ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని, ఇతర రక్షణ రంగ కర్మాగారాలను ప్రైవేటుపరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రతతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న74 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు హరీశ్‌రావు శనివారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ‘డిఫెన్స్ రంగానికి చెందిన ఏడు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది’అని తన లేఖలో పేర్కొన్నారు. ‘ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి గతేడాదిలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సిబ్బంది సమయానికి పూర్తి చేశారు.
కానీ ఈ ఏడాదిలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ‘ఖాయిలా పరిశ్రమ’’(సిక్ ఇండస్ట్రీ)గా ప్రకటిస్తారని కారి్మకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులతో పాటు పరోక్షంగా మరో ఐదువేల మంది ఉపాధి దెబ్బతింటుంది’అని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. ఎద్దుమైలారం ఫ్యాక్టరీలో యంత్రాలను ఆధునీకరించాలని, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు.