్య వివాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గాల వారీగా పాత నేరస్థులను బైండోవర్లు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాకు నలుమూలల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉండడంతో అక్కడి నుంచి అక్రమంగా దేశీదారు తీసుకువచ్చే ప్రమాదం ఉండడంతో చెక్‌పోస్టులను బలోపేతం చేసి అడ్డుకట్ట వేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారులో : పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసేపనిలో బిజీగా ఉన్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానప్పటికీ రిజర్వేషన్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. పంటనష్టం సర్వే : జిల్లాలో మూడు రోజులుగా అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు సర్వే చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అకాల వర్షాల కారణంగా రబీ సీజన్లో వేసిన పంటలు ఇప్పటివరకు 2,300 హెక్టార్లలో దెబ్బతిన్నాయని అంచనాకు వచ్చిన వ్యవసాయ శాఖ తాజాగా మళ్లీ వర్షాలు కురవడంతో సర్వేను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టంపై ప్రాథమిక సర్వే పూర్తి చేసి ప్రతిపాదనలు తయారు చేయనున్నారు. పరీక్షల ఏర్పాట్లలో విద్యాశాఖ : ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు బిజీగా ఉన్నారు. డిగ్రీ పరీక్షలు కొనసాగున్నా మరో పక్క ఇంటర్ పరీక్షలు ఈ నెల 12న, పదో తరగతి పరీక్షలు 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. దీంతో ఇన్విజిలేటర్లకు బాధ్యతలను అప్పగించడం, డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించే పనుల్లోనే ఉన్నారు. ఈ నెల 16న టెట్ పరీక్ష కూడా జరుగనుండడంతో ఆ వైపు దృష్టి సారించి ఏర్పాట్ల పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించిన వారికి ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పడం లేదు. పోస్టుల భర్తీలు : ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో రెండు శాఖ బిజీగా ఉన్నాయి. అటవీ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఐసీడీఎస్‌లో అంగన్వాడీ పోస్టుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ కౌమార బాల, బాలికల ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగుతుండడంతో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో అన్ని శాఖల్లో అడిట్ సందడి కూడా కన్పిస్తోంది. ఈ నెల 31 వరకు జరుగుతుంది.