ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. 'ఎయిర్ టెల్' మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్‌లు నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత రాజ్ కందుకూరి, యంగ్ సెన్సేషనల్ హీరో అడివి శేష్ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ ఫంక్షన్ కి నేను అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చాను. సాయి కుమార్ గారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నేను అటెండ్ కావడం లేదు మన ఫ్యామిలీ మెంబర్‌గా నువ్వు వెళ్ళు అన్నారు. ఆది చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో అతడికి మంచి హిట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రైటర్ గా అబ్బూరి రవి గారు తెలుసు. యాక్టర్ గా ఆయనేంటో ఈ సినిమాలో చూస్తాం. ఆయన మంచి ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకోవాలని... మళ్లీ మాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. సాయి కిరణ్ గారి సినిమాలు అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ’అని అన్నారు.
హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ‘టైటిల్ బాగుంది. యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ సినిమాను నిర్మించి, విడుదల చేస్తున్నప్పుడు... యూత్ ఎట్రాక్ట్ అవుతారు. మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అబ్బూరి రవి గారి గురించి జీవిత, అడవి శేష్ నాకు చెబుతూ ఉంటారు. ఆయన ఫేమస్ రైటర్. చేయి పెడితే గోల్డే. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అబ్బూరి రవి గారు నటించడం కస్టమన్నారు. కాదు... రాయడమే కష్టం. రైటర్స్ కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని నేను అనుకునేవాడిని. అయితే... 'ఎవడైతే నాకేంటి' కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసినప్పుడు రైటర్ కష్టం తెలిసింది. అప్పుడు రైటర్స్ కి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదని అనుకున్నా. ఆది వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా కష్టపడతాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు’ అన్నారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘సాయి కుమార్, సురేఖ దంపతుల బదులు రాజశేఖర్ గారు, నేను వచ్చాం. వాళ్ళిద్దరికీ ఆది ఎంతో... మాకు అంతే. ఇప్పుడు మా అమ్మాయిలు ఇద్దరు నటిస్తున్నారు. వాళ్ళ సినిమాలు విడుదలైతే నేను ఎంత టెన్షన్ పడతామో... ఆది సినిమా విడుదలైనా అలాగే ఫీల్ అవుతాం. ఇక్కడికి వచ్చాక ఈ సినిమా కథ గురించి తెలిసింది. సైనికుల త్యాగాల గురించి తెలుసుకున్నా. సైనికుల పోరాటాలు, మరణాల గురించి పేపర్లలో చదివి ఊరుకోవడం కాదు అంతకు మించి ఆలోచించాలనే ఆలోచనను ఇందులోని దేశభక్తి గీతం కలిగించింది. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది గెటప్ చాలా బాగుంది. ఇప్పటివరకు అతడిని లవర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా చూశాం. కానీ, ఆర్మీ అధికారిగా చాలా బాగా చేశాడు’ అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘కశ్మీర్ ప్రతికూల పరిస్థితులు, వాతావరణం మధ్యలో కథలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. నీళ్లు కింద పోస్తే సెకన్లలో మంచులా మారేది. అటువంటి పరిస్థితుల్లో మేం షూటింగ్ చేశాం. నిజంగా... కశ్మీర్ కి వెళ్లి, ఎన్.ఎస్.జి కమాండో డ్రెస్ వేసుకుని షూటింగ్ చేయడం చాలా గర్వంగా అనిపించింది. సాయి కిరణ్ గారు కథ చెప్పి... ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రకు నిన్ను అనుకుంటున్నానని చెప్తే నేను నమ్మలేదు. సూట్ అవుతానా? లేదా? అని డౌట్ పడ్డాను. నన్ను నేను నమ్మలేదు. కానీ సాయికిరణ్ నన్ను నమ్మారు. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అక్టోబర్ 18న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నా కోసమో... ఎవరి కోసమో కాదు... సాయికిరణ్ అడివి కోసం. ఈమధ్య నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. నాకు ఈ సక్సెస్ ఇంపార్టెంట్. ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు ప్రౌడ్ ఇండియన్ అనే ఫీలింగ్ వస్తుంది’ అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ ‘మనం ఒక పని చేస్తే, ఆ పనికి విలువ ఉందని ప్రజలకు గుర్తుండి పోయేలా చేయడం చాలా కష్టమైన విషయం. మనకు క్రెడిబిలిటీ రావాలి. అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాకు పని చేసిన వాళ్ళు అందరూ నాకు ఫ్యామిలీతో సమానం. ఈ సినిమాకు ఒక క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ వచ్చాయి. అక్టోబర్ 19న ప్రసాద్ ఐమాక్స్ లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. నాతోపాటు ప్రేక్షకులందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ ‘కశ్మీర్ లో 1990లలో కశ్మీర్ పండిట్లకు ఏం జరిగిందో చాలామందికి తెలియదు. కశ్మీర్ ఇష్యూను టచ్ చేద్దామని అనుకున్నప్పుడు రచయిత అబ్బూరి రవి గారు చాలా పరిశోధన చేశారు. నేను, ఆయన కశ్మీర్ పండిట్లను కలిసి... ఏం జరిగింది? ఏంటి? అని పరిశోధన చేశాం. కశ్మీర్ పండిట్లకు జరిగినది బాధాకరమైన విషయమే. కానీ, జనాలకు తెలియని చేసిన ప్రయత్నం ఇది. అందరినీ భాగస్వామ్యులుగా చేసుకుని ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి అబ్బూరి రవి గారు. నువ్ డౌట్ పడకు సాయి. నిన్ను నువ్వు నమ్ము. నేను నమ్ముతాను. అందరూ నమ్ముతారు అని చెప్పి... నా వెన్నంటే ఉన్నారు. స్క్రిప్ట్ దగ్గరనుంచి ప్రతి విషయంలో ఎంతో సహాయం చేశారు.
ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్ కి రావడానికి కారణం మెయిన్ బ్యాక్ బోన్ అబ్బూరి రవి గారు. ఘాజీ బాబా పాత్రలో నటించమని ఆయన్ని నటించమని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది. మన పార్లమెంట్ మీద జరిగిన ఎటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అయితే తీవ్రవాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఆలోచించి... అమిత్ షా గారి స్ఫూర్తితో మా సినిమాలో రావు రమేష్ గారి పాత్రను డిజైన్ చేశాను. 'వందేమాతరం' అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో... ఈ సినిమాకు థియేటర్లలో రియాక్షన్ అలా ఉంటుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment