one terrorist killed
-
భారీ ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ము కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పుల్వామా జిల్లా అవంతిపురా గ్రామ సమీపంలో తెల్లవారుజామునే మొదలైన ఈ కాల్పుల్లో ఇప్పటికి ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరింతమంది ఉగ్రవాదులు అక్కడ ఉండటంతో కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఆర్మీతో పాటు జమ్ము కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)కి చెందిన కమాండోలు అవంతిపురా గ్రామంలోని ఒక ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఒక ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భారీగా ఆయుధాలతో ఉన్న ఉగ్రవాదులతో సీఆర్పీఎఫ్ 130 బెటాలియన్, 55 రాష్ట్రీయ రైఫిల్స్, ఎస్ఓజీ బృందం తలపడ్డాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ఇంటికి వెళ్లే, బయటకు వచ్చే అన్ని మార్గాలను భద్రతాదళాలు మూసేశాయి. అయితే ఇప్పుడు లోపల ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం ఖరారు కావట్లేదని, లోపలినుంచి కాల్పులు పూర్తిగా ఆగితే తప్ప ఆ విషయం తెలియదని అధికారులు అంటున్నారు. లోపల ఉన్నవారిని లొంగిపొమ్మని తాము చెబుతున్నా వాళ్లు వినిపించుకోవడం లేదని పుల్వామా ఎస్పీ చెప్పారు. -
మూడు రోజులుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్
-
మూడు రోజులుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్
జమ్ము కశ్మీర్లోని పాంపోర్ ప్రాంతంలోగల ఓ ప్రభుత్వ భవనంలో నక్కిన ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐ) భవనంలో దాగిన ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతాదళాలు హతమార్చాయి. శ్రీనగర్- జమ్ము జాతీయ రహదారి సమీపంలో గల ఈ భవనంమీద పలుమార్లు మోర్టార్లతో దాడి చేయడంతో పాటు ఉగ్రవాదులను హతమార్చేందుకు ఐఈడీ కూడా పేల్చారు. సోమవారం ఉదయం మొదలైన ఈ ఎన్కౌంటర్ బుధవారం ఉదయం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యమధ్యలో భవనం లోపలి నుంచి కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. భవనంలో చాలా భాగం పూర్తిగా కుప్పకూలింది. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆర్మీకి చెందిన పారా కమాండోలను కూడా పిలిపించారు. కానీ, ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో భవనంలోకి భద్రతాదళాలు వెళ్లడంలేదు. ఉగ్రవాదులు ఎటూ పారిపోకుండా ఉండేందుకు ఈడీఐ భవనం చుట్టు పక్కల ప్రాంతం మొత్తాన్ని భద్రతాదళాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు లేదా ముగ్గరు ఉగ్రవాదులు లోపలకు వెళ్లినట్లు భావిస్తున్నారు. వాళ్లు బోటులో ప్రయాణించి వచ్చి భవనం వెనకవైపు నుంచి లోపలకు వచ్చి ఉంటారని అంటున్నారు.