కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..
రైతుల ఆదాయం, ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్రం రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకోసం రూ.1,01,321 కోట్లు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశానికి స్వావలంబన చేకూర్చేందుకు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్(ఎన్ఎంఈఓ)’ ఏర్పాటు కోసం రూ.10,103 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘అన్నదాతల ఆదాయం పెంచేందుకు, దేశంలో ఆహార భద్రతను వృద్ధి చేసేందుకు పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం-ఆర్కేవీవై), కృషోన్నతి యోజన పథకాలను ప్రారంభిస్తున్నాం. అందుకోసం రూ.1,01,321 కోట్లు కేటాయిస్తున్నాం. పీఎం-ఆర్‌కేవీవైలో భాగంగా నేల సారం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ.. వంటి వివిధ చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని నిర్ణయించాం. దేశంలో వంట నూనె అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ సీడ్స్(ఎన్ఎంఈఓ)ను ఏర్పాటు చేస్తున్నాం. అందుకు రూ.10,103 కోట్లు కేటాయిస్తున్నాం. ఈ మిషన్ ద్వారా రానున్న ఏడేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం. 2022-23 సంవత్సరానికిగాను నూనె గింజల ఉత్పత్తి 39 మిలియన్ టన్నులుగా ఉంది. దీన్ని 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఈ మిషన్‌లో భాగంగా నూనెగింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లకు విస్తరించనున్నాం. ఆవాలు, వేరుశనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి కీలక నూనెగింజ పంటల ఉత్పత్తిని మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కాటన్ సీడ్, రైస్ బ్రాన్..నుంచి నూనె తీసే ప్రక్రియను వేగవంతం చేయబోతున్నాం. రూ.63,246 కోట్ల వ్యయంతో చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దశలో 118.9 కిలోమీటర్లమేర మూడు కారిడార్లు, 128 స్టేషన్లు ఉంటాయి’ అని చెప్పారు.ఇటీవల వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుభారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు.