ధరల బాంబు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఉల్లి, ఆలు ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఉల్లి ధర అమాంతం పెరిగి ఇటీవలనే కొంత తగ్గుముఖం పట్టగా తాజాగా రెండు రోజుల క్రితం మళ్లీ ధర పెరిగింది. ఉల్లితో ఆలు కూడా పోటీ పడుతోంది. రెండు రోజుల క్రితం ఉల్లి, ఆలు ధరలు కిలోకు రూ.5 చొప్పున పెరిగాయి. పెరుగుతున్న ధరలు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు సెన్సెక్స్‌తో పోటీ పడుతున్నాయి.
కిలో ఉల్లి రూ.50, ఆలు రూ.24..
ఉల్లి తరిగితేనే కాదు దాని ధర చూస్తే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో రెండు రోజుల క్రితం వరకు కిలో ఉల్లి రూ.45 విక్రయించిన వ్యాపారులు ప్రస్తుతం రూ.50 కిలో చొప్పున అమ్ముతున్నారు. అదే మాదిరి కిలో ఆలు రూ.19 అమ్మగా ఆ ధర ప్రస్తుతం రూ.24 పెరిగింది. రెండు రోజుల్లోనే ఒక్కసారిగా కిలోకు రూ.5 చొప్పున ధర పెరిగింది. పక్షం రోజుల క్రితం కిలో ఆలు రూ.15 ఉండగా, ఆ తర్వాత రూ.4 ధర పెరిగింది. రెండు రోజుల క్రితం వరకు రూ.19 కిలో అమ్మిన వ్యాపారులు ఇప్పుడు రూ.24 విక్రయిస్తున్నారు.
బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తుండటంతో..
జిల్లాలో రోజుకు ఉల్లి, ఆలు సుమారు వెయ్యి క్వింటాళ్ల వరకు రవాణా అవుతుంటాయి. వీటిని ప్రస్తుతం హైదరాబాద్ మార్కె ట్ నుంచి హోల్‌సేల్ వ్యాపారులు తీసుస్తుంటారు. వీటి అమ్మకాలు అధికంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, భైంసా, ఉ ట్నూర్ తదితర ప్రాంతాల్లో జరుగుతాయి. పక్షం రోజుల నుంచి ఉల్లిగడ్డలను హైదరాబాద్ ప్రధాన మార్కెట్ నుంచి కోల్కత్తా మీదుగా బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఉల్లిగడ్డల కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
వర్షాల ప్రభావంతో..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. విస్తారంగా కురిసిన వర్షాలతో సీమాంధ్రలో సాగు చేస్తున్న ఉల్లి, ఆలుగడ్డల పంటలపై తీవ్ర ప్రభావం పడింది. చిత్తూర్ జిల్లా మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్‌కు రోజువారీగా వచ్చే ఆయా రకాల సరుకులు తగ్గుముఖం ప ట్టాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ఉల్లి, ఆలు ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఏటా సీ జన్‌లో సోలాపూర్, నాగ్‌పూర్, దులియా(మహారాష్ట్ర), బెల్గాం (కర్నాటక), రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల నుంచి ఉల్లి, ఆలు భారీ మొత్తంలో రాష్ట్రానికి సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో పంటలు ఇంకా చేతికి రాలేదు. మరో నెల రోజులు గడిస్తే కాని ఆ వైపు నుంచి రాష్ట్రానికి ఉల్లి, ఆలు దిగుమతి అయ్యే పరిస్థితులు లేవు.