రెండు ముక్కలే..!
-
సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై వెనక్కు తగ్గిన సర్కారు
-
ఆయా మండలాలు కరీంనగర్‌లోనే కొనసాగింపు
-
జగిత్యాల జిల్లా స్వరూపంపై స్పష్టత
-
మ్యాపులు సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం
-
ఉద్యోగుల విభజన కసరత్తులో బిజీబిజీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తగిన మండలాలు లేకపోవడం, చొప్పదండి నియోజకవర్గంలోని మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లాలో కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న కరీంనగర్ జిల్లాను రెండు ముక్కలుగా విభజించి కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా మాత్రమే ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ప్రతిపాదిత సిరిసిల్ల జిల్లాలోని మండలాలను పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కలపాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్ నీతూప్రసాద్‌కు సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ కరీంనగర్, జగిత్యాల జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఎన్‌ఐసీ అధికారులు కరీంనగర్, జగిత్యాల ప్రతిపాదిత జిల్లాల మ్యాపులను సిద్ధం చేయడంతోపాటు ఏ జిల్లాకు ఎంతమంది ఉద్యోగులను కేటాయించాలనే కసరత్తు చేస్తున్నారు.
కరీంనగర్‌లో 28, జగిత్యాలో 16 మండలాలు
ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న 57 మండలాలను నాలుగు ప్రతిపాదిత జిల్లాలకు సర్దుబాటు చేశారు. భూపాలపల్లి జిల్లాలో నాలుగు, వరంగల్ జిల్లాలో ఐదు, సిద్దిపేట జిల్లాలో నాలుగు మండలాలను కలపాలని ప్రతిపాదించారు. అట్లాగే 16 మండలాలతో జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. ఇవిపోగా మిగిలిన 28 మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలను సిద్దిపేట జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలను వరంగల్ జిల్లాకు కేటాయించారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోకవర్గాల్లోని 12 మండలాలతోపాటు వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు, చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలను జగిత్యాల జిల్లాలో కలపాలని సూచించారు. పైన పేర్కొన్న మండలాలు పోగా ప్రస్తుత జిల్లాలోని 28 మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులుంటాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడేవరకు మార్పులుండే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.
కొత్త మండలాలపై సందిగ్ధత
కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతమున్న 57 మండలాలకు తోడు అదనంగా మరో 17 కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇందులో ఒక్క సిరిసిల్ల డివిజన్‌లోనే ఆరు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అట్లాగే ప్రస్తుతమున్న కరీంనగర్ మండలాలన్ని కొత్తగా నాలుగు మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రామగుండం మండలాన్ని మూడుగా విభజించాలని సూచించారు. పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ మండలాలను రెండుగా విభజించాలని పేర్కొన్నారు. కొత్త మండలాల సంఖ్యను కుదించాలని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మళ్లీ మండలాలను కుదించే పనిలో పడ్డారు. ఇటీవల ప్రతిపాదించిన 17 మండలాలను తాజాగా ఎనిమిది నుంచి పదికి కుదించాలని యోచిస్తున్నారు. సోమవారం నాటికి ఈ ప్రక్రియకు తుదిరూపు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు బెజ్జంకి, ఇల్లంతకుంట, హుస్నాబాద్ మండలాలను సిద్దిపేట జిల్లాలో ప్రతిపాదించినప్పటికీ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
మళ్లీ ఉద్యోగుల విభజన షురూ...
రెవెన్యూ డివిజన్, ఆ పైస్థాయి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని రెండు జిల్లాలకు విభజించే పనిలో పడ్డారు. జిల్లావ్యాప్తంగా 54 శాఖల వివరాలను సేకరించగా 7732 మంది ఉద్యోగులున్నట్లు గుర్తించారు. వీరిని కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు కేటాయించే కసరత్తు కొనసాగిస్తున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాకు 2085 మంది, జగిత్యాల జిల్లాకు 2072 మంది, సిరిసిల్ల జిల్లాకు 2053 మందిని కేటాయిచాలని ప్రతిపాదించారు. తాజాగా సిరిసిల్లకు కేటాయించిన వారిని మిగిలిన రెండు జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు.