
నేటి నుంచి ఆన్‌లైన్ ఎంసెట్
కాకినాడలో సెట్ కోడ్ విడుదల చేయనున్న గంటా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 2017–18 సంవత్సరానికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ ఎంసెట్–17 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం వరకూ ఇంజనీరింగ్, శుక్రవారం అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు జరుగుతాయి. ఈసారి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చొప్పున, అలాగే హైదరాబాద్‌లోని మౌలాలి, నాచారం, హయత్‌నగర్ ప్రాంతా ల్లోను కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ విభాగంలో ఎంసెట్ రాయాలనుకునేవారి కోసం కర్నూలులో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,98,068, అగ్రికల్చర్ విభాగంలో 80,725 మంది పరీక్ష రాయనున్నారు.
పరీక్షకు వెళ్లే అభ్యర్థులు ఎంసెట్ హాల్‌టిక్కెట్‌తోపాటు ఎస్సీ, ఎస్టీలైతే కులధ్రువీకరణ పత్రం, పెన్ను, పెన్సిల్, రబ్బరుతోపాటు సంబంధిత ప్రిన్సిపాల్ ధ్రువీకరించిన దరఖాస్తు ఫారం తీసుకెళ్లాలని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. పేపర్ సెట్ కోడ్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు కాకినాడ జేఎన్‌టీయూలో సోమవారం ఉదయం విడుదల చేయనున్నారు. విద్యార్థులకు సందేహాలుంటే 0884–2340535 నంబర్‌లో సంప్రదించవచ్చని సాయిబాబు తెలిపారు.