పాత నోట్లతో అన్నదాతల్లో అయోమయం
► రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవద్దంటూ మళ్లీ ఆదేశాలు
► పాలకుల నిర్ణయాలపై రైతన్నల ఆగ్రహం
ఒంగోలు టూటౌన్ : అన్నదాతకు పాత నోట్ల ఇక్కట్లు తప్పేలా లేవు. విత్తన కొనుగోలులో పాత నోట్లు తీసుకోవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం రాత్రే ఈ ఆదేశాలు వ్యవసాయశాఖకు అందారుు. ప్రస్తుతం రబీ సీజన్లో సబ్సిడీ విత్తనాలను వ్యవసాయశాఖ సరఫరా చేస్తోంది. శనగలతో పాటు ఇతర విత్తనాలు రాయితీపై ఇస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్ల ర ద్దు నేపథ్యంలో వాటిని విత్తన సరఫరా కేంద్రాల వద్ద రైతుల నుంచి తీసుకోవడం లేదు. పది రోజులు దాటినా కొత్త నోట్లు, పాతనోట్ల కష్టాలు అందరూ అనుభవిస్తున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద చాంతాడంత క్యూలతో నానాకష్టాలు పడుతున్నారు.
అసలే రబీ సీజన్
రబీ సీజన్ కావడంతో పురుగుమందులు, ఎరువులు, విత్తన కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత పెద్ద నోట్లు తీసుకునేది లేదని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పాలకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా పాతనోట్లతో నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ వరకు పాతనోట్లను తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదే ప్రకటనను వ్యవసాయశాఖ జేడీ జె.మురళీకృష్ణ కూడా పత్రికలకు విడుదల చేశారు. మళ్లీ అంతలోనే పాత నోట్లు తీసుకోవద్దంటూ శుక్రవారం రాత్రే ఉత్తర్వులు వచ్చాయని జేడీ తెలిపారు.
అటు బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద కుప్పలు తెప్పలుగా మనీ కోసం పడిగాపులు కాస్తున్న వారితో పాటు అక్షర జ్ఞానం లేని ఎంతో మంది రైతులు ఉన్న పాత నోట్లు మార్చుకునే విషయంలో నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లో పాతనోట్లు ఎప్పుడు మార్చుకోవాలి? విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేదెట్ల?.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కొత్త నోట్లు వచ్చినా.. చిల్లర సమస్యతో సతమతమవ్వాల్సి రావడం ఖాయం. కొత్త రూ.2 వేల నోట్లకు చిల్లర దొరకని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాలకుల నిర్ణయాలపై రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.