Optional Holiday
-
పాఠశాలలకు నేడు ఐచ్ఛిక సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఈ నెల 18వ తేదీని ఆప్షనల్ హాలిడేగా వినియోగించుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రతి ఉన్నత పాఠశాలలోని 30 శాతం మంది టీచర్లే ఐచ్ఛిక సెలవును వినియోగించుకోవాలని, మిగతా వారు పాఠశాలలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలకు ఆప్షనల్ హాలిడే నాడు సెలవుగా గతంలోనే విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
దసరా సెలవులపై తర్జన భర్జన
ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించే విషయంలో విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది. ప్రభుత్వానికి ఈ విషయంపై స్పష్టత లేకుండా పోవడం ... పూటకో ఉత్తర్వులు జారీ అవుతుండడంతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే మూడు తేదీలు మారాయి. పాఠశాలలకు మహాళాయ అమావాస్య రోజు నుంచి దసరా సెలవులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి తిలోదకాలిచ్చింది. ఈ సారి మహాళాయ అమావాస్యకు ఈ నెల 23న ఆప్షనల్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యా వార్షిక ప్రణాళికలో ఎస్సీఈఆర్టీ వారు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. తరువాత ఆ తేదీలను మార్చారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఇటీవల ప్రకటించారు.అయితే తెలంగాణ ప్రభుత్వం నెల ఈ నెల 23 నుంచి సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గందరగోళం నెలకుంది. ఆంధ్రకు కూడా ఈ నెల 24 నుంచి సెలవులను ప్రతిపాదిస్తూ ఎస్సిఈఆర్టి ప్రభుత్వానికి నివేదించింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా గత ఆనవాయితీని కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు తమకు తోచిన విధంగా ఉపాధ్యాయులకు మెసేజ్‌లు పంపడంతో మరింత అయోమయం ఏర్పడింది. ఈ చర్చ ఇలాకొనసాగుతుండగానే శనివారం కొన్ని టి.వి. ఛానెళ్ళలో ఈ నెల 23 నుంచి దసరా సెలవులుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి ప్రకటించినట్లు స్క్రోలింగ్‌లు వచ్చాయి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మెయిల్ వచ్చింది. ఆ వెంటనే ఆ మెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని దసరా సెలవుల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని జిల్లా విద్యాశాఖాధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. రోటీన్‌గా పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించే విషయంలో ఏమిటీ గందరగోళమో అర్థంకావడం లేదని ఉపాధ్యాయులే కాదు విద్యార్థుల తల్లిదండ్రులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారానికి గానీ ఓ స్పష్టత వచ్చేటట్టు కనిపించడం లేదు. పరీక్షల్లో కూడా...: దసరా సెలవులు అనంతరం పాఠశాలలో విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నిర్వహించే విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లోపించింది. జిల్లాలో అక్టోబర్ 9 నుంచి త్రైమాసిక పరీక్షలు సమ్మెటివ్-1 పరీక్ష నిర్వహించేందుకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు పరీక్షల కాలనిర్ణయ పట్టికను కూడా ప్రకటించారు. తాజాగా అక్టోబర్ 7 నుంచి త్రైమాసిక పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పరీక్షల తేదీలు మళ్ళీ మారే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ డైట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 8 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 20 హైస్కూళ్ళలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ పాఠశాలలో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమవుతుంది. దీంతో అక్టోబర్ 14 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలన్న ప్రతిపాదనను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.