Coast Guard aircraft
-
ప్రధాని జోక్యం చేసుకోవాలి
గాలింపును తీవ్రతరం చేయాలి కోస్ట్‌గార్డ్ విమాన అధికారుల సతీమణులు వినతి చెన్నై, సాక్షి ప్రతినిధి: కోస్ట్‌గార్డ్ విమానం గల్లంతై పదిరోజులైనా అచూకీ లేనందున ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని అదే విమానంలో ప్రయాణించిన అధికారుల సతీమణులు బుధవారం విజ్ఞప్తి చేశారు.చెన్నై కోస్ట్‌గార్డ్ విమానం ఈనెల 8వ తేదీ రాత్రి చెన్నై నుంచి పుదుచ్చేరికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో గల్లంతైన సంగతి పాఠకులకు విదితమే. ఆ విమానంలో సుభాష్ సురేష్, సోనీ, విద్యాసాగర్ అనే అధికారులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురి ఆచూకీ లేదు. అదే రోజు రాత్రి 9.23 గంటల సమయంలో శీర్కాళీ-చిదంబరం మద్య ప్రయాణిస్తుండగా చివరిసారిగా సిగ్నల్ అందుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. గత పదిరోజులుగా తీవ్రస్థాయిలో గాలిస్తున్నా విమానం ఆచూకీ లభించలేదు. మూడురోజుల క్రితం జరిపిన గాలింపులో కూలిపోయిన విమానం బ్లాక్‌బాక్స్ నుండి సిగ్నల్స్ తగిలాయి. అయితే అవి స్పష్టంగా లేకపోవడం, తరచూ కట్ కావడంతో గాలింపు చర్యల్లో గందరగోళం నెలకొంది. గాలింపు వివరాలను గల్లంతైన అధికారుల కుటుంబాలకు అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే పదిరోజుల పాటూ భర్తల కోసం నిరీక్షించిన వారి సతీమణులు బుధవారం ప్రధానికి తమ గోడును వినిపించుకున్నారు. భారత సైన్యం పనితీరుపై తమకు ఎంతో నమ్మకం, గౌరవం ఉందని చెప్పారు. అయితే విమానం గల్లంతైన రాత్రి నుండి తమ భర్తల కోసం ఎదురుచూస్తూ నిద్రలేకుండా గడుపుతున్నామని వారు చెప్పారు. ప్రధానిగా ప్రత్యక్ష జోక్యం చేసుకోవడం వల్ల గాలింపు చర్యల్లో మరింత వేగం సాధ్యమని విద్యాసాగర్ భార్య సుష్మా తవాలా, సోని భార్య అమృత విన్నవించారు. పెలైట్ సుభాష్ సురేష్ భార్య దీపలక్ష్మి సైతం ప్రధానికి ట్వీట్ చేశారు. ‘ నా దైవ భక్తి వృథాపోదు, భర్త ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఇషాన్‌ను సైతం పెలైట్ చేయాలన్నదే సుభాష్ డ్రీమ్. కోస్ట్‌గార్డ్ విమాన గాలింపు వివరాలను ఎప్పటికప్పుడు బహిరంగ పరిస్తే పనుల్లో వేగం సాధ్యమవుతుందని ఆమె ప్రధానికి విన్నవించారు. -
‘నా భర్త క్షేమంగా తిరిగొస్తాడు’
పైలట్ సుభాష్ సతీమణి ధీమా మరో వారంలో విమానం ఆచూకీ చెన్నై, సాక్షి ప్రతినిధి:‘నాభర్తకు ఏమీ అయ్యి ఉండదు. ఎంతటి ప్రమాదమైనా ప్రాణాలు కాపాడుకునే శిక్షణ పొందాడు. కాబట్టి ఎప్పటికైనా క్షేమంగా తిరిగి వస్తాడు’.. ఈ ఉద్విగ్నభరితమైన మాట లు మరెవరివో కావు. ఈనెల 8వ తేదీన సముద్రంలో గల్లంతైన చెన్నై కోస్ట్‌గార్డ్ విమాన పెలైట్ సుభాష్ సురేష్ సతీమణి దీపలక్ష్మి చెమర్చిన హృదయం నుంచి పెల్లుబికి వచ్చినవి. చెన్నై నంగనల్లూరులో కాపురం ఉంటున్న దీపలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. సముద్రంలో విమానం గల్లంతైన నాటి నుంచి గస్తీదళాల అధికారులు ఎంతోబాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. గల్లంతైన విమానంలోని ముగ్గురు అధికారుల కుటుంబాలను కలుస్తూ ధైర్యం చెబుతున్నారు. విమానంలో బయలుదేరినపుడు అన్నిరకాల పరీక్షలు జరిపి ఫిట్‌గా ఉందని నిర్ధారించుకున్న తరువాతే బయలుదేరారు. అలాగే భర్త సుభాష్‌తోపాటు మిగిలిన ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. విమాన ప్రయాణానికి అవసరమైన ఇంధనంతోనే బయలుదేరారు. ఆపరేషన్ ఆమ్లాకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు నిర్ధారించుకుని తిరుగు ప్రయాణమైనారు. తిరుగు ప్రయాణంలో ఇంధన సరఫరాదారుతో సంభాషించారు. మాట్లాడుతున్న నిమిష వ్యవధిలో అంటే 8వ తేదీ రాత్రి 9.23 తిరుచ్చీ రాడార్ కేంద్రం నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. అత్యవసర పరిస్థితిలో సైతం మరో ఒకటిన్నర గంటపాటు ప్రయాణించేలా విమానంలో ఇంధనం ఉంది. అంతకు మించి ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఎగిరే అవకాశం ఉంది. 9.22 గంటలకు సైతం చెన్నై కంట్రోలు రూముకు సమాచారం ఇస్తుండినారు. 9 వేల అడుగుల ఎత్తునుంచి అకస్మాత్తుగా 7వేల అడుగుల ఎత్తుకు విమానం దిగింది. అదే స్థితిలో ప్రయాణించాలని అనుకున్నారు. ఇంతలో విమానం 5 అడుగులకు దిగింది. ఆ తరువాత ఉత్తరం దిశలో చెన్నైవైపుగా ఒక విమానం ప్రయాణిస్తూ చక్కర్లు కొట్టింది. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. ఒక వేళ విమానం ఆకాశంలోనే పేలిపోయి ఉంటే గాలింపులో వినియోగించిన రేడియస్ గుర్తించేది. ఈ కారణంగా విమానం పేలలేదని నిర్ధారించారు. ఒక వేళ మునిగిపోయి ఉంటే సబ్‌మెరైన్ ద్వారా గాలిస్తున్నారు. సముద్రంలో అనుమానిత మూడు ప్రాంతాల్లో గాలిస్తున్నా పేలిన అవశేషాలు లేవు. ఒకవేళ జనసంచారం లేని కొండ, లేదా అటవీ ప్రాంతాల్లో కూలిపోయిందని అనుమానిస్తున్నారు. ఫెలైట్ సోనికి పంపిన ఎస్ఎమ్ఎస్ సరైన రీతిలో డెలివరీ అయింది. అందువల్ల విమానంలో ప్రయాణించిన ముగ్గురు అందుబాటులో లేని ఏదో ఒక ప్రదేశంలో చిక్కుకుని ఉన్నారు. ఫెలైట్ల లైఫ్ జాకెట్టులో ఏడు రోజులకు సరిపడా చాక్లెట్ రూపంలో ఆహారం ఉంటుంది. అనారోగ్యానికి అవసరమైన మందులు ఉంటాయి. వారంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నానని దీపలక్ష్మి చెప్పారు. ఆచూకీకి మరోవారం:విమానం సిగ్నల్స్ లభ్యమైనా వేల అడుగుల సముద్రపు అడుగుభాగంలో ఉన్నందున దానిని అందుకునేందుకు మరోవారం పట్టవచ్చని తెలుస్తోంది. గాలింపు సిబ్బందికి విమానం సిగ్నల్స్ వదిలి వదిలి వస్తున్నాయి. తిరుచ్చీ రాడార్ కేంద్రం వద్దనే సిగ్నల్ తెగిపోయినందున అదే పరిసరాల్లో గాలింపు తీవ్రతరం చేశారు. గల్లంతైన విమానం సముద్రపు నీటిమట్టానికి 3వేల అడుగుల ఎత్తునుంచి పడిపోయినట్లు భావిస్తున్నారు. సిగ్నల్స్ లభిస్తున్న చోటు మరింత బురదగా, చిక్కదనంతో ఉంది. ఇటువంటి ప్రదేశం నుంచి సిగ్నల్ రావడం అరుదుగా భావిస్తున్నారు. అలాగే బురద నుంచి విమానాన్ని వెలికి తీయడం కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
అంతు చిక్కని ‘కోస్ట్‌గార్డ్’
చెన్నై సముద్రతీర గస్తీ దళానికి చెందిన కోస్ట్‌గార్డ్ విమానం తప్పిపోయి గురువారానికి నాలుగురోజులైనా ఇసుమంత సమాచారం కూడా లభ్యం కాలేదు. కేంద్ర, రాష్ట్ర గస్తీ దళాలు విమానం ఆచూకీ కోసం గాలింపును మరింత ముమ్మరం చేశాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆపరేషన్ ఆమ్లా అమలులో భాగంగా ఈనెల 8వ తేదీన పుదుచ్చేరికి బయలుదేరిన కోస్ట్‌గార్డ్ విమానం (ఐసీజీ 791) అదే రోజు రాత్రి రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన సంగతి పాఠకులకు విదితమే. ఆ విమాన పెలైట్లు సుభాష్ కురేష్, ఎంకే టోనీ, అసిస్టెంట్ కమాండర్ విద్యాసాగర్ ప్రయాణిస్తూ గల్లంతయ్యారు. 8వ తేదీ రాత్రి నుంచి గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్న గస్తీదళాలకు నాలుగురోజులైనా ఎటువంటి క్లూ దొరకలేదు. పుదుచ్చేరి-నాగపట్నం సముద్రం మధ్యలో 180 ఏరోనాటికల్ మైళ్ల దూరంలో సిగ్నల్స్ కట్ అయినట్లు తెలుసుకున్నారు. పుదుచ్చేరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నాం, మరికొద్ది సేపట్లో చెన్నైకి చేరుకుంటామని పెలైట్ సుభాష్ ఆరోజు రాత్రి 9.23 నిమిషాలకు చెప్పినట్లు, ఆ తరువాతనే రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోయినట్లు నిర్ధారించారు. అలాగే అదే ప్రాంతంలో సముద్రపు నీటిపై నూనె తెట్టును గమనించినట్లు ఒక మత్స్యకారుడు కూడా చెప్పడంతో గాలింపు చర్యలకు అక్కడకు మళ్లించారు. విశాఖపట్నం నుంచి సబ్‌మెరైన్‌ను రప్పించారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లినపుడు ఎటువంటి అనుమానిత వస్తువులు కనపడినా వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్రంలోని 13 మత్స్యకార గ్రామాల్లో గస్తీ దళాల అధికారులు చాటింపు వేస్తున్నారు. గస్తీ అధికారులకు సహకరిస్తూ భారీ సంఖ్యలో మత్స్యకారులు గాలిస్తున్నారు. అత్యాధునికమైన 15 యుద్ధ నౌకలను రప్పించారు. విమానం అదృశ్యంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు భారత సముద్రతీర గస్తీదళాల తూర్పు ప్రాంత ఐజీ ఎస్పీ శర్మ గురువారం ప్రకటించారు. శోకసంద్రంలో పెలైట్ సుభాష్ కుటుంబం గల్లంతైన విమానంలో ప్రయాణిస్తున్న అధికారుల పేర్లను గోప్యంగా ఉంచారు. అయితే పెలైట్ సుభాష్ కురేష్ చెన్నై నంగనల్లూరుకు చెందిన వాడిగా వెల్లడైంది. 2008లో కోస్ట్‌గార్డ్ విధుల్లో చేరిన సుభాష్ గత ఏడాది డిసెంబర్లోనే బదిలీపై చెన్నైలో జాయినయ్యాడు. సుభాష్ తండ్రి సురేష్ చెన్నై హార్బర్ అధికారి కాగా తల్లి పద్మ గృహిణి, సుభాష్‌కు భార్య దీపాలక్ష్మి, ఇషాన్ అనే ఏడాది బిడ్డ ఉన్నారు. సుభాష్ తల్లి పద్మను మీడియా పలకరించగా, 8వ తేదీ రాత్రి ఇంటికి వస్తానని చెప్పివెళ్లాడు మళ్లీ రాలేదని కన్నీరుమున్నీరైనారు. దేశం కోసం పాటుపడుతున్న తన బిడ్డకు ఏమీ కాదు, తప్పకుండా ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆమె అంతలోనే తనకు తానే ధైర్యం చెప్పుకున్నారు. సుభాష్ క్షేమంగా తిరిగి రావాలని అందరం ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండని ఆమె చెప్పారు. -
కోస్ట్‌గార్డ్ విమానం ఏమైంది?
ఆచూకీ లేని ముగ్గురు అధికారులు యుద్ధనౌకలతో ముమ్మరంగా గాలింపు ఆపరేషన్ ఆమ్లా రద్దు చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత దేశ భద్రతకు అంకితమైన సుముద్రతీర గస్తీదళాధికారులకే ముప్పువచ్చి పడింది. ముష్కర దాడులకు గురికాకుండా దేశాన్ని కాపాడుకునేందుకు నిర్వహించే కోస్ట్‌గార్డ్ విమానం విధుల్లో విషాదం అలుముకుంది. చెన్నై నుంచి పుదుచ్చేరికి సోమవారం రాత్రి బయలుదేరిన కోస్ట్‌గార్డ్ విమానం అదృశ్యమై అధికారుల గుండెల్లో అలజడి సృష్టించింది. ఆ విమానంలోని ఇద్దరు పెలైట్లు, ఒక అసిస్టెంట్ కమాండర్ ఆచూకీ తేలకపోవడం మరింత ఆందోళనకు కారణమైంది. సముద్ర మార్గం గుండా రహస్యంగా జొరబడిన పాకిస్తాన్ ముష్కరులు 2008లో ముంబైలో సాగించిన మారణకాండను భారతీయులు ఎన్నటికీ మరువజాలరు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆనాటి నుంచి సముద్రతీరాలను కట్టుదిట్టం చేశారు. సముద్రతీరాల్లో నిఘా పెంచారు. ఆపరేషన్ ఆమ్లా పేరుతో దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు మాక్‌డ్రిల్ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. తీవ్రవాదుల వేషంలో పోలీస్ అధికారులు సముద్ర తీరం గుండా నగరాల్లోకి జొరబడి ముందుగానే తాము రహస్యంగా నిర్ణయించకున్న ప్రదేశానికి చేరుకునేలోగా తమిళనాడు పోలీసు అధికారులు వీరిని పట్టుకోవడాన్నే ఆపరేషన్ ఆమ్లా అంటారు. తమిళనాడు సముద్రతీర గస్తీ దళాలు, కేంద్రప్రభుత్వ గస్తీదళాలు, తమిళనాడు పోలీసు విభాగం సంయుక్తంగా ఆపరేషన్ ఆమ్లా చేపడతారు. ఆపరేషన్ ఆమ్లా సమయంలో మాక్‌డ్రిల్ విధానంలో తీవ్రవాదుల రూపంలో చొరబడే అధికారులను పట్టుకునేందుకు జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, షాపింగ్‌మాల్స్, థియేటర్లు, బస్, రైల్వేస్టేషన్లు, ప్రార్థనాలయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో గత ఏడాది డిశంబరు తరువాత ఆపరేషన్ ఆమ్లా జరిపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభించి బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సి ఉంది. విమానం అదృశ్యం: సముద్రంలో గస్తీ విధులకు నౌకలను వినియోగిస్తే ఆలస్యం అవుతుంది కాబట్టి గత కొంతకాలంగా డోర్నియర్ రకం చిన్న విమానాలను చెన్నై కోస్ట్గ్డార్ వినియోగిస్తోంది. తెల్లారితే ఆపరేషన్ ఆమ్లా అమలుచేయాల్సినందున చెన్నై కోస్ట్‌గార్డ్‌కు చెందిన డోర్నియర్ చిన్నరకం విమానం (నెంబరు ఐసీజీ 791) చెన్నై నుండి పుదుచ్చేరికి సోమవారం రాత్రి 7 గంటలకు బయలుదేరింది. తీరా అరగంట కూడా ప్రయాణించక మునుపే రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. రాత్రి 7.23 గంటలకు తిరుచ్చి రాడార్ కేంద్రంతో చివరిసారిగా సిగ్నల్స్ అందాయి. ఆ తరువాత పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో సుభాష్ కురేష్, ఎంకే టోనీ అనే ఇద్దరు పెలైట్లు, విద్యాసాగర్ అనే అసిస్టెంట్ కమాండర్ ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురూ ఏమయ్యోరో తెలియరాలేదు. చెన్నైకి దక్షిణాన కారైక్కాల్‌కు 95 నాటికల్ మైళ్ల దూరంలో విమానం నుండి చివరిసారిగా సిగ్నల్స్ అందాయని గుర్తించినందున ఆదే పరిసరాల్లో కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కోస్ట్‌గార్డ్ విమానం అదృశ్యమైన కారణంగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం సాయంత్రం 6 గంటలవరకు తలపెట్టిన ఆపరేషన్ ఆమ్లా మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని రద్దు చేసి ఈనెల 15,16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రస్థాయిలో గాలింపు: విమానం నుంచి సిగ్నల్స్ తెగిపోగానే అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్ అధికారులు అప్రమత్తమైనారు. రాష్ట్రంలోని 13 సముద్రతీర జిల్లాలకు సమాచారం ఇచ్చారు. ఐదు యుద్ధనౌకలు, నాలుగు గస్తీ నౌకలను గాలింపు విధుల కోసం రంగంలోకి దించారు. 35 వేల ఫైబర్ బోట్ల ద్వారా పెద్ద సంఖ్యలో మత్స్యకారుల సేవలను గాలింపునకు వినియోగిస్తున్నారు. తమిళనాడు సముద్రతీర గస్తీదళ విభాగం డీజీపీ శైలేంద్రబాబు మాట్లాడుతూ విమానం ఆచూకీ కోసం అన్ని చర్యలు చేపట్టాం, ముఖ్యంగా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అధికారులను ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.