తెలంగాణ భవన్ ముట్టడి : పోలీసుల లాఠీచార్జి
కరీంనగర్ రూరల్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏబీవీపీ నాయకులు తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ నివాసం, తెలంగాణ భవన్‌ను ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. ఏబీవీపీ నగర కార్యదర్శి అనిల్, జోనల్ ఇన్‌చార్జులు వినయ్, సాయి.శ్రీనివాస్, శశీధర్, రాజశేఖర్,క్రాంతి, కార్తీక్, జయసింహ, మణి, వెంకటేశ్, ధీరజ్‌ను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అంతకుముందు ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ జగదీశ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మొదటి విడతగా విడుదల చేసిన రూ. 500కోట్లు విద్యార్థుల ఖాతాల్లోకి చేరకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఫాస్ట్ పథకంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించకుండా కాలం గడుపుతున్నారని ఆరోపించారు.