నిజామాబాద్ అర్బన్ న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల పీజీ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కళాశాలలో పరీక్ష రాసిన 69 మంది విద్యార్థుల జవాబు పత్రాలు మాయమయ్యాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.
అసలేం జరిగింది
కళాశాలలో ఇటీవల పీజీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల ఆరో తేదీన పరీక్షలు ముగిశాయి. ఆ రోజు గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ అంశాల పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని ఐదు పీజీ కళాశాలలకు చెందిన 69 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
పరీక్ష ముగియగానే జవాబు పత్రాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా పరీక్షల విభాగానికి తరలించడానికి కళాశాల అధికారులు ఏర్పాట్లు చేశారు. వాటిని తీసుకొని కళాశాల రికార్డు అసిస్టెంట్ అహ్మద్‌ఖాన్ నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. హైదరాబాద్ రైలు ఎన్నిక తర్వాత గమనించే సరికి జవాబు పత్రాల సంచి కనిపించలేదు. దీంతో అహ్మద్‌ఖాన్ ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ లింబాగౌడ్‌కు సమాచారం అందించారు.
ఆయన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ వచ్చి వెతికారు. అనంతరం రైల్వే ఎస్సైకి ఫిర్యాదు చేశారు. ఆయన స్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజీలను గమనించగా.. అహ్మద్ ఖాన్ జవాబు పత్రాలను తీసుకొని రెలైక్కడం కనిపించింది. తర్వాత ఏం జరిగిందన్నది తేలియలేదు. జవాబు పత్రాలను తన సీట్‌లో పెట్టి మూత్రవిసర్జనకు వెళ్లి వచ్చానని, అప్పటికే జవాబు పత్రాల సంచి మాయమైందని అహ్మద్ ఖాన్ పోలీసులకు తెలిపారు. రికార్డు అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే జవాబు పత్రాలు గల్లంతయ్యాయని కళాశాల సిబ్బంది ఒకరు ఆరోపించారు.
కళాశాల అధికారుల నిర్లక్ష్యం
పరీక్షల నిర్వహణలో కొంతకాలంగా గిరిరాజ్ కళాశాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జవాబు పత్రాలను ఉస్మానియా పరీక్షల విభాగానికి తరలించాల్సిన బాధ్యత అకడమిక్ కోఆర్డినేటర్, చీఫ్ సూపరింటెండెంట్‌లపై ఉంటుంది. కానీ కొంతకాలంగా కళాశాలకు చెందిన రికార్డు అసిస్టెంట్, నాలుగో తరగతి ఉద్యోగులతో జవాబు పత్రాలను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జవాబు పత్రాలు మాయమయ్యాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసు నమోదు
జవాబు పత్రాల గల్లంతుకు సంబంధించి కళాశాల అధికారుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరో తేదీన హైదరాబాద్ వెళ్లే రైళ్లో ప్రయాణికుల వివరాలను, సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇతర స్టేషన్లలో కూడా ఆరా తీస్తున్నారు.
గల్లంతు వాస్తవమే
పీజీ కళాశాలకు చెందిన సప్లిమెంటరీ పీజీ పరీ క్షల జవాబు పత్రాలు గల్లంతయ్యాయి. రికార్డు అసిస్టెంట్ వీటిని ఉస్మానియా యూనివర్సిటికీ తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ విషయాన్ని ఉస్మానియా పరీక్షల విభాగానికి తెలియజేశాం. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
-లింబాగౌడ్, గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్
జవాబు పత్రాలు గల్లంతు
Published Mon, Jun 9 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement
Advertisement