Operation Amla
-
ముగిసిన ఆపరేషన్ ఆమ్లా
తీవ్రవాదుల కదలికలపై రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏమాత్రం అప్రత్తంగా ఉందో పరీక్షించేందుకు శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్ ఆమ్లా శనివారం సాయంత్రం ముగిసింది. ఈ 36 గంటల్లో 71 మందిని పట్టుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: 2008లో పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్రమార్గం ద్వారా రహస్యంగా ముంబయిలో ప్రవేశించి మారణహోమం సృష్టించడం, వందలాది మందిని బలిగొనడం దేశ ప్రజలు నేటికీ మర్చిపోలేదు. ఆ సంఘటన తరువాత దేశంలో తీవ్రవాదులు కార్యకలాపాలను సమూలంగా తుడిచిపెట్టేందుకు దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఆమ్లా అమలు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆ ఏడాది నుంచి తమిళనాడులో సైతం ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి రెండుసార్లు ఆపరేషన్ ఆమ్లా అమలు చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని 14 సముద్రతీర జిల్లాల్లో ఆపరేషన్ ఆమ్లాను మరింత ఉధృతంగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర డీజీపీ అశోక్‌కుమార్, సముద్రతీర గస్తీ దళాల డీజీపీ శైలేంద్రబాబు నేతృత్వంలో ఈనెల 11వ తేదీ ఉదయం 6 గంటలకు ఆపరేషన్ ఆమ్లాను ఆరంభించారు. శుక్రవారం నాడు అనేక చోట్ల మారువేషాలతో నగరంలోకి ప్రవేశించిన గస్తీ దళాలకు చెందిన 60 మంది పట్టుబడ్డారు.శనివారం ఉదయం కాశిమేడు ఫిషింగ్ హార్బర్లో నిలిచి ఉన్న ఒక నౌకలో 11 మంది దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. వారిని తీరంలోకి తీసుకువచ్చి విచారించగా ఆపరేషన్ ఆమ్లాలో భాగంగా చొరబాటుకు ప్రయత్నిస్తున్న గ స్తీదళాలని చెందిన కమెండోలుగా గుర్తించారు. శని వారం 6 గంటలతో ఆపరేషన్ఆమ్లా ముగియగా మొత్తం 71 మందిని పట్టుకున్నట్లు తెలిసింది. నాటుబాంబులు స్వాధీనం-ముగ్గురి అరెస్ట్ : తిరునెల్వేలీ పుళియరైలో ఏడు నాటుబాంబులను స్వాధీనం చేసుకుని ఈ కేసులో ముగ్గురు నిందితులను పేలుడు పదార్దాల నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులకు అందిన సమాచారం మేరకు పుళియరై పురందనై ఓడై రోడ్డులో పూడ్చిపెట్టిన ఉన్న నాటుబాంబులను తవ్వి తీశారు. కరప్పుస్వామి (32), శరవణకుమార్ (28), ఎబనేష్ (46)లను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఐఎస్ తీవ్రవాదుల కదలికలను అనుమానించిన పోలీసులు నిఘాపెంచారు. ఐఎస్ తీవ్రవాద సంస్థకు చెందిన ఆప్షన్ జబీన్ అనే మహిళ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో పట్టుబడింది. అధికారుల విచారణలో దక్షిణాదిపై దృష్టిపెట్టి అనేక మందిని ఐఎస్‌లో చేర్చుకున్నట్లు ఆమె తెలిపింది. అరెస్టయిన మహిళా తీవ్రవాది ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తమిళనాడులో కూడా ఐఎస్‌లో చేరిక సాగినట్లు అనుమానిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
ఆపరేషన్ ఆమ్లా
రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ పనితీరుకు పరీక్షపెడుతూ ప్రతిఏడాదీ నిర్వహించే ఆపరేషన్ ఆమ్లా శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 48 గంటలపాటు ఆపరేషన్ ఆమ్లా అమల్లో ఉంటుంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశంలోకి తీవ్రవాదుల చొరబాటును నియంత్రించేందుకు భారత్‌లోని త్రివిధ దళాలు అహర్నిశలు అప్రమత్తంగా ఉంటాయి. అయినా ఒక్కోసారి తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. 2008లో పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్రమార్గం గుండా రహస్యంగా ముంబయిలో ప్రవేశించి మారణహోమం సృష్టించారు. వందలాది మంది పౌరులేగాక పోలీసు ఉన్నతాధికారులు సైతం తీవ్రవాదుల చేతుల్లో బలైనారు. ఈ సంఘటనతో మరింత అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఏడాది ఆపరేషన్ ఆమ్లా నిర్వహించాలని ఆదేశించింది. ఆనాటి నుంచి తమిళనాడులో సైతం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా సముద్రతీర జిల్లాల్లో ఆపరేషన్ ఆమ్లాను మరింత ఉధృతంగా నిర్వహిస్తుంటారు. పోలీసు సిబ్బందిలోని కొందరు సాధారణ వస్త్రధారణతో విధుల్లో ఉన్న పోలీసుల కళ్లు గప్పి రాష్ట్రంలో అక్కడక్కడ తలదాచుకుంటారు. లేదా సముద్ర మార్గం గుండా రహస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తారు. ఇలా మారువేషాల్లో ప్రవేశించిన వారిని విధుల్లో ఉన్న పోలీసులు పట్టుకోవడాన్నే ఆపరేషన్ ఆమ్లా అంటారు. మారువేషాల్లో ఉన్నవారందరినీ చేజిక్కించుకున్నపుడే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నట్లు భావిస్తారు. చెన్నై నగరంలోని షాపింగ్‌మాళ్లు, సినిమా థియేటర్లు, ఆలయాలు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ప్రార్థనా మందిరాల్లో నిఘాపెడతారు. రాష్ట్రంలోని 14 సముద్రతీర జిల్లాల్లో పోలీసు, తీరప్రాంత గస్తీదళాలను అప్రమత్తం చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇందు కోసం ప్రత్యేక విభాగాన్ని తాత్కాలికంగా ప్రారంభించారు. పట్టుబడిన 60 మంది: ఆపరేషన్ ఆమ్లాలో భాగంగా పోలీసులు పలువురిని పట్టుకున్నారు. చెన్నై కాశీమేడులో చేపల వేలం పాట జరుగుతున్న చోట అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అతను సముద్రతీర గస్తీదళానికి చెందిన రాజేష్‌కుమార్ (28)గా గుర్తించారు. అతని వద్దనున్న నకిలీ నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చెన్నై హార్బర్ ‘0’గేటు వద్ద జరిపిన తనిఖీల్లో అరుమంది పట్టుబడ్డారు. వారంతా చెన్నై రాయపురం రైల్వేస్టేషన్లో బాంబులువేసే ప్రయత్నంలో పట్టుబడినట్లు కనుగొన్నారు. వీరుసైతం గస్తీదళానికి చెందినవారిగా గుర్తించారు. వీరి నుంచి మూడు నకిలీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం వరకు 60 మంది పట్టుబడినట్లు తెలుస్తోంది. విమాన దారుణంతో వాయిదా : ఈ ఏడాది జూన్ 9 వ తేదీన ఆపరేషన్ ఆమ్లా అమలు చేయాల్సి ఉండగా, 8వ తేదీ రాత్రి చెన్నై నుంచి పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లిన డోర్నియర్ కోస్ట్‌గార్డ్ విమానం ప్రమాదానికి గురైంది. తెల్లరగానే ప్రారంభించాల్సిన ఆపరేషన్ ఆమ్లాను ఈ ప్రమాద సంఘటనతో నిరవధికంగా వాయిదావేశారు. డోర్నియర్ విమాన ప్రమాదంలో ఇద్దరు పెలైట్లు, కమాండర్ మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. సుమారు మూడు నెలల విరామం తరువాత ఆనాటి ఆపరేషన్ ఆమ్లాను శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభించగా ఆదివారం ఉదయం 6 గంటలకు ముగిస్తారు. -
అంతు చిక్కని ‘కోస్ట్‌గార్డ్’
చెన్నై సముద్రతీర గస్తీ దళానికి చెందిన కోస్ట్‌గార్డ్ విమానం తప్పిపోయి గురువారానికి నాలుగురోజులైనా ఇసుమంత సమాచారం కూడా లభ్యం కాలేదు. కేంద్ర, రాష్ట్ర గస్తీ దళాలు విమానం ఆచూకీ కోసం గాలింపును మరింత ముమ్మరం చేశాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆపరేషన్ ఆమ్లా అమలులో భాగంగా ఈనెల 8వ తేదీన పుదుచ్చేరికి బయలుదేరిన కోస్ట్‌గార్డ్ విమానం (ఐసీజీ 791) అదే రోజు రాత్రి రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన సంగతి పాఠకులకు విదితమే. ఆ విమాన పెలైట్లు సుభాష్ కురేష్, ఎంకే టోనీ, అసిస్టెంట్ కమాండర్ విద్యాసాగర్ ప్రయాణిస్తూ గల్లంతయ్యారు. 8వ తేదీ రాత్రి నుంచి గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్న గస్తీదళాలకు నాలుగురోజులైనా ఎటువంటి క్లూ దొరకలేదు. పుదుచ్చేరి-నాగపట్నం సముద్రం మధ్యలో 180 ఏరోనాటికల్ మైళ్ల దూరంలో సిగ్నల్స్ కట్ అయినట్లు తెలుసుకున్నారు. పుదుచ్చేరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నాం, మరికొద్ది సేపట్లో చెన్నైకి చేరుకుంటామని పెలైట్ సుభాష్ ఆరోజు రాత్రి 9.23 నిమిషాలకు చెప్పినట్లు, ఆ తరువాతనే రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోయినట్లు నిర్ధారించారు. అలాగే అదే ప్రాంతంలో సముద్రపు నీటిపై నూనె తెట్టును గమనించినట్లు ఒక మత్స్యకారుడు కూడా చెప్పడంతో గాలింపు చర్యలకు అక్కడకు మళ్లించారు. విశాఖపట్నం నుంచి సబ్‌మెరైన్‌ను రప్పించారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లినపుడు ఎటువంటి అనుమానిత వస్తువులు కనపడినా వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్రంలోని 13 మత్స్యకార గ్రామాల్లో గస్తీ దళాల అధికారులు చాటింపు వేస్తున్నారు. గస్తీ అధికారులకు సహకరిస్తూ భారీ సంఖ్యలో మత్స్యకారులు గాలిస్తున్నారు. అత్యాధునికమైన 15 యుద్ధ నౌకలను రప్పించారు. విమానం అదృశ్యంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు భారత సముద్రతీర గస్తీదళాల తూర్పు ప్రాంత ఐజీ ఎస్పీ శర్మ గురువారం ప్రకటించారు. శోకసంద్రంలో పెలైట్ సుభాష్ కుటుంబం గల్లంతైన విమానంలో ప్రయాణిస్తున్న అధికారుల పేర్లను గోప్యంగా ఉంచారు. అయితే పెలైట్ సుభాష్ కురేష్ చెన్నై నంగనల్లూరుకు చెందిన వాడిగా వెల్లడైంది. 2008లో కోస్ట్‌గార్డ్ విధుల్లో చేరిన సుభాష్ గత ఏడాది డిసెంబర్లోనే బదిలీపై చెన్నైలో జాయినయ్యాడు. సుభాష్ తండ్రి సురేష్ చెన్నై హార్బర్ అధికారి కాగా తల్లి పద్మ గృహిణి, సుభాష్‌కు భార్య దీపాలక్ష్మి, ఇషాన్ అనే ఏడాది బిడ్డ ఉన్నారు. సుభాష్ తల్లి పద్మను మీడియా పలకరించగా, 8వ తేదీ రాత్రి ఇంటికి వస్తానని చెప్పివెళ్లాడు మళ్లీ రాలేదని కన్నీరుమున్నీరైనారు. దేశం కోసం పాటుపడుతున్న తన బిడ్డకు ఏమీ కాదు, తప్పకుండా ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆమె అంతలోనే తనకు తానే ధైర్యం చెప్పుకున్నారు. సుభాష్ క్షేమంగా తిరిగి రావాలని అందరం ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండని ఆమె చెప్పారు.