మరీ ఇంత నిర్లక్ష్యమా!
రైతుల బలవన్మరణాలను అడ్డుకోలేని కర్ణాటక ప్రభుత్వం
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్
బెంగళూరు: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల వరుస ఆత్మహత్యలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలను నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని, అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. హుబ్లీలోని ఎపీఎంసీ మార్కెట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు దేశానికి వెన్నెముక లాంటి వారని, వారికి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దేశంలో ప్రస్తుతం కరువు ఛాయలు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు.
ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రాలకు సాయం అందించేందుకు కేంద్రం సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ మార్కెటింగ్ సౌలభ్యం ఒక విప్లవాత్మక పరిణామమని ఈ సదుపాయం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దళారుల చేతుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అంతేకాక ఈ-మార్కెటింగ్ సౌలభ్యంద్వారా పారదర్శకతకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని దాదాపు 585 వ్యవసాయ మార్కెట్‌లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు.