సెల్ కోసం బుక్ చేయగా ఓ కంపెనీ పంపిన సబ్బులు చూపుతున్న బాధితుడు రాజబాపు
కాళేశ్వరం(మంథని): టీవీలో ప్రకటన చూసి సెల్‌ఫోన్ కోసం ఆర్డర్ ఇవ్వగా, దాని బదులు సబ్బు రావడంతో మోసపోయానని ఓ వ్యక్తి లబోదిబోమంటున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ అంకం రాజబాపు టీవీలో ఓ కంపెనీకి సంబంధించి 4జీ సెల్‌ఫోన్ ప్రకటన చూశాడు. దాని విలువ రూ.3,390 ఉన్నట్లు చెప్పగా, వెంటనే స్క్రీన్‌పై ఉన్న 04067037189 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాడు.
కొద్ది రోజులకు పార్శిల్‌లో డబ్బులు చెల్లించి తీసుకున్నాడు. అందులో వచ్చిన సెల్‌ఫోన్ 20 రోజులకే సాఫ్ట్‌వేర్ పోయింది. సెల్‌ఫోన్‌కు ఆ కంపెనీ సంవత్సరం వారంటీ ఇవ్వగా బాధితుడు స్క్రీన్‌పై ఉన్న 04067037189 నంబర్‌కు ఫోన్ చేయగా, మరో 9560942125, 9650755884 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. దీంతో ఆ నంబర్లకు కాల్ చేయగా సిబ్బంది సూచన మేరకు సాఫ్ట్‌వేర్ పాడైన ఫోన్‌ను తిరిగి కంపెనీ అడ్రస్, ఫోన్ ఫొటోలు తీసి ఆయా నంబర్లకు వాట్సప్‌లో పంపాడు.
15 రోజుల తర్వాత కంపెనీ స్టిక్కరింగ్‌తో పార్శిల్ వచ్చింది. విప్ప చూడగా సబ్బు ఉండటంతో అవాక్కయ్యాడు. మళ్లీ అవే నంబర్లకు ఫోన్ చేయగా పొరపాటు జరిగిందని, మళ్లీ కంప్లేంట్ తీసుకుంటున్నామని సిబ్బంది చెప్పారు. రెండు రోజుల క్రితం మళ్లీ పార్శిల్ రాగా విప్పి చూడటంతో ఘడి డిటర్జెంట్ సబ్బు వచ్చింది. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. మళ్లీ ఆయా నంబర్లకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని వాపోయాడు. టీవీలో, ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చి మోసం చేస్తున్నారని, సైబర్ క్రైం పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు అంకం రాజబాపు కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment