‘‘తెరమీద బొమ్మలు పరిపాలన చేస్తాయి’’ అని అప్పుడెప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పాడంటారు!. ఆ తర్వాత అది అక్షరం పొల్లుబోకుండా జరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో సినీతారలు రాజకీయాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్లలో ఉన్నత పదవులూ సైతం చేపట్టిన వాళ్లు కొందరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు అందుకు మినహాయింపేం కాదు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
హైదరాబాద్ నడిబొడ్డున నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జన సముద్రం మధ్య నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని (టీడీపీ) ప్రారంభించి.. దేశ రాజకీయాల్లోనే పెను ప్రభంజనం సృష్టించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో సినీ తారలెవరూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలోనూ రాజకీయంగా ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. అంతెందుకు తెలంగాణ నుంచి పురుడు పోసుకున్న టీడీపీ.. చంద్రబాబు వైఖరి కారణంగా నేడు అదే రాష్ట్రంలో కనుమరుగైన స్థాయికి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో సినీ తారల ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. విజయశాంతి, బాబూ మోహన్ లాంటి ఒకరిద్దరు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నా.. తెర ముందుకు వచ్చి వాళ్లు చేస్తున్న రాజకీయం అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. ఇక బండ్ల గణేష్ లాంటి వాళ్లు పరోక్ష రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్నప్పటికీ వాళ్ల ప్రభావం కూడా అంతంత మాత్రమే ఉంటోంది.
2014లో 'బాబు మోహన్' ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం వర్గం నుంచి గెలిచినప్పటికీ.. 2018లో ఓటమిపాలయ్యారు. 2023 ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు. 2018లో వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి రేష్మా రాథోడ్.. నోటా కంటే తక్కువ ఓట్లను పొంది ఓటమిపాలైంది.
2009లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నటి 'జయసుధ' సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు.
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీలో నటుడు నందమూరి బాలకృష్ణ, వైఎస్సార్‌సీపీలో ఆర్కే రోజా వంటి సినీతారలు మాత్రమే బరిలో ఉన్నారు.
ముందుకు రారేం!
ఒకప్పుడు తారలు ప్రచారం చేస్తే ఓట్లు రాలేవన్న నమ్మకం ఒకటి నడిచేది. కానీ, తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం ప్రచారం చేసే నటులు కూడా కరువైపోయారు. మొన్నటి అసెంబ్లీ, ఇప్పటి లోక్‌సభ ఎన్నికలకు సినీతారలంతా రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రం ఆ లోటును కాస్తో కూస్తో భర్తీ చేసే యత్నం మాత్రం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment