‘నా భర్త క్షేమంగా తిరిగొస్తాడు’
పైలట్ సుభాష్ సతీమణి ధీమా
మరో వారంలో విమానం ఆచూకీ
చెన్నై, సాక్షి ప్రతినిధి:‘నాభర్తకు ఏమీ అయ్యి ఉండదు. ఎంతటి ప్రమాదమైనా ప్రాణాలు కాపాడుకునే శిక్షణ పొందాడు. కాబట్టి ఎప్పటికైనా క్షేమంగా తిరిగి వస్తాడు’.. ఈ ఉద్విగ్నభరితమైన మాట లు మరెవరివో కావు. ఈనెల 8వ తేదీన సముద్రంలో గల్లంతైన చెన్నై కోస్ట్‌గార్డ్ విమాన పెలైట్ సుభాష్ సురేష్ సతీమణి దీపలక్ష్మి చెమర్చిన హృదయం నుంచి పెల్లుబికి వచ్చినవి. చెన్నై నంగనల్లూరులో కాపురం ఉంటున్న దీపలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే..
సముద్రంలో విమానం గల్లంతైన నాటి నుంచి గస్తీదళాల అధికారులు ఎంతోబాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. గల్లంతైన విమానంలోని ముగ్గురు అధికారుల కుటుంబాలను కలుస్తూ ధైర్యం చెబుతున్నారు. విమానంలో బయలుదేరినపుడు అన్నిరకాల పరీక్షలు జరిపి ఫిట్‌గా ఉందని నిర్ధారించుకున్న తరువాతే బయలుదేరారు. అలాగే భర్త సుభాష్‌తోపాటు మిగిలిన ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. విమాన ప్రయాణానికి అవసరమైన ఇంధనంతోనే బయలుదేరారు. ఆపరేషన్ ఆమ్లాకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు నిర్ధారించుకుని తిరుగు ప్రయాణమైనారు. తిరుగు ప్రయాణంలో ఇంధన సరఫరాదారుతో సంభాషించారు.
మాట్లాడుతున్న నిమిష వ్యవధిలో అంటే 8వ తేదీ రాత్రి 9.23 తిరుచ్చీ రాడార్ కేంద్రం నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. అత్యవసర పరిస్థితిలో సైతం మరో ఒకటిన్నర గంటపాటు ప్రయాణించేలా విమానంలో ఇంధనం ఉంది. అంతకు మించి ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఎగిరే అవకాశం ఉంది. 9.22 గంటలకు సైతం చెన్నై కంట్రోలు రూముకు సమాచారం ఇస్తుండినారు. 9 వేల అడుగుల ఎత్తునుంచి అకస్మాత్తుగా 7వేల అడుగుల ఎత్తుకు విమానం దిగింది. అదే స్థితిలో ప్రయాణించాలని అనుకున్నారు. ఇంతలో విమానం 5 అడుగులకు దిగింది. ఆ తరువాత ఉత్తరం దిశలో చెన్నైవైపుగా ఒక విమానం ప్రయాణిస్తూ చక్కర్లు కొట్టింది. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. ఒక వేళ విమానం ఆకాశంలోనే పేలిపోయి ఉంటే గాలింపులో వినియోగించిన రేడియస్ గుర్తించేది. ఈ కారణంగా విమానం పేలలేదని నిర్ధారించారు.
ఒక వేళ మునిగిపోయి ఉంటే సబ్‌మెరైన్ ద్వారా గాలిస్తున్నారు. సముద్రంలో అనుమానిత మూడు ప్రాంతాల్లో గాలిస్తున్నా పేలిన అవశేషాలు లేవు. ఒకవేళ జనసంచారం లేని కొండ, లేదా అటవీ ప్రాంతాల్లో కూలిపోయిందని అనుమానిస్తున్నారు. ఫెలైట్ సోనికి పంపిన ఎస్‌ఎమ్‌ఎస్ సరైన రీతిలో డెలివరీ అయింది. అందువల్ల విమానంలో ప్రయాణించిన ముగ్గురు అందుబాటులో లేని ఏదో ఒక ప్రదేశంలో చిక్కుకుని ఉన్నారు. ఫెలైట్ల లైఫ్ జాకెట్టులో ఏడు రోజులకు సరిపడా చాక్లెట్ రూపంలో ఆహారం ఉంటుంది. అనారోగ్యానికి అవసరమైన మందులు ఉంటాయి. వారంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నానని దీపలక్ష్మి చెప్పారు.
ఆచూకీకి మరోవారం:విమానం సిగ్నల్స్ లభ్యమైనా వేల అడుగుల సముద్రపు అడుగుభాగంలో ఉన్నందున దానిని అందుకునేందుకు మరోవారం పట్టవచ్చని తెలుస్తోంది. గాలింపు సిబ్బందికి విమానం సిగ్నల్స్ వదిలి వదిలి వస్తున్నాయి. తిరుచ్చీ రాడార్ కేంద్రం వద్దనే సిగ్నల్ తెగిపోయినందున అదే పరిసరాల్లో గాలింపు తీవ్రతరం చేశారు. గల్లంతైన విమానం సముద్రపు నీటిమట్టానికి 3వేల అడుగుల ఎత్తునుంచి పడిపోయినట్లు భావిస్తున్నారు. సిగ్నల్స్ లభిస్తున్న చోటు మరింత బురదగా, చిక్కదనంతో ఉంది. ఇటువంటి ప్రదేశం నుంచి సిగ్నల్ రావడం అరుదుగా భావిస్తున్నారు. అలాగే బురద నుంచి విమానాన్ని వెలికి తీయడం కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.