online piracy
-
ఆన్లైన్లో భారీ సినిమా లీక్!
ముంబై: మరో భారీ సినిమా పైరసీ బారిన పడింది. విడుదలైన మరుసటి రోజే ఈ సినిమా ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన రోహిత్‌శెట్టి సినిమా ‘గోల్మాల్ ఎగైన్’ పైరసీదారులకు చిక్కింది. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టి అత్యధిక వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. తొలిరోజే రూ. 30 కోట్లుపైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ ఆనందం ఎంతసేపు నిలవలేదు. తర్వాతి రోజే మొత్తం సినిమా ఆన్లైన్లో వచ్చేసింది. కొన్ని వెబ్సైట్లలో ప్రింట్ బాగాలేదు. కాన్నీ వెబ్సైట్లలో హెచ్డీ ప్రింట్ ప్రత్యక్షం కావడంతో చిత్రయూనిట్ నివ్వెరపోయింది. పైరసీదారులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. గోల్మాల్ సిరీస్‌లో వచ్చిన నాలుగో సినిమా ఇది. ఇందులో అజయ్ దేవగణ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ ఖేము, ప్రకాశ్ రాజ్, అర్షద్ వార్సి, నీల్‌నితిన్ ముఖేష్, టబు, పరిణీతి చోప్రా ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా, ఇంతకుముందు రాజ్‌కుమార్ రావు సినిమా ‘న్యూటన్’ కూడా పైరసీ బారినపడింది. ఈ సినిమా భారత్ తరపున ఆస్కార్‌కు నామినేటయింది. -
ఆన్ లైన్ లో సినిమా మొత్తం లీక్
ముంబయి: మరో సినిమా ఆన్ లైన్ పైరసీ బారిన పడింది. షారూఖ్ ఖాన్ 'రాయిస్', ఆమిర్ ఖాన్ 'దంగల్' ఇటీవల ఆన్ లైన్ లో లీక్ కాగా.. తాజాగా రంగూన్ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా మొత్తాన్ని దుండగులు ఆన్ లైన్ లో పెట్టేశారు. ఈ నెల 24న రంగూన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన వెంటనే ఈ సినిమా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి లోనైంది. సినిమా మొత్తం ఆన్ లైన్ లో వచ్చేయడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడనుంది. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు అంతగా రాలేదు. ఇప్పుడు సినిమా మొత్తం ఇంటర్నెట్ లో వచ్చేయడంతో వసూళ్లు మరింత తగ్గే అవకాశముంది. పైరసీదారులను కనిపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన 'రంగూన్'పై మంచి రివ్యూస్ వచ్చాయి. విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైప్ అలిఖాన్, షాహిద్ కపూర్, కంగనా రౌనత్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
సినిమా ఆన్లైన్ పైరసీకి అడ్డుకట్ట వేస్తాం: కేటీఆర్
- సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు - పైరసీ అరికట్టే పోలీసులకు 'మూవీ కాప్' అవార్డులు అందజేస్తాం హైదరాబాద్: చలనచిత్ర రంగాన్ని వెంటాడుతున్న పైరసీ భూతం నుంచి రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. ఆన్లైన్ పైరసీ నుంచి సినిమాలను కాపాడటానికి నేర విచారణ విభాగం(సీఐడీ) సైబర్ విభాగం ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూస్తామన్నారు. ఎవరైనా ఆన్లైన్ పైరసీకి పాల్పడినట్లు తేలితే వారిపై ఐపీసీ-1973 యాక్టు, ఐటీ-2000 యాక్టు ప్రకారం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో 'తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యునిట్' (టీఐపీసీయు)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా పైరసీకి గురికావడం వల్లే జరిగే నష్టాలను వివరించారు. కొన్ని సినిమాలు విడుదల కాకముందే పైరసీ ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయంటూ 'ఉడ్తా పంజాబ్' సినిమాను ఉదహరించారు. పైరసీ వల్ల చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చాలావరకు ఆన్లైన్ పైరసీ ఆమెరికా నుంచి పనిచేసే వెబ్సైట్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించామని... వాటిని అక్కడి భారత అంబాసిడర్ హెచ్.ఈ.రిచర్డ్ రాహుల్ వర్మ సహకారంతో అరికడతామన్నారు. పైరసీ కోసం ప్రయత్నించే అక్కడి సైట్లను 'టీఐపీసీయూ' ద్వారా ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తామన్నారు. తద్వారా తెలుగు సినిమాను సాధ్యమైనంత వరకు పైరసీ భారీన పడకుండా కాపాడుతామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నీలిచిత్రాల వెబ్సైట్లను బ్లాక్ చేయగలిగామని వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క సంఘటన జరగకుండా శాంతిభద్రతలను అదుపులో ఉంచగలిగిన పోలీసులు తెలంగాణలో ఉండటం గర్వకారణమన్నారు. సవాళ్లను స్వీకరించి రాష్ట్ర పోలీసులు అత్యంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్లే పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడిందన్నారు. అలాగే పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. పాస్‌పోర్టు సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులకు ప్రత్యేక అవార్డు ప్రకటించిందని గుర్తు చేశారు. అలాగే సినిమా పైరసీని అరికట్టడానికి సీఐడీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. పైరసీని అరికట్టడంలో పోలీసులకు కూడా ప్రభుత్వం తరఫున 'మూవీ కాప్' అవార్డులు అందజేస్తామన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి.సురేష్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెరికాలో భారత అంబాసిడర్ హెచ్.ఈ.రిచర్డ్ రాహుల్ వర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, హైదరాబాద్ సిటీ కమిషనర్ పి.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, సీఐడీ ఐజీ సౌమ్య మిశ్రా, డిఐజీ రవి వర్మ, ఐటీశాఖ సెక్రటరీ జయేష్ రంజన్, ఉడ్తా పంజాబ్ సినిమా డైరెక్టర్ అభిషేక్ చౌబే తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.