ఆన్లైన్ ‘ఎంసెట్’కు స్పందన కరువు
♦ మెడికల్ కోసం 548 దరఖాస్తులే..
♦ ఆఫ్‌లైన్ పరీక్షకు లక్షకు పైగా...
♦ ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్న మెడికల్ ఎంసెట్‌కు అభ్యర్థులు ఆసక్తి కనబరచలేదు. కేవలం 548 మంది అభ్యర్థులే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2016 పరీక్షను మే 2న నిర్వహించేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్, మెడికల్‌లో ఎంసెట్‌ను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ ద్వారా ఏకకాలంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆఫ్‌లైన్ పరీక్షకు మాత్రం 1,00,939 మంది దరఖాస్తు చే సుకున్నారు. అయితే మొదటిసారిగా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు. హైదరాబాద్ పరిధిలోని కేంద్రాల్లో 493 మంది, వరంగల్ పరిధిలోని కేంద్రాల్లో 55 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
మే 12న ఫలితాలు..
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు హాజరయ్యేందుకు మొత్తం 2,46,917 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,43,378 మంది ఇంజనీరింగ్ కోసం, 1,00,939 మంది ఆఫ్‌లైన్ అగ్రికల్చర్, మెడికల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా పరీక్ష రాసేందుకు మరో 548 మంది దరఖాస్తు చేశారు. ఇక ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండింటిలో పరీక్ష రాసేందుకు 1,026 మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 30 వరకు హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకునేలా ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. కాగా, రూ.10 వేల ఆలస్య రుసుంతో ఈ నెల 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మే 2న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష నిర్వహించనుంది. ప్రాథమిక కీని మే 3న విడుదల చేయనుండగా, 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి మే 12న ఫలితాలు వెల్లడించనుంది.