Online Marketing System
-
2027 నాటికి రూ.పది వేలకోట్లకు చేరే మార్కెట్
దేశంలో 2024 చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రూ.5,500 కోట్లకు చేరుతుందని ‘ఇన్ఫ్లుయెన్సర్.ఇన్’ సంస్థ నివేదిక తెలిపింది. దేశీయంగా డిజిటల్ మార్కెటింగ్ ప్రభావం ఎలా ఉంది..ఇన్ఫ్లుయెన్సర్లు ఏమేరకు ప్రభావం చూపిస్తున్నారు..కంపెనీలు ఎలాంటి ప్లాట్పామ్ల ద్వారా తమ ఉత్పత్పులను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి..వంటి అంశాలను ఈ ‘ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్ 2024’ నివేదికలో తెలియజేశారు. ఈ నివేదిక రూపొందించేందుకు 100కు పైగా బ్రాండ్లపై సర్వే నిర్వహించారు. 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించినట్లు సంస్థ తెలిపింది.ఈ సందర్భంగా ఇన్ఫ్లుయెన్సర్.ఇన్ సహ వ్యవస్థాపకులు సునీల్ చావ్లా మాట్లాడుతూ..‘డిజిటల్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్లకు వృద్ధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు పెరుగుతుండడంతో కంపెనీలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లిక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్ల్లో తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. ఈ సంస్థలు ఇన్ఫ్లుయెన్సర్ అనలిటిక్ టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుంది’ అని చెప్పారు.ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్ 2024లోని కొన్ని ముఖ్యాంశాలు2024 చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రూ.5,500 కోట్లకు చేరుతుందని అంచనా.డిజిటల్ మీడియా మార్కెటింగ్‌లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ విలువ 11 శాతంగా ఉంది.ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ వంటి విభాగాల్లో 40-57 శాతం బ్రాండ్లు 2026 నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌పై చేసే ఖర్చును 10% పెంచుతాయి.ఈ మార్కెటింగ్‌లో కంపెనీలకు కొన్ని సవాళ్లున్నాయి. అందులో ప్రధానంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(ఆర్ఓఐ). అంటే సంస్థ ఉత్పత్తులను ఫలానా యాడ్ చూసే కొనుగోలు చేస్తున్నారనే కచ్చితమైన లెక్కలుండవు.ఇన్‌ఫ్యుయెన్సర్లు కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. నమ్మకమైన ప్రేక్షకులను సంపాదించడం కష్టంగా మారుతుంది.2025 నాటికి బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ దేశీయంగా రూ.6,875 కోట్లకు చేరనుంది. ఏటా 25 శాతం వృద్ధి రేటుతో 2027 నాటికి ఇది రూ.10,750 కోట్లకు చేరుతుందని అంచనా.బ్రాండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్‌లో భాగంగా 85 శాతం కంపెనీలు ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్సర్లను కలిగి ఉన్నాయి. 64 శాతం కంపెనీలు 5-20 శాతం ప్రత్యేకంగా ప్రచారకర్తలకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపాయి.గతంలో కంటే 2024లో కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులను దాదాపు 10 రెట్లు పెంచినట్లు తెలిపాయి.ఇన్‌స్టాగ్రామ్‌లోని చిన్న ఇన్ఫ్లుయెన్సర్లతో 58.5 శాతం కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐ ఫండ్‌కు గూగుల్ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే..93 శాతం క్రియేటర్లు కంపెనీలతో ఎక్కువకాలం కార్యకలాపాలు సాగించాలని కోరుకుంటున్నారు. 43 శాతం మంది ప్రచారం చేస్తున్న బ్రాండ్ క్వాలిటీపై కూడా దృష్టి సారిస్తున్నారు.క్రియేటర్లు అధికంగా బ్రాండ్ ప్రమోషన్ కోసం ఎంచుకుంటున్న మాధ్యమాల్లో 93.8 శాతం ఇన్స్టాగ్రామ్, 54.4 శాతం యూట్యూబ్, 28.1 శాతం ఫేస్బుక్, మిగతా లింక్డ్ఇన్, స్నాప్‌చాట్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నారు.కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోట్ చేయాలని ఎక్కువగా 90.2 శాతం ఇన్స్టాగ్రామ్, 51.2 శాతం యూట్యూబ్, 19.5 శాతం లింక్డ్ఇన్ను వినియోగిస్తున్నాయి. -
సెల్ బుక్ చేస్తే సబ్బు వచ్చింది
కాళేశ్వరం(మంథని): టీవీలో ప్రకటన చూసి సెల్‌ఫోన్ కోసం ఆర్డర్ ఇవ్వగా, దాని బదులు సబ్బు రావడంతో మోసపోయానని ఓ వ్యక్తి లబోదిబోమంటున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ అంకం రాజబాపు టీవీలో ఓ కంపెనీకి సంబంధించి 4జీ సెల్‌ఫోన్ ప్రకటన చూశాడు. దాని విలువ రూ.3,390 ఉన్నట్లు చెప్పగా, వెంటనే స్క్రీన్‌పై ఉన్న 04067037189 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాడు. కొద్ది రోజులకు పార్శిల్లో డబ్బులు చెల్లించి తీసుకున్నాడు. అందులో వచ్చిన సెల్‌ఫోన్ 20 రోజులకే సాఫ్ట్వేర్ పోయింది. సెల్‌ఫోన్‌కు ఆ కంపెనీ సంవత్సరం వారంటీ ఇవ్వగా బాధితుడు స్క్రీన్‌పై ఉన్న 04067037189 నంబర్‌కు ఫోన్ చేయగా, మరో 9560942125, 9650755884 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. దీంతో ఆ నంబర్లకు కాల్ చేయగా సిబ్బంది సూచన మేరకు సాఫ్ట్వేర్ పాడైన ఫోన్‌ను తిరిగి కంపెనీ అడ్రస్, ఫోన్ ఫొటోలు తీసి ఆయా నంబర్లకు వాట్సప్‌లో పంపాడు. 15 రోజుల తర్వాత కంపెనీ స్టిక్కరింగ్తో పార్శిల్ వచ్చింది. విప్ప చూడగా సబ్బు ఉండటంతో అవాక్కయ్యాడు. మళ్లీ అవే నంబర్లకు ఫోన్ చేయగా పొరపాటు జరిగిందని, మళ్లీ కంప్లేంట్ తీసుకుంటున్నామని సిబ్బంది చెప్పారు. రెండు రోజుల క్రితం మళ్లీ పార్శిల్ రాగా విప్పి చూడటంతో ఘడి డిటర్జెంట్ సబ్బు వచ్చింది. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. మళ్లీ ఆయా నంబర్లకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని వాపోయాడు. టీవీలో, ఆన్లైన్లో వస్తువుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చి మోసం చేస్తున్నారని, సైబర్ క్రైం పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు అంకం రాజబాపు కోరుతున్నాడు. -
మరీ ఇంత నిర్లక్ష్యమా!
రైతుల బలవన్మరణాలను అడ్డుకోలేని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బెంగళూరు: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల వరుస ఆత్మహత్యలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలను నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని, అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. హుబ్లీలోని ఎపీఎంసీ మార్కెట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు దేశానికి వెన్నెముక లాంటి వారని, వారికి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దేశంలో ప్రస్తుతం కరువు ఛాయలు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రాలకు సాయం అందించేందుకు కేంద్రం సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ మార్కెటింగ్ సౌలభ్యం ఒక విప్లవాత్మక పరిణామమని ఈ సదుపాయం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దళారుల చేతుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అంతేకాక ఈ-మార్కెటింగ్ సౌలభ్యంద్వారా పారదర్శకతకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని దాదాపు 585 వ్యవసాయ మార్కెట్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు.