ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలు | officers busy in election arrangements | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలు

Published Sat, Mar 8 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

officers busy in election arrangements

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో అధికారులు ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. రోజువారీ విధుల్లో బిజీగా ఉండే అధికారులు ఎన్నికలు రావడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల్లో ఎన్నికల సందడి కనబడుతోంది. విద్యాశాఖలో పరీక్షల ఏర్పాట్లు, పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలు, పంటనష్టం సర్వేలో వ్యవసాయశాఖ, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో అన్ని శాఖల్లో ఆడిట్ గోల కన్పిస్తోంది.

 మున్సిపల్ : మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 3న, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు 5న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను మున్సిపల్  అధికారులు చూస్తున్నారు. ఇది వరకే కేంద్రాల సంఖ్య గు ర్తించినప్పటికీ తాజాగా ఓటర్లు పెరగడంతో కేంద్రాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లకు సంఖ్యకు అనుగుణం గా పోలింగ్ కేంద్రాలను మరోమారు పరిశీలిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 10 నుంచి నామినేషన్లు స్వీకరించనుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వార్డుకు ఒక సూపర్‌వైజర్‌గా నియమించి ని యమావళిని అమలుచేసేందుకు అధికారులు చర్యలు తీసు కుంటున్నారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కోడ్ నిబంధనలు, వివిధ అంశాలను చర్చించారు.

 సార్వత్రిక : సార్వత్రిక ఎన్నికల్లో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖలు కీలకం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సుమారు 14 వేల మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి తదితర బాధ్యతలు చేపట్టి అధికారులు ఎన్నికలకు రెడీగా ఉన్నారు. రిటర్నింగ్ అధికారులుగా ఆర్డీవో స్థాయి అధికారులను నియమించగా, జిల్లాస్థాయి అధికారులకు నోడల్ అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల కోసం కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 9న అన్ని బూత్ స్థాయి కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించాలని వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ దృష్టి సారించారు.

 శాంతి భద్రతలు : ఒకేసారి మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు రావడంతో పోలీస్‌శాఖకు శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ప్రత్యేక బలగాలను నియమిస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా బలగాలను దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న ఐదు, 5న 11, 6న 16 మందిపై ఆక్రమ మద్యం రవాణా కేసులు పెట్టారు. 2,600 క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. 3 వేల బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో తొమ్మిది సెంట్రల్ పారామిలటరీ బలగాల కోసం ప్రతిపాదనలు పంపగా, జిల్లాకు ఆరు చేరుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల మధ్య వివాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గాల వారీగా పాత నేరస్థులను బైండోవర్లు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాకు నలుమూలల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉండడంతో అక్కడి నుంచి అక్రమంగా దేశీదారు తీసుకువచ్చే ప్రమాదం ఉండడంతో చెక్‌పోస్టులను బలోపేతం చేసి అడ్డుకట్ట వేస్తున్నారు.

 రిజర్వేషన్ల ఖరారులో : పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసేపనిలో బిజీగా ఉన్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానప్పటికీ రిజర్వేషన్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.

 పంటనష్టం సర్వే : జిల్లాలో మూడు రోజులుగా అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు సర్వే చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అకాల వర్షాల కారణంగా రబీ సీజన్‌లో వేసిన పంటలు ఇప్పటివరకు 2,300 హెక్టార్లలో దెబ్బతిన్నాయని అంచనాకు వచ్చిన వ్యవసాయ శాఖ తాజాగా మళ్లీ వర్షాలు కురవడంతో సర్వేను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టంపై ప్రాథమిక సర్వే పూర్తి చేసి ప్రతిపాదనలు తయారు చేయనున్నారు.

 పరీక్షల ఏర్పాట్లలో విద్యాశాఖ : ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు బిజీగా ఉన్నారు. డిగ్రీ పరీక్షలు కొనసాగున్నా మరో పక్క ఇంటర్ పరీక్షలు ఈ నెల 12న, పదో తరగతి పరీక్షలు 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. దీంతో ఇన్విజిలేటర్లకు బాధ్యతలను అప్పగించడం, డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించే పనుల్లోనే ఉన్నారు. ఈ నెల 16న టెట్ పరీక్ష కూడా జరుగనుండడంతో ఆ వైపు దృష్టి సారించి ఏర్పాట్ల పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించిన వారికి ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పడం లేదు.

 పోస్టుల భర్తీలు : ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో రెండు శాఖ బిజీగా ఉన్నాయి. అటవీ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ పోస్టుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ కౌమార బాల, బాలికల ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగుతుండడంతో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో అన్ని శాఖల్లో అడిట్ సందడి కూడా కన్పిస్తోంది. ఈ నెల 31 వరకు జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement