అత్తాకోడళ్లకు లొల్లి పెట్టిన కేసీఆర్
⇒ లొల్లి ఉంటేనే సీఎంకు సంబరం
⇒ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ
భిక్కనూరు : ప్రజలు అనునిత్యం లొల్లితో జీవిస్తేనే కేసీఆర్ కు సంబరం అని శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌అలీ షబ్బీర్ అన్నారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత జిల్లాకు మొదటి సారి వచ్చిన సందర్భంగా గురువారం బస్వాపూర్, భిక్కనూరులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతీ బీడి కార్మికురాలికి పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఒక ఇంటికి ఒకే ఫించన్ అంటూ అత్తా కోడళ్లకు కొత్త పంచాయితీ పెట్టాడన్నారు.
కోడళ్లు తమకు పెన్షన్ రాకపోవడానికి అత్తే కారణమంటూ ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందన్నారు. బంగారు తెలంగాణ అంటూ తన కుటుంబాలను బంగారు మయంగా చేసుకుంటూ ప్రజలను కార్యాలయాల చుట్లూ, జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిప్పుతున్నాడన్నారు.
సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ ఏర్పడిన విషయం ప్రతీ ఒక్కరికి తెలుసన్నారు. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ దెబ్బతింటుందని తెలిసి కూడా సోనియూ ఇచ్చిన మాటలకు కట్టుబడ్డారని అన్నారు. ఈ సందర్భంగా బస్వాపూర్‌లో ఎల్లమ్మ వేషధారణలో ఉన్న కళాకారిణి షబ్బీర్‌అలీని ఆశీర్వదించి అందరిని ఆకట్టుకుంది.
ఒకే ఇంటిలో నలుగురికి పదవులు: మాజీ ఎంపీ సురేష్ షెట్కార్
తెలంగాణ నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని సీఎం తన ఇంటిలో మాత్రం నలుగురికి పదవులు కట్టబెట్టుకున్నాడని మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నా అధికారులు సర్వే చేపట్టకపోవడం శోచనీయం అన్నారు.
పింఛన్లు, బియ్యం వత్తలేవు
పింఛన్లు, బియ్యం వస్తలేవు. మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటలేరు.. అంటూ భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాళ్లు పోచమ్మ, రాజవ్వ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ ఎదుట తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ పింఛన్లు, బియ్యం ఇస్తున్నామని చెప్పడం తప్ప ఆచరణలో విఫలమైందని ఆరోపించారు.