భారీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పుల్వామా జిల్లా అవంతిపురా గ్రామ సమీపంలో తెల్లవారుజామునే మొదలైన ఈ కాల్పుల్లో ఇప్పటికి ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరింతమంది ఉగ్రవాదులు అక్కడ ఉండటంతో కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఆర్మీతో పాటు జమ్ము కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ)కి చెందిన కమాండోలు అవంతిపురా గ్రామంలోని ఒక ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఒక ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
భారీగా ఆయుధాలతో ఉన్న ఉగ్రవాదులతో సీఆర్పీఎఫ్ 130 బెటాలియన్, 55 రాష్ట్రీయ రైఫిల్స్, ఎస్‌ఓజీ బృందం తలపడ్డాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ఇంటికి వెళ్లే, బయటకు వచ్చే అన్ని మార్గాలను భద్రతాదళాలు మూసేశాయి. అయితే ఇప్పుడు లోపల ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం ఖరారు కావట్లేదని, లోపలినుంచి కాల్పులు పూర్తిగా ఆగితే తప్ప ఆ విషయం తెలియదని అధికారులు అంటున్నారు. లోపల ఉన్నవారిని లొంగిపొమ్మని తాము చెబుతున్నా వాళ్లు వినిపించుకోవడం లేదని పుల్వామా ఎస్పీ చెప్పారు.