ఉద్యోగుల విభజనపై కేంద్రం ఆలస్యం చేస్తోంది: దేవీప్రసాద్
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఉద్యోగుల విభజన విషయంలో ఆలస్యం చేస్తోందని టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. ఉద్యోగుల విభజనపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో తెలంగాణ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నల్లబ్యాడ్జీలతో కమలనాథన్ కమిటీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంలో పనిచేయాల్సి రావడం బాధాకరం అన్నారు. ఉద్యోగుల విభజనపై త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్,హైదరాబాదు టీఎన్జీఓ అధ్యక్షుడు ముజీబ్, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.