దేశంలో 2024 చివరి నాటికి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రూ.5,500 కోట్లకు చేరుతుందని ‘ఇన్‌ఫ్లుయెన్సర్.ఇన్’ సంస్థ నివేదిక తెలిపింది. దేశీయంగా డిజిటల్ మార్కెటింగ్ ప్రభావం ఎలా ఉంది..ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏమేరకు ప్రభావం చూపిస్తున్నారు..కంపెనీలు ఎలాంటి ప్లాట్‌పామ్‌ల ద్వారా తమ ఉత్పత్పులను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి..వంటి అంశాలను ఈ ‘ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్ 2024’ నివేదికలో తెలియజేశారు. ఈ నివేదిక రూపొందించేందుకు 100కు పైగా బ్రాండ్‌లపై సర్వే నిర్వహించారు. 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను సంప్రదించినట్లు సంస్థ తెలిపింది.
ఈ సందర్భంగా ఇన్‌ఫ్లుయెన్సర్.ఇన్ సహ వ్యవస్థాపకులు సునీల్ చావ్లా మాట్లాడుతూ..‘డిజిటల్ మార్కెట్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు వృద్ధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు పెరుగుతుండడంతో కంపెనీలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, లిక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. ఈ సంస్థలు ఇన్‌ఫ్లుయెన్సర్ అనలిటిక్ టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుంది’ అని చెప్పారు.
ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్ 2024లోని కొన్ని ముఖ్యాంశాలు
2024 చివరి నాటికి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రూ.5,500 కోట్లకు చేరుతుందని అంచనా.
డిజిటల్ మీడియా మార్కెటింగ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ విలువ 11 శాతంగా ఉంది.
ఎఫ్‌ఎంసీజీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ వంటి విభాగాల్లో 40-57 శాతం బ్రాండ్‌లు 2026 నాటికి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌పై చేసే ఖర్చును 10% పెంచుతాయి.
ఈ మార్కెటింగ్‌లో కంపెనీలకు కొన్ని సవాళ్లున్నాయి. అందులో ప్రధానంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్(ఆర్‌ఓఐ). అంటే సంస్థ ఉత్పత్తులను ఫలానా యాడ్ చూసే కొనుగోలు చేస్తున్నారనే కచ్చితమైన లెక్కలుండవు.
ఇన్‌ఫ్యుయెన్సర్లు కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. నమ్మకమైన ప్రేక్షకులను సంపాదించడం కష్టంగా మారుతుంది.
2025 నాటికి బ్రాండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ దేశీయంగా రూ.6,875 కోట్లకు చేరనుంది. ఏటా 25 శాతం వృద్ధి రేటుతో 2027 నాటికి ఇది రూ.10,750 కోట్లకు చేరుతుందని అంచనా.
బ్రాండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్‌లో భాగంగా 85 శాతం కంపెనీలు ప్రత్యేకంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను కలిగి ఉన్నాయి. 64 శాతం కంపెనీలు 5-20 శాతం ప్రత్యేకంగా ప్రచారకర్తలకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపాయి.
గతంలో కంటే 2024లో కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులను దాదాపు 10 రెట్లు పెంచినట్లు తెలిపాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లోని చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్లతో 58.5 శాతం కంపెనీలు తమ బ్రాండ్‌లను ప్రమోట్ చేయిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఏఐ ఫండ్‌కు గూగుల్ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే..
93 శాతం క్రియేటర్లు కంపెనీలతో ఎక్కువకాలం కార్యకలాపాలు సాగించాలని కోరుకుంటున్నారు. 43 శాతం మంది ప్రచారం చేస్తున్న బ్రాండ్ క్వాలిటీపై కూడా దృష్టి సారిస్తున్నారు.
క్రియేటర్లు అధికంగా బ్రాండ్ ప్రమోషన్ కోసం ఎంచుకుంటున్న మాధ్యమాల్లో 93.8 శాతం ఇన్‌స్టాగ్రామ్, 54.4 శాతం యూట్యూబ్, 28.1 శాతం ఫేస్‌బుక్, మిగతా లింక్డ్‌ఇన్, స్నాప్‌చాట్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నారు.
కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోట్ చేయాలని ఎక్కువగా 90.2 శాతం ఇన్‌స్టాగ్రామ్, 51.2 శాతం యూట్యూబ్, 19.5 శాతం లింక్డ్‌ఇన్‌ను వినియోగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment