కోస్ట్‌గార్డ్ విమానం ఏమైంది?
ఆచూకీ లేని ముగ్గురు అధికారులు
యుద్ధనౌకలతో ముమ్మరంగా గాలింపు
ఆపరేషన్ ఆమ్లా రద్దు
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత దేశ భద్రతకు అంకితమైన సుముద్రతీర గస్తీదళాధికారులకే ముప్పువచ్చి పడింది. ముష్కర దాడులకు గురికాకుండా దేశాన్ని కాపాడుకునేందుకు నిర్వహించే కోస్ట్‌గార్డ్ విమానం విధుల్లో విషాదం అలుముకుంది. చెన్నై నుంచి పుదుచ్చేరికి సోమవారం రాత్రి బయలుదేరిన కోస్ట్‌గార్డ్ విమానం అదృశ్యమై అధికారుల గుండెల్లో అలజడి సృష్టించింది. ఆ విమానంలోని ఇద్దరు పెలైట్లు, ఒక అసిస్టెంట్ కమాండర్ ఆచూకీ తేలకపోవడం మరింత ఆందోళనకు కారణమైంది. సముద్ర మార్గం గుండా రహస్యంగా జొరబడిన పాకిస్తాన్ ముష్కరులు 2008లో ముంబైలో సాగించిన మారణకాండను భారతీయులు ఎన్నటికీ మరువజాలరు.
అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆనాటి నుంచి సముద్రతీరాలను కట్టుదిట్టం చేశారు. సముద్రతీరాల్లో నిఘా పెంచారు. ఆపరేషన్ ఆమ్లా పేరుతో దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు మాక్‌డ్రిల్ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. తీవ్రవాదుల వేషంలో పోలీస్ అధికారులు సముద్ర తీరం గుండా నగరాల్లోకి జొరబడి ముందుగానే తాము రహస్యంగా నిర్ణయించకున్న ప్రదేశానికి చేరుకునేలోగా తమిళనాడు పోలీసు అధికారులు వీరిని పట్టుకోవడాన్నే ఆపరేషన్ ఆమ్లా అంటారు. తమిళనాడు సముద్రతీర గస్తీ దళాలు, కేంద్రప్రభుత్వ గస్తీదళాలు, తమిళనాడు పోలీసు విభాగం సంయుక్తంగా ఆపరేషన్ ఆమ్లా చేపడతారు.
ఆపరేషన్ ఆమ్లా సమయంలో మాక్‌డ్రిల్ విధానంలో తీవ్రవాదుల రూపంలో చొరబడే అధికారులను పట్టుకునేందుకు జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, షాపింగ్‌మాల్స్, థియేటర్లు, బస్, రైల్వేస్టేషన్లు, ప్రార్థనాలయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో గత ఏడాది డిశంబరు తరువాత ఆపరేషన్ ఆమ్లా జరిపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభించి బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సి ఉంది.
విమానం అదృశ్యం:
సముద్రంలో గస్తీ విధులకు నౌకలను వినియోగిస్తే ఆలస్యం అవుతుంది కాబట్టి గత కొంతకాలంగా డోర్నియర్ రకం చిన్న విమానాలను చెన్నై కోస్ట్‌గ్డార్ వినియోగిస్తోంది. తెల్లారితే ఆపరేషన్ ఆమ్లా అమలుచేయాల్సినందున చెన్నై కోస్ట్‌గార్డ్‌కు చెందిన డోర్నియర్ చిన్నరకం విమానం (నెంబరు ఐసీజీ 791) చెన్నై నుండి పుదుచ్చేరికి సోమవారం రాత్రి 7 గంటలకు బయలుదేరింది. తీరా అరగంట కూడా ప్రయాణించక మునుపే రాడార్ కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. రాత్రి 7.23 గంటలకు తిరుచ్చి రాడార్ కేంద్రంతో చివరిసారిగా సిగ్నల్స్ అందాయి.
ఆ తరువాత పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో సుభాష్ కురేష్, ఎంకే టోనీ అనే ఇద్దరు పెలైట్లు, విద్యాసాగర్ అనే అసిస్టెంట్ కమాండర్ ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురూ ఏమయ్యోరో తెలియరాలేదు. చెన్నైకి దక్షిణాన కారైక్కాల్‌కు 95 నాటికల్ మైళ్ల దూరంలో విమానం నుండి చివరిసారిగా సిగ్నల్స్ అందాయని గుర్తించినందున ఆదే పరిసరాల్లో కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కోస్ట్‌గార్డ్ విమానం అదృశ్యమైన కారణంగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం సాయంత్రం 6 గంటలవరకు తలపెట్టిన ఆపరేషన్ ఆమ్లా మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని రద్దు చేసి ఈనెల 15,16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
తీవ్రస్థాయిలో గాలింపు:
విమానం నుంచి సిగ్నల్స్ తెగిపోగానే అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్ అధికారులు అప్రమత్తమైనారు. రాష్ట్రంలోని 13 సముద్రతీర జిల్లాలకు సమాచారం ఇచ్చారు. ఐదు యుద్ధనౌకలు, నాలుగు గస్తీ నౌకలను గాలింపు విధుల కోసం రంగంలోకి దించారు. 35 వేల ఫైబర్ బోట్ల ద్వారా పెద్ద సంఖ్యలో మత్స్యకారుల సేవలను గాలింపునకు వినియోగిస్తున్నారు. తమిళనాడు సముద్రతీర గస్తీదళ విభాగం డీజీపీ శైలేంద్రబాబు మాట్లాడుతూ విమానం ఆచూకీ కోసం అన్ని చర్యలు చేపట్టాం, ముఖ్యంగా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అధికారులను ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.