జగిత్యాల: గతంలో ఏపీ పాలకులకంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఎక్కువ ముంచారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ కాలంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో లక్షల మందిని జైళ్లలో ఉంచారని మండిపడ్డారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనకు తేడా ఏంటో ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు.
'తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు?. ఎవరి చేతిలో అధికారం ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో ప్రజలు తెలుసుకోవాలి. ఎవరు నిజమైన సిపాయిలో ప్రజలు గుర్తించాలి. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని చీకటి రోజులే. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. నీళ్ల పన్ను లేని రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే.' అని సీఎం కేసీఆర్ చెప్పారు.
రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.. రైతు బంధు ఉండాలా? వద్దా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రైతు బంధును రూ.16 వేలు చేస్తామని ప్రకటించారు. ధరణి స్థానంలో భూమాత తెస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. కానీ అది భూమాత కాదు భూమేత అని ఎద్దేవా చేశారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమేనని చెప్పారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే అంతా ఆగమాగమేనని పేర్కొన్నారు.
ఒకే ఒక్క ఆయుధం ఓటు..
ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వచ్చాయని ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గమనించండి.. ఓటు వేసే ముందు ఆలోచించి వేయండని సూచించారు. ప్రజలకు ఒకే ఒక్క ఆయుధం ఓటు.. వేసే ఓటులో తేడా వస్తే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. దుబ్బాకలో జరిగిన ఎన్నికల సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
'ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చూపించేవారు వస్తారు.. వారి మాటలు నమ్మకండి. మీరు వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది. ఆలోచించి ఓటు వేస్తే దేశం ముందుకు సాగుతుంది. ఓటు వేసే ముందు అభ్యర్థి వెనుక పార్టీ చరిత్రను గమనించండి. ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు చెబుతుంటారు. ఎంతో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. మళ్లీ ఆగమైతే రాష్ట్రం వెనక్కిపోతుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం.' అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇదీ చదవండి: ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment