osmania univercity
-
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం మంగళవారం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917 ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఫర్మాన్ (రాజాజ్ఞ) జారీ చేశారు. అడిక్‌మెట్ జాగీర్‌లో నిజాం 2వ నవాబు నుంచి మహ లకాభాయి చందా బహుమతిగా పొందిన భూమిని తిరిగి 7వ నవాబుకు కానుకగా ఇవ్వడంతో అదే స్థలంలో ఓయూ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఓయూలో మంగళవారం ఫౌండేషన్ డే నిర్వహిస్తున్నారు. 105 వసంతాలు పూర్తి చేసుకున్న ఓయూలో కోటిమందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఎందరో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. తొలి రోజుల్లో ధనవంతుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించగా నేడు ఓయూ నూరుశాతం మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తుంది. ఏటా నిర్వహిస్తాం.. దేశంలోనే 7వ యూనివర్సిటీగా ప్రసిద్ధిగాంచిన ఓయూ తొలిసారి ఫౌండేషన్ డేను నిర్వహించడం గర్వంగా ఉంది. ఇకపై ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించాం. తొలిసారి జరుగుతున్న 105వ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. వందేమాతర ఉద్యమం మొదలు నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలు ఇక్కడే మొదలయ్యాయి. మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వందలాది మంది నాయకులను తయరు చేసిన ఘనత ఓయూకు దక్కుతుంది. – వీసీ ప్రొ.రవీందర్ ఆర్ట్స్ కాలేజీ భవనం నిర్మాణం చరిత్రాత్మకం ఓయూ ఐకాన్‌గా నిలిచిన ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణం చరిత్రాత్మకం. ఓయూ స్థాపనకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో నిజాం నవాబ్ 1934లో ప్రారంభించిన ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణానికి అంతే ప్రాముఖ్యత ఉంది. డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన ఓయూలో ప్రస్తుతం సుమారు 2.5 లక్షల విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వరకు దూరవిద్య, రెగ్యులర్ కోర్సులు చదువుతున్నారు. 87 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు ఓయూలో విద్యాభ్యాసం చేస్తున్నారు. – ప్రొ.అంజయ్య– చరిత్ర విభాగం 70 శాతం మహిళలు చదవడం ఓయూ ప్రత్యేకత ఓయూలో తొలిరోజుల్లో ధనవంతుల పిల్లలు చదువుకునేవారు. నేడు నూటి కి నూరుశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అందులో 70శాతం మహిళలు ఉండటం విశేషం. 105 ఏళ్ల చరిత్ర గల ఓయూకు పూర్వ వైభవం తెచ్చేందుకు వీసీ చేస్తున్న కృషి అభినందనీయం. – ప్రొ.సూర్య ధనుంజయ్– తెలుగుశాఖ. ఆనందంగా ఉంది అనేక మంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, రాజకీయ నాయకులను, ఇతరులను అందించిన ఓయూలో చదవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓయూ నేడు 105 ఫౌడేషన్ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది. –సంజయ్–పీహెచ్డీ విద్యార్థి. ఓయూ ఫౌండేషన్ డే పై నేడు లెక్చర్ ఓయూ 105వ ఫౌండేషన్ డే సందర్భంగా లోక్‌పాల్ సెక్రెటరీ భరత్‌లాల్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం లెక్చర్ ఇవ్వనున్నట్లు వీసీ ప్రొ.రవీందర్ తెలిపారు. సోమవారం ఫౌండేషన్ డేను విజయవంతం చేయాలని కోరుతూ వాక్ అండ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఓయూ ఇంజినీరింగ్ ఎదుట వీసీ విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10.30 నిమిషాలకు జరిగే ఫౌండేషన్ డే కార్యక్రమానికి విద్యార్థులు, సిబ్బంది అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు) -
డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్
సాక్షి, లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో తార్నాక ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఓయూ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తార్నాక నుంచి ఎర్రకుంటకు వెళ్లే మార్గంలో మంగళవారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు డ్రగ్స్, గంజాయి, హాష్ అయిల్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నార్కొటిక్ సిబ్బంది, ఓయూ పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు విక్రయదారులు కాగా మిగతా వారు వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి గంజాయి, హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. (చదవండి: Drugs Case: ‘హెచ్ న్యూ’ అదుపులో లక్ష్మీపతి) -
ఉస్మానియా.. 3 ప్రపంచ రికార్డులు
అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): ఉస్మానియా ఆస్పత్రి మూడు ప్రపంచ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి లయన్ కె.వి. రమణారావు, దక్షిణ భారత ప్రతినిధి శ్రీవిద్య, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి రాజు తదితరులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్‌కు భారత్ వరల్డ్ రికార్డ్స్, డాక్టర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్లను అందజేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ...అరుదైన శస్త్రచికిత్సలతోపాటు ప్రపంచానికి అనస్థీషియాను పరిచయం చేసిన ఘనత ఉస్మానియా ఆస్పత్రిదేనని పేర్కొన్నారు. కరోనా విజృంభణలోనూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించిందని, రోగుల రద్దీ, పనిభారం పెరిగినా ఇక్కడి వైద్యులు ఒత్తిడికి గురికాకుండా సహనంతో వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఆస్పత్రిలో 700 పైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. -
‘అమరావతి భూకంప జోన్లో ఉంది’
సాక్షి, హైదరాబాద్ : అమరావతి భూకంప జోన్లో ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగ రిటైర్డ్ అధిపతి రామదాస్ అన్నారు. అమరావతి భూకంపాల తీవ్రత విషయంలో జోన్-3లో ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తే రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.5 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ తెల్లవారుజామున కృష్ణ, గుంటూరు ప్రాంతాల్లో వచ్చిన భూకంపం.. అమరావతి ప్రాంతంలో వస్తే దాని వల్ల కలిగే నష్టం అధికంగా ఉంటుందన్నారు. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో భూఅంతర్భాగంలో గ్రానైట్ పొరలు ఉండటంతో ప్రకంపనల తీవ్రత అంతగా కనిపించలేదన్నారు. కానీ అమరావతిలో భూపొరలు అంత పటిష్టంగా లేకపోవడం వల్ల దాని ప్రభావం అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ రామదాసు వివరించారు. భూకంప ప్రమాదాల విషయంలో అమరావతితో పోల్చుకుంటే విశాఖ చాలా సురక్షితం అని రామదాసు తెలిపారు. అమరావతి ప్రాంతం భూకంపాల జోన్లో ఉందని గతంలో అనేక నివేదికలు అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి విన్నవించాయని తెలిపారు. అయినా అక్కడే రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టాలనుకున్నారో తెలియడం లేదన్నారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలంటే వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే పది రెట్లు అధికమవుతుందని... దాని కారణంగా రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందని రామదాసు హెచ్చరించారు. -
విద్యా జ్యోతులను ఆర్పుతారా..?
పభుత్వ తీరుపై ఏబీవీపీ ఫైర్ ఓయూలో స్వల్ప ఉద్రిక్తత సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల చెల్లింపుల కోసం ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలలు, యూనివర్సిటీలు బంద్ పాటించాయి. గతేడాదికి సంబంధించిన నిధులను ఇంకా విడుదల చేయకపోవడంపై ఏబీవీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. పల్లెల అభివృద్ధి కోసం గ్రామజ్యోతి పథకానికి రూ. 23 వేల కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్.. నిధులు విడుదల చేయకుండా విద్యాజ్యోతులను ఆర్పుతారా అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జమాల్పూర్ నిరంజన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన పంథా మార్చుకోకుంటే త్వరలో జరిగే శాసనసభ సమావేశాల సమయంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోపక్క ఉస్మానియా వర్సిటీలో బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్‌లోని వివిధ కళాశాలలను, కార్యాలయాలను బంద్ చేసి భారీ ర్యాలీగా ఎన్సీసీ గేటు వరకు చేరుకున్నారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వీరి మధ్య ఘర్షణ వాతావార ణం చోటుచేసుకుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 24 మంది ఏబీవీపీ కార్యకర్తలను ఖాకీలు అరెస్ట్ చేశారు. -
జవాబు పత్రాలు గల్లంతు
నిజామాబాద్ అర్బన్ న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల పీజీ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కళాశాలలో పరీక్ష రాసిన 69 మంది విద్యార్థుల జవాబు పత్రాలు మాయమయ్యాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగింది కళాశాలలో ఇటీవల పీజీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల ఆరో తేదీన పరీక్షలు ముగిశాయి. ఆ రోజు గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ అంశాల పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని ఐదు పీజీ కళాశాలలకు చెందిన 69 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్ష ముగియగానే జవాబు పత్రాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా పరీక్షల విభాగానికి తరలించడానికి కళాశాల అధికారులు ఏర్పాట్లు చేశారు. వాటిని తీసుకొని కళాశాల రికార్డు అసిస్టెంట్ అహ్మద్‌ఖాన్ నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. హైదరాబాద్ రైలు ఎన్నిక తర్వాత గమనించే సరికి జవాబు పత్రాల సంచి కనిపించలేదు. దీంతో అహ్మద్‌ఖాన్ ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ లింబాగౌడ్కు సమాచారం అందించారు. ఆయన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ వచ్చి వెతికారు. అనంతరం రైల్వే ఎస్సైకి ఫిర్యాదు చేశారు. ఆయన స్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజీలను గమనించగా.. అహ్మద్ ఖాన్ జవాబు పత్రాలను తీసుకొని రెలైక్కడం కనిపించింది. తర్వాత ఏం జరిగిందన్నది తేలియలేదు. జవాబు పత్రాలను తన సీట్లో పెట్టి మూత్రవిసర్జనకు వెళ్లి వచ్చానని, అప్పటికే జవాబు పత్రాల సంచి మాయమైందని అహ్మద్ ఖాన్ పోలీసులకు తెలిపారు. రికార్డు అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే జవాబు పత్రాలు గల్లంతయ్యాయని కళాశాల సిబ్బంది ఒకరు ఆరోపించారు. కళాశాల అధికారుల నిర్లక్ష్యం పరీక్షల నిర్వహణలో కొంతకాలంగా గిరిరాజ్ కళాశాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జవాబు పత్రాలను ఉస్మానియా పరీక్షల విభాగానికి తరలించాల్సిన బాధ్యత అకడమిక్ కోఆర్డినేటర్, చీఫ్ సూపరింటెండెంట్లపై ఉంటుంది. కానీ కొంతకాలంగా కళాశాలకు చెందిన రికార్డు అసిస్టెంట్, నాలుగో తరగతి ఉద్యోగులతో జవాబు పత్రాలను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జవాబు పత్రాలు మాయమయ్యాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు జవాబు పత్రాల గల్లంతుకు సంబంధించి కళాశాల అధికారుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరో తేదీన హైదరాబాద్ వెళ్లే రైళ్లో ప్రయాణికుల వివరాలను, సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇతర స్టేషన్లలో కూడా ఆరా తీస్తున్నారు. గల్లంతు వాస్తవమే పీజీ కళాశాలకు చెందిన సప్లిమెంటరీ పీజీ పరీ క్షల జవాబు పత్రాలు గల్లంతయ్యాయి. రికార్డు అసిస్టెంట్ వీటిని ఉస్మానియా యూనివర్సిటికీ తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ విషయాన్ని ఉస్మానియా పరీక్షల విభాగానికి తెలియజేశాం. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -లింబాగౌడ్, గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్