పన్ను కట్టకపోతే సీజే
కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నోటీసులిచ్చాం
ఎవరినీ ఉపేక్షించేది లేదు
వడ్డీ రాయితీ ఈనెలాఖరు వరకే
ఉగాది, ఆదివారాల్లో నగరపాలక సంస్థలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మి
ఒంగోలు, న్యూస్‌లైన్: ఆస్తిపన్ను కట్టకపోతే ఏ ఒక్కరినీ ఉపేక్షించేదిలేదని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్.విజయలక్ష్మి తెలిపారు. కమిషనర్ తన చాంబరులో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 13.58 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 10.64 కోట్లు వసూలు చేశామన్నారు. దాంతోపాటు మరో 30 లక్షల పోస్ట్‌డేటెడ్ చెక్కులు కూడా తమకు అందాయని చెప్పారు. ఇంకా 20 శాతం పెండింగ్ బకాయిలున్నట్లు ప్రకటించారు. వాటిలో నవభారత్ థియేటర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ప్రభుత్వ సంస్థలైన ఎఫ్‌సీఐ, ఏపీఐఐసీకి సంబంధించిన ఉడ్‌కాంప్లెక్స్, ఇండస్ట్రియల్ పార్కుల బకాయిలు కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయాయన్నారు. వాటికి నోటీసులు జారీ చేశామన్నారు.
నోటీసులిచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి స్పందన రాలేదని, ఇప్పటి వరకు 2,18,200 బకాయి ఉందని చెప్పారు. ఈ మొత్తాన్ని మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు చెల్లించాలని గడువిచ్చామని, అప్పటిలోగా కట్టకపోతే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేస్తామని హెచ్చరించారు. ఇది కాకుండా నీటి పన్ను బకాయిలు 2.75 కోట్లకుగాను ఇప్పటి వరకు 1.18 కోట్లు వసూలు చేశామన్నారు. అపార్టుమెంట్లకు సంబంధించి మీటర్లు ఉన్న నీటి కుళాయి కనెక్షన్లకు *91 వేలు వసూలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు ఇప్పటి వరకు మొత్తం 4.48 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు వసూలైన మొత్తం కేవలం 37.15 లక్షలు మాత్రమే అన్నారు.
విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. 24 లక్షల ప్రకటన పన్ను, 27 లక్షల ట్రేడ్ పన్ను, మార్కెట్ లీజులకు సంబంధించి 73 లక్షలు వసూలైందని, మరో 6 లక్షలు వసూలు కావాల్సి ఉందని కమిషనర్ తెలిపారు. వినోదపు పన్ను కింద 26 లక్షలు వసూలైందని, మరో 24 లక్షల వసూలుకు సంబంధించి వాణిజ్యశాఖ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఉగాది, ఆదివారం వంటి సెలవు దినాల్లో ప్రజలు ఆస్తిపన్ను లేదా నీటిపన్ను కట్టేందుకు ఒంగోలు నగరపాలక సంస్థలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కౌంటర్ ఉదయం 10 నుంచి ప్రారంభమవుతుందన్నారు.
ఆర్వో మంజులాకుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నోటీసులిచ్చామన్నారు. స్థలం యజమాని తాను ఉచితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చానని చెబుతున్నారని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పన్ను మినహాయింపు ఉందని చెబుతున్నారన్నారు. కానీ అటువంటి ఉత్తర్వులేవీ లేవని అందువల్ల తాము మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉండి..అప్పటి కీ పన్ను కట్టకపోతే తాళాలు వేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా 39,42,516 అన్ కలెక్టెడ్ బిల్లులున్నాయన్నారు. ఆ బిల్లులకు సంబంధించి కనీసం యజమాని కూడా ఎవరో తెలియడంలేదని తద్వారా ఆ మొత్తం వసూలు చేయలేకపోతున్నందువల్లే 100 శాతం లక్ష్యానికి చేరుకోలేకపోతున్నామన్నారు.