ఒక్క ఎస్ఎంఎస్ కూడా రాలేదట!
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఇంత వరకు తనకు ఒక్క ఎస్సెమ్మెస్ కూడా రాలేదంటున్నారు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ (పీసీసీ) ఇటీవలే కోటి ఎస్సెమ్మెస్ సందేశాల ఉద్యమాన్ని ప్రారంభించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్రానికి చెందిన, రాష్ట్రంతో సంబంధం ఉన్న కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిల ఫోను నెంబర్లను ప్రకటించి.. ఆయా నెంబర్లకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడాలని కోరుతూ ఈ నెల 23వ తేదీ నుంచి 30 వ తేదీల మధ్య కోటి ఎస్సెమ్మెస్ సందేశాలను పంపాలని పీసీసీ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.ఎనిమిది రోజుల పాటు సాగే ఈ ఉద్యమం మరో రెండు రోజులలో ముగియనుంది.
అయితే, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎస్సెమ్మెల ఉద్యమానికి సంబంధించి ఇప్పటి వరకు తన ఫోన్లో ఒక్క సందేశం కూడా రాలేదని వెంకయ్యనాయుడు సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏవేవో నెంబర్లు ఇచ్చారట. నాకైతే ఒక్క ఎస్సెమ్మెస్ రాలేదు. ఎవరెవరికో ఇలాంటి ఎస్సెమ్మెస్‌లు వెళ్లుతుండొచ్చు అని వ్యాఖ్యానించారు.