చెన్నై సముద్రతీర గస్తీ దళానికి చెందిన కోస్ట్‌గార్డ్ విమానం తప్పిపోయి గురువారానికి నాలుగురోజులైనా ఇసుమంత సమాచారం కూడా లభ్యం కాలేదు. కేంద్ర, రాష్ట్ర గస్తీ దళాలు విమానం ఆచూకీ కోసం గాలింపును మరింత ముమ్మరం చేశాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆపరేషన్ ఆమ్లా అమలులో భాగంగా ఈనెల 8వ తేదీన పుదుచ్చేరికి బయలుదేరిన కోస్ట్‌గార్డ్ విమానం (ఐసీజీ 791) అదే రోజు రాత్రి రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన సంగతి పాఠకులకు విదితమే. ఆ విమాన పెలైట్లు సుభాష్ కురేష్, ఎంకే టోనీ, అసిస్టెంట్ కమాండర్ విద్యాసాగర్ ప్రయాణిస్తూ గల్లంతయ్యారు. 8వ తేదీ రాత్రి నుంచి గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్న గస్తీదళాలకు నాలుగురోజులైనా ఎటువంటి క్లూ దొరకలేదు. పుదుచ్చేరి-నాగపట్నం సముద్రం మధ్యలో 180 ఏరోనాటికల్ మైళ్ల దూరంలో సిగ్నల్స్ కట్ అయినట్లు తెలుసుకున్నారు. పుదుచ్చేరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నాం, మరికొద్ది సేపట్లో చెన్నైకి చేరుకుంటామని పెలైట్ సుభాష్ ఆరోజు రాత్రి 9.23 నిమిషాలకు చెప్పినట్లు, ఆ తరువాతనే రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోయినట్లు నిర్ధారించారు.
అలాగే అదే ప్రాంతంలో సముద్రపు నీటిపై నూనె తెట్టును గమనించినట్లు ఒక మత్స్యకారుడు కూడా చెప్పడంతో గాలింపు చర్యలకు అక్కడకు మళ్లించారు. విశాఖపట్నం నుంచి సబ్‌మెరైన్‌ను రప్పించారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లినపుడు ఎటువంటి అనుమానిత వస్తువులు కనపడినా వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్రంలోని 13 మత్స్యకార గ్రామాల్లో గస్తీ దళాల అధికారులు చాటింపు వేస్తున్నారు. గస్తీ అధికారులకు సహకరిస్తూ భారీ సంఖ్యలో మత్స్యకారులు గాలిస్తున్నారు. అత్యాధునికమైన 15 యుద్ధ నౌకలను రప్పించారు. విమానం అదృశ్యంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు భారత సముద్రతీర గస్తీదళాల తూర్పు ప్రాంత ఐజీ ఎస్పీ శర్మ గురువారం ప్రకటించారు.
శోకసంద్రంలో పెలైట్ సుభాష్ కుటుంబం
గల్లంతైన విమానంలో ప్రయాణిస్తున్న అధికారుల పేర్లను గోప్యంగా ఉంచారు. అయితే పెలైట్ సుభాష్ కురేష్ చెన్నై నంగనల్లూరుకు చెందిన వాడిగా వెల్లడైంది. 2008లో కోస్ట్‌గార్డ్ విధుల్లో చేరిన సుభాష్ గత ఏడాది డిసెంబర్‌లోనే బదిలీపై చెన్నైలో జాయినయ్యాడు. సుభాష్ తండ్రి సురేష్ చెన్నై హార్బర్ అధికారి కాగా తల్లి పద్మ గృహిణి, సుభాష్‌కు భార్య దీపాలక్ష్మి, ఇషాన్ అనే ఏడాది బిడ్డ ఉన్నారు. సుభాష్ తల్లి పద్మను మీడియా పలకరించగా, 8వ తేదీ రాత్రి ఇంటికి వస్తానని చెప్పివెళ్లాడు మళ్లీ రాలేదని కన్నీరుమున్నీరైనారు. దేశం కోసం పాటుపడుతున్న తన బిడ్డకు ఏమీ కాదు, తప్పకుండా ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆమె అంతలోనే తనకు తానే ధైర్యం చెప్పుకున్నారు. సుభాష్ క్షేమంగా తిరిగి రావాలని అందరం ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండని ఆమె చెప్పారు.
అంతు చిక్కని ‘కోస్ట్‌గార్డ్’
Published Fri, Jun 12 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement