online money transfer
-
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ మారాయ్.. ఇక అది అవసరం లేదు!
IMPS Rules change: ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు చేసే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ నిబంధనలు మారాయి. వినియోగదారులు ఫిబ్రవరి 1 నుంచి రిసీవర్ మొబైల్ నంబర్, పేరుతోనే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చని, ఐఎఫ్ఎస్సీ కోడ్ జోడించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. 2024 జనవరి 31 నాటికి అన్ని ఐఎంపీఎస్ ఛానెల్‌లలో మొబైల్ నంబర్ + బ్యాంక్ పేరు ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ను అనుమతించాలని బ్యాంకులను అభ్యర్థిస్తున్నట్లు ఎన్పీసీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే డిఫాల్ట్ ఎంఎంఐడీ (మొబైల్ మనీ ఐడెంటిఫైయర్- MMID)తో సభ్యుల బ్యాంక్ పేర్లను మ్యాపింగ్ చేయాలని రిమిటర్ బ్యాంకులకు సూచించింది. ఐఎంపీఎస్ అంటే.. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్ఎంఎస్, ఐబీఆర్ఎస్ వంటి వివిధ ఛానెల్‌ల ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్‌కు అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. ఈ ఐఎంపీఎస్ ప్రస్తుతానికి P2A (అకౌంట్ + ఐఎఫ్ఎస్సీ) లేదా P2P (మొబైల్ నంబర్ + ఎంఎంఐడీ) ట్రాన్స్ఫర్ విధానాల్లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఒక వేళ ఒకే మొబైల్ నంబర్‌తో ఎక్కువ అకౌంట్లను లింక్ చేసిన సందర్భంలో కస్టమర్ సమ్మతి ఆధారంగా ప్రాథమిక/డిఫాల్ట్ అకౌంట్‌కు బెనెఫీషియరీ బ్యాంక్ డబ్బును జమ చేస్తుంది. ఒక వేళ కస్టమర్ సమ్మతి లేని పక్షంలో బ్యాంకు ఆ లావాదేవీని తిరస్కరించాలి. -
నెఫ్ట్ చార్జీలపై ఆర్బీఐ శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: సేవింగ్ బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (నెఫ్ట్) సేవలు 2020 జనవరి నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్బీఐ కోరింది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన, సురక్షితమైన పేమెంట్ వ్యవస్థలను స్థాపించడం ఆర్బీఐ లక్ష్యమని, ఈ ప్రయత్నాల ఫలితంగా రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 2018-సెప్టెంబర్ 2019 వరకు మొత్తం నగదు రహిత చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపులు 96శాతంగా ఉన్నాయి. అదే సమయంలో నెఫ్ట్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) వ్యవస్థలు సంవత్సరానికి 252 కోట్లు, 874 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి నెఫ్ట్ లావాదేవీలు 20 శాతం యూపీఐ లావాదేవాలు 263శాతం వృద్ధిని సాధించాయని తెలిపింది. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్), నెఫ్ట్ ఆర్బీఐ అందిస్తున్న రియల్ టైం పేమెంట్ వ్యవస్థలు. నెఫ్ట్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు నిధుల బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ పెద్ద మొత్తంలో నిధులను తక్షణమే బదిలీ చేసుకోవచ్చు. -
పేటీఎం, ఫోన్‌పే.. ఢిష్యూం ఢిష్యూం
సాక్షి, న్యూఢిల్లీ: మెరిసే దంతా బంగారం కాదంటూ ప్రత్యర్థి కంపెనీపై ప్రముఖ చెల్లింపుల యాప్ ఫోన్ పే తీవ్ర విమర్శలకు దిగింది. తానే మార్కెట్ లీడర్నంటూ పేటీఎం అన్నీ గప్పాలు కొడుతోందని తన ప్రధాన ప్రత్యర్ధి, మరో డిజిటల్ మనీ పేమెంట్స్ ప్లాట్‌ఫాం పేటీఎంపై దాడికి దిగింది. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ లీడర్‌గా చెప్పుకుంటున్న పేటీఎంవి అన్ని అబద్ధాలే అంటూ ఆరోపిస్తోంది ప్లిప్కార్ట్కు చెందిన ఫోన్‌పే. అయితే ఈ మధ్య పేటియం యుపీఐ అధారిత డబ్బు చెల్లింపుల్లో తమే ముందున్నట్టు చెప్పుకుంది. దీంతో తమకు తామే నెంబర్ వన్‌గా పేటీయం చెప్పుకోవడం ఫోన్‌పేకు ఆగ్రహం తెప్పించింది. లావాదేవీల పరంగా చూస్తే పేటీయం చెల్లింపుల మార్కెట్లో ముందున్నట్టు కనిపిస్తున్నా.. దాని మొత్తం లావాదేవీల సగటు విలువతో పోల్చుకుంటే లావాదేవీల విలువ రూ.40 తక్కువగా ఉందని తెల్పింది. అసలు దాని వద్ద లావాదేవీల వివరాలు సరిగ్గా లేవని విమర్శించింది. యుపీఐను అధారిత సమాచారాన్ని పేటీయం తప్పుదోవ పట్టిస్తుందిని ఆరోపించింది. మొత్తం 21 మిలియన్ లావాదేవీలు పేటీయం వినియోగదారుల నుంచి ఫోన్ పే కు జరగగా అందులో 40వేల ప్రత్యేక వినియోగదారులు 500 లావాదేవీలను రూ.40 కంటే తక్కువగా జరిపారని తెలిపింది. మెరిసేదంతా బంగారం కాదు అంటు పేటీయం ను ఉద్దేశించి తన బ్లాగ్‌లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపు యాప్‌లను వాడుతుండటంతో ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి పోటీ తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్.. ఇలా భద్రం
బ్యాంకింగ్ లావాదేవీల్లో ప్రస్తుతం ఆన్లైన్ మాధ్యమం చాలా కీలక ంగా మారుతోంది. నగదు బదిలీ తదితర లావాదేవీలన్నీ సులభతరం, వేగవంతంగా జరగడమే కాకుండా చౌకగా ఉంటుండటం ఇందుకో కారణం. అయితే, సులభతరమైన మాధ్యమం అయినప్పటికీ ఆన్‌లైన్‌లోనూ కొన్ని చిక్కులుంటాయి. ఉదాహరణకు పొరపాటున ఖాతా నంబరు తప్పుగా ఎంటర్ చేయడం వల్ల ఒకరికి పంపాల్సిన డబ్బు మరొకరికి వెళ్లిపోవచ్చు. మరలాంటప్పుడు ఏం చేయాలి? అసలు అంతకన్నా ముందుగా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా లబ్దిదారును రిజిస్టర్ చేసుకునే సమయం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అనే దానిపై ఈ కథనం. సాధారణంగా ఆన్లైన్లో నగదు పంపదల్చుకున్నప్పుడు ఎవరికి పంపదల్చుకున్నామో వారి అకౌంటు నంబరును మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం లబ్దిదారు పేరు, అకౌంటు నంబరు, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. ఈ క్రమంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సదరు లబ్దిదారు అకౌంటు నంబరును రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అంకెల్లో తప్పులు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అంతే కాదు చాలా సందర్భాల్లో లబ్దిదారు పేరును నమోదు చేసిన అరగంట దాకా లావాదేవీలు జరపడానికి వీలుండదు. ఈ వ్యవధిలో రిజిస్టర్ చేయగోరుతున్న లబ్దిదారుల వివరాలను మరోసారి ధృవీకరించుకునేందుకు ఖాతాదారుల మొబైల్ నంబర్లకు బ్యాంకులు సంక్షిప్త సందేశాలు పంపుతుంటాయి. బాధ్యత మనదే.. అప్పటికీ ఒకోసారి తప్పిదాలు జరిగే అవకాశం ఉండొచ్చు. మనం అకౌంటు నంబరు రిజిస్టరు చేసుకునే సమయంలోనే ఏదో ఒక అంకె తప్పుగా పడి ఉంటే? దాన్ని గుర్తించకపోయినంత మాత్రాన.. ఆ తర్వాతెప్పుడైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ లావాదేవీ ఆగిపోదు. డబ్బు మరెవరికో వెళ్లిపోతుంది. అంతే కాదు పంపించే నగదు మొత్తంలో ఏమరుపాటుగా ఒక సున్నా అదనంగా చేర్చినా సమస్యే. ఇలాంటి తప్పిదాలకు పూర్తి బాధ్యత నగదు పంపే ఖాతాదారుదే అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు బ్యాంకుకు వెంటనే సమాచారం ఇవ్వాలి. మనం ఎంత త్వరగా సమాచారం ఇస్తే అంత త్వరగా లావాదేవీని నిలుపుదల చేసే వీలుంటుంది. ఒకవేళ ఖాతాదారుది, లబ్దిదారుది ఒకే బ్యాంక్ అయిన పక్షంలో నగదు దాదాపు చాలా వేగంగా బదిలీ అయిపోతుంది. కనుక గంటలోపే సమాచారం అందజేస్తే బ్యాంకులు వీలైనంత త్వరగా నగదును రివర్స్ చేసే వీలుంటుంది. అయితే, ఒకవేళ నగదు అప్పటికే బదిలీ అయిపోయిన పక్షంలో లబ్దిదారుకు కూడా సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి పర్మిషన్ లేకుండా బ్యాంకు ఆ మొత్తాన్ని వెనక్కి తేలేదు. ఒకవేళ లబ్దిదారు గానీ సహకరించకపోతే, చట్టబద్ధంగా వెళ్లాల్సి ఉంటుంది. ఏదైతేనేం... ఇలాంటివి జరగకుండా ఉండాలంటే లబ్దిదారు ఖాతా నంబరు రిజిస్టర్ చేసుకున్నాక ముందుగా చిన్న మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి పరిశీలించుకోవడం శ్రేయస్కరం.