రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ పనితీరుకు పరీక్షపెడుతూ ప్రతిఏడాదీ నిర్వహించే ఆపరేషన్ ఆమ్లా శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 48 గంటలపాటు ఆపరేషన్ ఆమ్లా అమల్లో ఉంటుంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశంలోకి తీవ్రవాదుల చొరబాటును నియంత్రించేందుకు భారత్‌లోని త్రివిధ దళాలు అహర్నిశలు అప్రమత్తంగా ఉంటాయి. అయినా ఒక్కోసారి తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. 2008లో పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్రమార్గం గుండా రహస్యంగా ముంబయిలో ప్రవేశించి మారణహోమం సృష్టించారు. వందలాది మంది పౌరులేగాక పోలీసు ఉన్నతాధికారులు సైతం తీవ్రవాదుల చేతుల్లో బలైనారు.
ఈ సంఘటనతో మరింత అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఏడాది ఆపరేషన్ ఆమ్లా నిర్వహించాలని ఆదేశించింది. ఆనాటి నుంచి తమిళనాడులో సైతం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా సముద్రతీర జిల్లాల్లో ఆపరేషన్ ఆమ్లాను మరింత ఉధృతంగా నిర్వహిస్తుంటారు. పోలీసు సిబ్బందిలోని కొందరు సాధారణ వస్త్రధారణతో విధుల్లో ఉన్న పోలీసుల కళ్లు గప్పి రాష్ట్రంలో అక్కడక్కడ తలదాచుకుంటారు. లేదా సముద్ర మార్గం గుండా రహస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తారు. ఇలా మారువేషాల్లో
ప్రవేశించిన వారిని విధుల్లో ఉన్న పోలీసులు పట్టుకోవడాన్నే ఆపరేషన్ ఆమ్లా అంటారు. మారువేషాల్లో ఉన్నవారందరినీ చేజిక్కించుకున్నపుడే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నట్లు భావిస్తారు. చెన్నై నగరంలోని షాపింగ్‌మాళ్లు, సినిమా థియేటర్లు, ఆలయాలు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ప్రార్థనా మందిరాల్లో నిఘాపెడతారు. రాష్ట్రంలోని 14 సముద్రతీర జిల్లాల్లో పోలీసు, తీరప్రాంత గస్తీదళాలను అప్రమత్తం చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇందు కోసం ప్రత్యేక విభాగాన్ని తాత్కాలికంగా ప్రారంభించారు.
పట్టుబడిన 60 మంది:
ఆపరేషన్ ఆమ్లాలో భాగంగా పోలీసులు పలువురిని పట్టుకున్నారు. చెన్నై కాశీమేడులో చేపల వేలం పాట జరుగుతున్న చోట అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అతను సముద్రతీర గస్తీదళానికి చెందిన రాజేష్‌కుమార్ (28)గా గుర్తించారు. అతని వద్దనున్న నకిలీ నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే చెన్నై హార్బర్ ‘0’గేటు వద్ద జరిపిన తనిఖీల్లో అరుమంది పట్టుబడ్డారు. వారంతా చెన్నై రాయపురం రైల్వేస్టేషన్‌లో బాంబులువేసే ప్రయత్నంలో పట్టుబడినట్లు కనుగొన్నారు. వీరుసైతం గస్తీదళానికి చెందినవారిగా గుర్తించారు. వీరి నుంచి మూడు నకిలీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం వరకు 60 మంది పట్టుబడినట్లు తెలుస్తోంది.
విమాన దారుణంతో వాయిదా :
ఈ ఏడాది జూన్ 9 వ తేదీన ఆపరేషన్ ఆమ్లా అమలు చేయాల్సి ఉండగా, 8వ తేదీ రాత్రి చెన్నై నుంచి పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లిన డోర్నియర్ కోస్ట్‌గార్డ్ విమానం ప్రమాదానికి గురైంది. తెల్లరగానే ప్రారంభించాల్సిన ఆపరేషన్ ఆమ్లాను ఈ ప్రమాద సంఘటనతో నిరవధికంగా వాయిదావేశారు.
డోర్నియర్ విమాన ప్రమాదంలో ఇద్దరు పెలైట్లు, కమాండర్ మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. సుమారు మూడు నెలల విరామం తరువాత ఆనాటి ఆపరేషన్ ఆమ్లాను శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభించగా ఆదివారం ఉదయం 6 గంటలకు ముగిస్తారు.