విద్యా జ్యోతులను ఆర్పుతారా..?
పభుత్వ తీరుపై ఏబీవీపీ ఫైర్
ఓయూలో స్వల్ప ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల చెల్లింపుల కోసం ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలలు, యూనివర్సిటీలు బంద్ పాటించాయి. గతేడాదికి సంబంధించిన నిధులను ఇంకా విడుదల చేయకపోవడంపై ఏబీవీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. పల్లెల అభివృద్ధి కోసం గ్రామజ్యోతి పథకానికి రూ. 23 వేల కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్.. నిధులు విడుదల చేయకుండా విద్యాజ్యోతులను ఆర్పుతారా అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జమాల్‌పూర్ నిరంజన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన పంథా మార్చుకోకుంటే త్వరలో జరిగే శాసనసభ సమావేశాల సమయంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
మరోపక్క ఉస్మానియా వర్సిటీలో బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్‌లోని వివిధ కళాశాలలను, కార్యాలయాలను బంద్ చేసి భారీ ర్యాలీగా ఎన్‌సీసీ గేటు వరకు చేరుకున్నారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వీరి మధ్య ఘర్షణ వాతావార ణం చోటుచేసుకుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 24 మంది ఏబీవీపీ కార్యకర్తలను ఖాకీలు అరెస్ట్ చేశారు.