Operation Gold Fish
-
ప్రతిరోజు గర్వపడుతూ ఈ సినిమా చేశాను
వినాయకుడు టాకీస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా, రచయిత అబ్బూరి రవి విలన్‌గా, సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆది మాట్లాడుతూ– ‘‘సినిమా చూసిన అందరూ నేను చేసిన అర్జున్ పండిట్ పాత్ర చాలా బావుందని అభినందిస్తున్నారు. ప్రతి రోజూ గర్వపడుతూ ఈ సినిమా చేశాను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ పాజిటివ్ రిపోర్ట్స్ చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు. సాయికిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘మా చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుండి సినిమా బావుంది అనే టాక్ రావడం ఆనందంగా ఉంది. సినిమా విజయం వెనక ఎంతో మంది ప్రోత్సాహం ఉంది. టెక్నీషియన్స్, మా టీమ్ అందరి హార్డ్ వర్క్‌తో ఈ సినిమా పూర్తయింది. సినిమా కొత్తగా ఉందని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ రాజు, పార్వతీశం, పద్మనాభ రెడ్డి, అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆపరేషన్ గోల్డ్ ఫిష్ జానర్ : యాక్షన్ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, అబ్బూరి రవి, శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్, మనోజ్ నందం సంగీతం : శ్రీచరణ్ పాకాల దర్శకత్వం : సాయికిరణ్ అడివి నిర్మాతలు : ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ స్వరూప్, పద్మనాభ రెడ్డి, ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ సాయికుమార్ వారసుడిగా తెరంగేట్రం చేసిన ఆది.. ఆరంభంలో మంచి విజయాలు అందుకున్నాడు. అనంతరం వరుస ఫెయిల్యూర్స్‌తో నిరాశపరిచాడు. ఇటీవల కాలంలో బుర్రకథ, జోడి వంటి సినిమాలు సరైన విజయాలు సాధించకపోవడంతో డీలా పడిన ఆది సాయి కుమార్.. తన పంథా మార్చుకొని విభిన్న కథాంశమైన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన అడివి సాయికిరణ్ ఆదిని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడా? ఆదికి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’తో విజయం అందుకున్నాడా? చూద్దాం. కథ: 1980లో కశ్మీర్ పండిట్లు జమ్మూ కశ్మీర్ వదిలివెళ్లాలంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగుతారు. ఘాజీబాబా (అబ్బూరి రవి) నేతృత్వంలోని ఓ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతుంది. పండిట్లను కశ్మీర్ నుంచి పంపించేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలనేది వారి కుట్ర. అయితే కొంతకాలం తర్వాత ఘాజీబాబా కశ్మీర్‌ను వదిలి హైదరాబాద్‌కు వస్తాడు. ఘాజీబాబా హైదరాబాద్‌కు వచ్చాడని తెలుసుకున్న ఎన్.ఎస్.జి కమాండో కెప్టెన్ అర్జున్ (ఆది) పక్కా వ్యూహంతో అతడిని అరెస్ట్ చేస్తాడు. ఘాజీబాబాకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష వేస్తుంది. అయితే ఘాజీబాబాను కాపాడేందుకు అతడి ముఖ్య అనుచరుడు ఫరూఖ్ (మనోజ్ నందం) ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ప్రారంభిస్తాడు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఏకే శర్మ (రావు రమేశ్) కూతురు నిత్యను కిడ్నాప్ చేసి భారత ప్రభుత్వాన్ని బెదిరించాలనేది ఫరూఖ్ ప్లాన్. అయితే నిత్యకు కార్తీక్ రాజు, తానియా, సాల్మన్‌లతో ఎలా పరిచయం ఏర్పడింది? కార్తీక్ రాజు, తానియాల ప్రేమ చిగురించిందా? చివరకు నిత్యను ఫరూఖ్ కిడ్నాప్ చేసి ఘాజీబాబాను విడిపిస్తాడా? ఫరూఖ్‌ను కెప్టెన్ అర్జున్ అడ్డుకుంటాడా? అనేదే మిగతా కథ. నటీనటులు: ఇప్పటివరకు లవర్ బాయ్‌గా సాఫ్ట్ లుక్‌లో కనిపించిన ఆది సాయి కుమార్ కెప్టెన్ ఆర్జున్ పాత్రలో రఫ్‌గా కనిపించాడు. కమాండో ఆపరేషన్లలో తన నటన, యాటిట్యూడ్‌తో మెప్పించాడు. అయితే ఒకే రకమైన ఎక్స్ప్రెషన్తో సినిమా మొత్తం కనిపిస్తాడు. ఇక తొలిసారి స్క్రీన్‌పై విలన్‌గా కనిపించిన రచయిత అబ్బూరి రవి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో మరో విలన్‌గా నటించిన మనోజ్ నందం తీవ్రవాదిగా అంతగా సూట్ కాలేదు. తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఏ కోణంలోనూ తీవ్రవాదికి ఉండాల్సిన లక్షణాలు కనిపించలేదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన శషా చెట్రి, నిత్య పర్వాలేదనిపించారు. కార్తీక్ రాజు, పార్వతీశంలు కాస్త ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఇక రావు రమేశ్ కేంద్ర మంత్రిగా ఒదిగిపోయాడు. కృష్ణుడు కనిపించింది కాసేపైనా చివర్లో కంటతడిపెట్టిస్తాడు. మిగతా తారాగణం వారి పాత్రల మేరకు మెప్పించారు విశ్లేషణ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆది.. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత వంటి సెన్సిటివ్ సినిమాలను తెరకెక్కించి మెప్పించిన దర్శకుడు సాయికిరణ్ అడివిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే సెన్సిటివ్ డైరెక్టర్‌గా ముద్రపడిపోయిన సాయికిరణ్ తీవ్రవాదం నేపథ్యం గల చిత్రాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. మంచి స్టోర్ లైన్ అయినప్పటికీ.. పూర్తి కథగా మలచడంలో రచయిత, దర్శకుడు విఫలమయ్యారు. రోటీన్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులు విసిగిపోతారు. ఆది నటుడిగా వంద మార్కులు సాధించనప్పటికీ.. అతడికి ఈ సినిమా బ్రేక్ ఇవ్వలేకపోయింది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల తన పాటలతో మెప్పించలేకపోయాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు కూడా అంత కొత్తగా ఏమనిపించలేదు. క్లైమాక్స్‌లో రామజోగయ్యశాస్త్రి అందించిన సాహిత్యం హార్ట్‌టచ్ చేసేలా ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనితనం తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ యాక్షన్ సీన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ రొటీన్ స్క్రీన్ ప్లే స్లో నేరేషన్ కాలేజ్, ప్రేమ సన్నివేశాలు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే సినిమా చేశారు. నేనూ అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే. ఇప్పటికీ చెబుతుంటా... నాకు కథ నచ్చితే రెమ్యునరేషన్ ఇవ్వొద్దు అని. కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులొస్తేనే ఇవ్వమని చెబుతా. డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అని నటుడు రాజశేఖర్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘1990లలో కశ్మీర్లో పండిట్లకు ఏం జరిగిందో అందరికీ తెలియాలని చేసిన ప్రయత్నం ఇది. ఆది ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం సాయికుమార్‌గారు.. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కశ్మీర్ పండిట్ల ఎమోషన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా తీయలేదు. మాకు తెలిసిన విషయాలను పదిమందికి చెబుదామని తీశాం’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘నాకు ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఆది మా అబ్బాయిలాంటివాడు’’ అన్నారు జీవితారాజశేఖర్. ‘‘ఈ ఫంక్షన్‌కి నేను ఆది కుటుంబ సభ్యుడిగా వచ్చాను.’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘‘ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రమిది’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి. నిర్మాతలు కేశవ్, ప్రతిభ, హీరో అడివి శేష్, నటులు కృష్ణుడు, మనోజ్ నందం, పార్వతీశం, కార్తీక్ రాజు, అనీష్ కురువిళ్ల, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. కెమెరా: జైపాల్‌రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా: అనిల్ రావిపూడి
ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. 'ఎయిర్ టెల్' మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్‌లు నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత రాజ్ కందుకూరి, యంగ్ సెన్సేషనల్ హీరో అడివి శేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ ఫంక్షన్ కి నేను అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చాను. సాయి కుమార్ గారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నేను అటెండ్ కావడం లేదు మన ఫ్యామిలీ మెంబర్‌గా నువ్వు వెళ్ళు అన్నారు. ఆది చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో అతడికి మంచి హిట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రైటర్ గా అబ్బూరి రవి గారు తెలుసు. యాక్టర్ గా ఆయనేంటో ఈ సినిమాలో చూస్తాం. ఆయన మంచి ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకోవాలని... మళ్లీ మాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. సాయి కిరణ్ గారి సినిమాలు అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ’అని అన్నారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ‘టైటిల్ బాగుంది. యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ సినిమాను నిర్మించి, విడుదల చేస్తున్నప్పుడు... యూత్ ఎట్రాక్ట్ అవుతారు. మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అబ్బూరి రవి గారి గురించి జీవిత, అడవి శేష్ నాకు చెబుతూ ఉంటారు. ఆయన ఫేమస్ రైటర్. చేయి పెడితే గోల్డే. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అబ్బూరి రవి గారు నటించడం కస్టమన్నారు. కాదు... రాయడమే కష్టం. రైటర్స్ కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని నేను అనుకునేవాడిని. అయితే... 'ఎవడైతే నాకేంటి' కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసినప్పుడు రైటర్ కష్టం తెలిసింది. అప్పుడు రైటర్స్ కి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదని అనుకున్నా. ఆది వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా కష్టపడతాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు’ అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘సాయి కుమార్, సురేఖ దంపతుల బదులు రాజశేఖర్ గారు, నేను వచ్చాం. వాళ్ళిద్దరికీ ఆది ఎంతో... మాకు అంతే. ఇప్పుడు మా అమ్మాయిలు ఇద్దరు నటిస్తున్నారు. వాళ్ళ సినిమాలు విడుదలైతే నేను ఎంత టెన్షన్ పడతామో... ఆది సినిమా విడుదలైనా అలాగే ఫీల్ అవుతాం. ఇక్కడికి వచ్చాక ఈ సినిమా కథ గురించి తెలిసింది. సైనికుల త్యాగాల గురించి తెలుసుకున్నా. సైనికుల పోరాటాలు, మరణాల గురించి పేపర్లలో చదివి ఊరుకోవడం కాదు అంతకు మించి ఆలోచించాలనే ఆలోచనను ఇందులోని దేశభక్తి గీతం కలిగించింది. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది గెటప్ చాలా బాగుంది. ఇప్పటివరకు అతడిని లవర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా చూశాం. కానీ, ఆర్మీ అధికారిగా చాలా బాగా చేశాడు’ అన్నారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘కశ్మీర్ ప్రతికూల పరిస్థితులు, వాతావరణం మధ్యలో కథలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. నీళ్లు కింద పోస్తే సెకన్లలో మంచులా మారేది. అటువంటి పరిస్థితుల్లో మేం షూటింగ్ చేశాం. నిజంగా... కశ్మీర్ కి వెళ్లి, ఎన్.ఎస్.జి కమాండో డ్రెస్ వేసుకుని షూటింగ్ చేయడం చాలా గర్వంగా అనిపించింది. సాయి కిరణ్ గారు కథ చెప్పి... ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రకు నిన్ను అనుకుంటున్నానని చెప్తే నేను నమ్మలేదు. సూట్ అవుతానా? లేదా? అని డౌట్ పడ్డాను. నన్ను నేను నమ్మలేదు. కానీ సాయికిరణ్ నన్ను నమ్మారు. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అక్టోబర్ 18న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నా కోసమో... ఎవరి కోసమో కాదు... సాయికిరణ్ అడివి కోసం. ఈమధ్య నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. నాకు ఈ సక్సెస్ ఇంపార్టెంట్. ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు ప్రౌడ్ ఇండియన్ అనే ఫీలింగ్ వస్తుంది’ అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ ‘మనం ఒక పని చేస్తే, ఆ పనికి విలువ ఉందని ప్రజలకు గుర్తుండి పోయేలా చేయడం చాలా కష్టమైన విషయం. మనకు క్రెడిబిలిటీ రావాలి. అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాకు పని చేసిన వాళ్ళు అందరూ నాకు ఫ్యామిలీతో సమానం. ఈ సినిమాకు ఒక క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ వచ్చాయి. అక్టోబర్ 19న ప్రసాద్ ఐమాక్స్ లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. నాతోపాటు ప్రేక్షకులందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ ‘కశ్మీర్ లో 1990లలో కశ్మీర్ పండిట్లకు ఏం జరిగిందో చాలామందికి తెలియదు. కశ్మీర్ ఇష్యూను టచ్ చేద్దామని అనుకున్నప్పుడు రచయిత అబ్బూరి రవి గారు చాలా పరిశోధన చేశారు. నేను, ఆయన కశ్మీర్ పండిట్లను కలిసి... ఏం జరిగింది? ఏంటి? అని పరిశోధన చేశాం. కశ్మీర్ పండిట్లకు జరిగినది బాధాకరమైన విషయమే. కానీ, జనాలకు తెలియని చేసిన ప్రయత్నం ఇది. అందరినీ భాగస్వామ్యులుగా చేసుకుని ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి అబ్బూరి రవి గారు. నువ్ డౌట్ పడకు సాయి. నిన్ను నువ్వు నమ్ము. నేను నమ్ముతాను. అందరూ నమ్ముతారు అని చెప్పి... నా వెన్నంటే ఉన్నారు. స్క్రిప్ట్ దగ్గరనుంచి ప్రతి విషయంలో ఎంతో సహాయం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్ కి రావడానికి కారణం మెయిన్ బ్యాక్ బోన్ అబ్బూరి రవి గారు. ఘాజీ బాబా పాత్రలో నటించమని ఆయన్ని నటించమని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది. మన పార్లమెంట్ మీద జరిగిన ఎటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అయితే తీవ్రవాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఆలోచించి... అమిత్ షా గారి స్ఫూర్తితో మా సినిమాలో రావు రమేష్ గారి పాత్రను డిజైన్ చేశాను. 'వందేమాతరం' అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో... ఈ సినిమాకు థియేటర్లలో రియాక్షన్ అలా ఉంటుంది’ అన్నారు. -
పబ్లిసిటీ కోసం కాదు
‘‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ చిత్రానికి కొన్ని వాస్తవిక సంఘటనలు తీసుకొని ఫిక్షనల్ పాయింట్స్ యాడ్ చేశాం. డైలాగ్స్ హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. కాశ్మీర్ సమస్యను పబ్లిసిటీ కోసం వాడుకోలేదు. కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా సినిమా కూడా నచ్చుతుంది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. ఆది సాయికుమార్, అబ్బూరి రవి, శషాచెట్రి, నిత్యా నరేశ్, కృష్ణుడు, పార్వతీశం, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పనిచేసిన వారందరూ నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘బాగా పరిశోధన చేసి ఈ కథ రాశాం. ఈ ప్రయాణంలో అబ్బూరి రవి నాకు ఎమోషనల్ సపోర్ట్‌గా నిలబడ్డారు’’ అన్నారు సాయికిరణ్ అడివి. ‘‘ఈ చిత్రంలో నన్ను నటించమని సాయికిరణ్ నాలుగు నెలల పాటు తిరిగాడు. నేను యాక్టర్‌ని కాదు రైటర్ని అంటూ తనకి కనబడకుండా తప్పించుకు తిరిగినా, ఫైనల్‌గా నటించా. నటుడిగా సరిపోయానా? లేదా? అనేది ప్రేక్షకులు చెప్పాలి’’ అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, కార్తీక్ రాజు, నిత్యా నరేశ్ మాట్లాడారు. -
అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’
ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). సెన్సిబుల్ సినిమాలు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత లాంటి సెన్సిబుల్ సినిమాలతో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యలను వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సాయికిరణ్ అడివి మాట్లాడుతూ.. ‘వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోంది. శ్రీచరణ్ పాకాల చక్కటి స్వరాలను, నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాలో దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను తప్పకుండా చేరుకుంటామన్న నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమా బావుందని మెచ్చుకున్నారు. అక్టోబర్ 18న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘తొలిసారి ఎన్.ఎస్.జి కమాండోగా నటించాను. నా లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సాయికిరణ్ అడివి గారు కథపై ఎంతో పరిశోధన చేసి సినిమా తీశారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను యంగ్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేయగా, ఈ చిత్రంతో నటుడిగా పరిచయం అవుతున్న అబ్బూరి రవి లుక్‌ను ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సినిమాలో బ్యాడ్ బాయ్ గా నటించిన మనోజ్ నందం ఫస్ట్ లుక్ ను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టీజర్ ఆవిష్కరించారు. ‘ఎయిర్ టెల్’ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ఓ సినిమాలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమవడం ఇదే తొలిసారి. -
గోల్డ్ ఫిష్ కీరవాణి పాట
ఆది సాయికుమార్ ఎన్.ఎస్.జి కమాండోగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. శషా చెత్రి, నిత్యా నరేష్ కథానాయికలు. రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా ఘాజీ బాబా పాత్రలో నటిస్తున్నారు. సాయికిరణ్ అడివి దర్శకుడు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి ఓ దేశభక్తి పాట పాడారు. ‘‘కీలక సన్నివేశంలో వచ్చే కీరవాణిగారు పాడిన పాట సినిమాని ఇంకో స్థాయికి తీసుకువెళ్లింది. రామజోగయ్య శాస్త్రిగారు విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు సాయికిరణ్. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే పాట ఇది. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటలోని సందేశం జనాలను ఆలోచింపచేస్తుంది. కీరవాణిగారి సంగీతం వింటూ పెరిగాను. నా సంగీతంలో ఆయన పాట పాడడం, పైగా ఆ పాటను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్), నిర్మాతలు: ప్రతిభ అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్ డేగల.