ఒకే విడత ‘ఎన్నిక’!
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల యం త్రాంగం పరిశీలన జరుపుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల క మి షన్ ప్రధాన అధికారి సం పత్ ఆదివారం సమాలోచన జరిపారు. పనుల వేగవంతానికి పిలుపునిచ్చారు. లోక్‌సభకు ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తుల్లో మునిగాయి. పొత్తులు, సీట్ల పందేరం, అభ్యర్థుల వేటతో దూసుకెళుతున్నాయి. మరో వైపు రాష్ట్ర ఎన్నికల యంత్రాం గం ఓటు విలువను ఓటరుకు తెలియజేయడంతో పాటు ఓటుకు నోటు వద్దనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. అలాగే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరిం చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో ఎన్నికల పనులు జరుగుతున్నాయి. నివేదిక రూపంలో ఆయా జిల్లాల నుంచి వివరాలు, సమాచారం రాష్ర్ట ఎన్నికల అధికారికి అందాయి. వీటిపై చర్చించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ శనివారం రాత్రి చెన్నైకు వచ్చారు. ఈ క్రమంలోఆదివారం అధికారులతో సమాలోచన సమావేశం ఏర్పాటుచేశారు.
సమాలోచన: ఉదయం జరిపిన సమాలోచనలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ విక్రమ్ కపూర్, తదితర పదిహేను మంది అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన ఏర్పాట్లను సంపత్ ఆరా తీశారు. ఓటర్ల జాబితా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపైనే అత్యధిక సమయాన్ని కేటాయించారు. పారా మిలటరీ భద్రత, రాష్ట్రంలో చేపట్టాల్సిన ఎన్నికల విధివిధానాల గురించి వివరించారు. నగదు బట్వాడా కట్టడి లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం చేసిన సూచనల్ని ఆయన పరిగణలోకి తీసుకున్నారు. అలాగే రెండు విడతలుగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర యంత్రాంగం నివేదిక సమర్పించినా, ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు పరిశీలన జరపాలంటూ సంపత్ సూచించినట్టు ఓ అధికారి పేర్కొన్నారు.
త్వరలో తేదీ ప్రకటన
సమావేశానంతరం సంపత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షలు జరుపుతున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి చేపట్టిన ఏర్పాట్లు, తీసుకున్న నిర్ణయాల్ని సమీక్షిస్తున్నామన్నారు. ఎన్నికల భద్రత, సమస్యాత్మక కేంద్రాల ఎంపిక, ప్రశాంత పూరిత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇంకా అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు, డీజీపీలు, ఆయా జిల్లాల్లోని అధికారులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉందన్నారు. అన్ని పూర్తి అయ్యాకే తేదీ ప్రకటిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశ్శా, సిక్కింలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు పరిశీలన జరుపుతున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. వంద శాతం ఓటరు గుర్తింపుకార్డులు మంజూరు ప్రక్రియను పూర్తి చేయనున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో అందరూ ఓటరు గుర్తింపు కార్డును తప్పని సరిగా కలిగి ఉంటారని స్పష్టం చేశారు.