బ్యూరోక్రాట్‌పై ఎమ్మెల్యే వీరంగం
ముంబై: మహారాష్ట్రలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బాచూ కడు ఓ ఉద్యోగిపై వీరంగం సృష్టించాడు. బ్యూరోక్రాట్‌ను చెంపదెబ్బ కొట్టిన కేసులో ముంబై పోలీసులు బుధవారం బాచూను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 25 వేల రూపాయల పూచీకత్తుపై ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్ అప్పగించాల్సిందిగా ఆయన్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బాచూ మంగళవారం తన సహాయకుడు అశోక్ జాదవ్‌తో కలసి సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీ బీఆర్ గావిట్‌ను కలిశాడు. ప్రభుత్వ క్వార్టర్స్‌లో జాదవ్ ఉండేందుకు అనుమతించాలని, అదనంగా వసతి సౌకర్యాలు కల్పించాలని గావిట్‌ను కోరాడు. ఇందుకు గావిట్ నిరాకరించడంతో గొడవపడ్డ ఎమ్మెల్యే ఆయనపై దాడి చేశాడు. బాచూ తీరుపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్తానాధ్ ఖడ్సె విచారణకు ఆదేశించారు. కాగా ఉద్యోగిని తాను కొట్టలేదని ఎమ్మెల్యే చెప్పాడు. అమరావతి జిల్లా అచల్పూర్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాచూ గతంలో కూడా ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి.